తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. బీజేపీలో వేడి పెరిగింది. అయితే, ప్రస్తుత అస్థిర పరిస్థితులలో ఈ ఉత్సాహం, ఈ వేడి ఎంతకాలం ఉంటుందో, ఏ మలుపు తిరుగుతుందో చూడవలసిందే కానీ, ఉహించి ముందస్తు జోస్యం చెప్పలేమని పరిశీలకులు సైతం ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.
అయితే, 2018 ఎన్నికలకు 2023 ఎన్నికలకు మధ్య పోలిక పొంతన ఉండే అవకాశం లేదని, ఈ రెండు ఎన్నికల నడుమ టీఆర్ఎస్ – బీఆర్ఎస్’లకు మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికలలో కీలకంగా నిలిచిన తెలంగాణ సెంటిమెంట్, ఈ ఎన్నికలలో సైలెంట్. అయిపోయింది.ఇప్పుడు ఏ పార్టీ కూడా సెంటిమెంట్ ప్రస్తావన తీసుకురావడం లేదు. తెచ్చాం, ఇచ్చాం క్లెయిమ్స్ జోలికి వెళ్ళడం లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే అత్యవసరం అయితే తప్ప సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీయడం లేదు.
అది ముగిసిన అధ్యాయం అన్న విధంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్, ఇచ్చిన నాయకురాలు సోనియా గాంధీ అని చెప్పుకుంటూ హస్తం ఒక్క అవకాశం ఇవ్వండని ప్రజలను కోరుతోంది. ఇక బీజేపీ అయితే, మోదీ మంత్రం.. అమిత్ షా తంత్రం తప్పించి మరో విషయంపై దృష్టి పెట్టినట్లు కనిపించదు. సో … తెలంగాణ తొలి రెండు ఎన్నికల్లో కీలక ప్రభావం చూపిన తెలంగాణ సెంటిమెంట్ ఇప్పటికీ చాలా వరకు కనుమరుగైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే.
ముఖ్యంగా సెంటిమెంట్ ను ఉపయోగిం చుకుని ఇంతవరకు గరిష్ట ప్రయోజనం పొందిన బీఆర్ఎస్ కొత్త బాట పట్టింది. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పే ఉద్దేశంతో పార్టీ పేరుతొ పాటుగా పంథాను మార్చుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్టేట్ స్టేజి నుంచి వీఆర్ఎస్ తీసుకున్నారా? అన్నవిధంగా ఫోకస్ మొత్తం జాతీయ రాజకీయాల పైన కేద్రీకరించారు. ఈ నేపథ్యంలో 2023 ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడికి, కొత్త అధ్యాయానికి తెర తీస్తున్నాయని పరిశీలకులు భావిస్తునారు. అయితే తెలంగాణ సెంటిమెంట్ ప్రభావం లేక పోయినా, మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ క్యాస్ట్ కార్డును మరీ ముఖ్యంగా బీసీ కార్డును ప్రధాన అస్త్రం చేసుకునే ప్రయత్నాలు సాగిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బీసీలను తమవైపు తిప్పుకోవాలన్న లక్ష్యంతో మూడు పార్టీలూ అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీ తెలంగాణ ప్రత్యేకంగా బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. అధికారంలోకి వస్తే బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్ లో కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చింది. బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా, నామినేటెడ్ పదవుల్లో పెద్ద పీట, బీసీల్లోని చిన్న కులాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది పల్లెపల్లెకూ బీసీ- ఇంటింటికీ బీజేపీ పేరుతో ఈ విషయాలన్నీ ప్రచారం చేస్తామని కమల దళం చెబుతోంది.
అలాగే అతి త్వరలో లక్షలాది మందితో బీసీ గర్జన నిర్వహించేందుకు కూడా బీజేపీ సిద్ధమవుతోంది.అధికార బీఆర్ఎస్ మరోలా ముందుకెళ్తోంది. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా బీసీలలో వెనకబడిన కులాలకు లక్ష ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా బీసీ నినాదంతో రాబోతుంది. తెలంగాణలో బీసీ పాలసీ తీసుకొస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. త్వరలోనే రాష్ట్రంలో బీసీ గర్జన సభ పెడతామని ప్రకటించారు.
ఈదురు గాలులతో రైతులకు తీరని నష్టం. నేలకొరిగిన మామిడి చెట్లు.
రాష్ట్ర జనాభాలో బీసీ జనాభా అధికంగా ఉండడంతో సహజంగానే అన్ని పార్టీలు బీసీ ఓటు మీద కన్నేసి బీసీలను తమవైపు తిప్పుకునేందుకు ఏ పార్టీకి ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. నిజానికి, తెలంగాణలో ఇంతవరకు బీసీ, ఎస్సీ , ఎస్టీ, మైనారిటీ వరాలు బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపాయి. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయా సామాజికవర్గాలు ఎటువైపు నిలుస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బీసీలు ఎటు మొగ్గుచుపుతారు, అనేది కీలకంగా మారింది.