మిల్లర్ల వేధింపులు తాళలేని రైతు ధాన్యం బస్తాలను దగ్ధం చేసి ఆందోళనకు దిగిన ఘటన మహబూబాబాద్‌లో జరిగింది. ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు ధాన్యాన్ని చేర్చే క్రమంలో మిల్లర్ రైతును ఇబ్బందులకు గురి చేయడంతో ధాన్యం బస్తాలకు నిప్పంటించాడు.మిల్లర్ల వేధింపులు శృతి మించడంతో రగిలిపోయిన రైతు ధాన్యం బస్తాలకు నిప్పంటించి ఆందోళనకు దిగాడు. ఆరు గాలం శ్రమించి పండించిన పంటను విక్రయించేందుకు మధ్యలో దళారులు, మిల్లర్లు కుమ్మక్కై వేధింపులకు పాల్పడుతుండటంతో విసిగిపోయిన రైతు ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టి నిరసన తెలిపాడు.
తెలంగాణలో ప్రభుత్వం నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించిన తర్వాత మిల్లులకు ధాన్యం తరలించేందుకు సరైన ఏర్పాట్లు లేక పోవడంతో రైతులే తమ వాహనాల్లో పంపిస్తున్నారు.మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం నాగారం గ్రామంలోని ఓ మిల్లు వద్ద నిర్వాహకులు రైతును ధాన్యం తరలింపులో ఇబ్బందులకు గురిచేయడంతో రాత్రి ఓ రైతు ధాన్యం బస్తాలను దగ్ధం చేసి ఆందోళనకు దిగాడు. చిన్నగూడూరు మండలం విస్సంపల్లి గ్రామానికి చెందిన రైతు చిన్నాల భానుప్రకాష్ తన మూడు ఎకరాల్లో పండిన ధాన్యాన్ని గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొనుగోలు కేంద్రంలో విక్రయించారు.
నిర్వాహకుల సూచన మేరకు పెద్దనాగారం స్టేజీలోని శ్రీశ్రీ అగ్రో ఇండస్ట్రీస్ పారాబాయిల్డ్ రైస్ మిల్లు వద్దకు సొంత ట్రాక్టర్‌లో ధాన్యాన్ని ఈ నెల 19న తరలించారు.ధాన్యం తరలించి రెండ్రోజులు గడిచినా ఆదివారం రాత్రి వరకు మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోకపోవడంతో ఇదేమిటని వారిని ప్రశ్నించారు. దీంతో రైతు విక్రయించిన విస్సంపల్లి కొనుగోలు కేంద్రం ధాన్యాన్ని తమకు కేటాయించలేదని, ఆ ధాన్యాన్ని దిగుమతి చేసుకోమని సమాధానమిచ్చారు.దీంతో రైతు తిరిగి కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లగాఅక్కడి సిబ్బంది అదే మిల్లుకు వెళ్లాలని సూచించారు.
వారికి తాము అందజేసిన ట్రక్‌షీట్ చూపించాలని సూచించారు.రైతు తిరిగి ఆదివారం రైస్ మిల్లు వద్దకు వెళ్లి ధాన్యం దిగుమతి చేసుకోవాల్సిందిగా ప్రాధేయపడినా పట్టించుకోకుండా, అసభ్య పదజాలంతో దూషించారని రైతు ఆరోపించాడు. మిల్లర్ల తీరుకు నిరసనగా ట్రాక్టర్‌లో తెచ్చిన ధాన్యం బస్తాల్లో కొన్నింటిని కింద పడవేసి మిల్లు గేటు ఎదుట దహనం చేసి ఆందోళనకు దిగాడు. అక్కడే ఉన్న మిల్లు నిర్వాహకులు మంటలను అదుపు చేశారు. మిల్లర్లు సిండికేట్లుగా మారి రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతు ఆరోపించాడు