గ్రామీణులకు నాలుగు కోట్ల రూపాయల కుచ్చుటోపి సైబర్ కేటుగాళ్లు
Phillips Johnson & Johnson Earning App Scam in Telangana
- గ్రామీణులకు నాలుగు కోట్ల రూపాయల కుచ్చుటోపి పెట్టిన ఫిలిప్స్ జాన్సన్ అండ్ జాన్సన్ యాప్స్
- తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం రండి బాబు రండి 45 రోజుల్లోనే మీ డబ్బు మూడింతలు అంటూ ఆశ
- పెట్టుబడికి మూడింతలు ఇస్తామని సైబర్ వల, కొత్తవారిని చేర్పిస్తే బోనస్
- అప్పుచేసి బంగారం కుదువబెట్టి కుటుంబాల్లో ఒకరికి తెలియకుండా మరొకరి పెట్టుబడులు
- అత్యాశ అమాయకత్వం అవగాహన లేమిని క్యాష్ చేసుకున్న సైబర్ కేటుగాళ్లు
- సూర్యాపేట నల్లగొండ జిల్లాలో 500 పైగా లబోదిబోమంటున్న బాధితులు
- సైబర్ దొంగతనాల పట్ల అవగాహన పెంచుకుంటేనే ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట అంటున్న సైబర్ నిపుణులు పోలీసు వర్గాలు
మనిషి అత్యాశ అవగాహన లేని అమాయకత్వం తో సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకొని కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ప్రభుత్వం సంబంధిత పోలీస్ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా ఎంత అవగాహన కల్పించినా సైబర్ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోవడమే కాకుండా అడ్డుకట్టలు పడటం లేదు. దురాశ అనే మనిషి బలహీనతను సైబర్ కేటుగాళ్లు ఆసరాగా చేసుకుని కోట్లు దండుకొని అవతల పడుతున్నారు తాజాగా సూర్యాపేట నల్లగొండ జిల్లాలో ఫిలిప్స్ జాన్సన్ అండ్ జాన్సన్ అనే యాప్స్ ద్వారా వందలాదిమంది కోట్లు పోగొట్టుకున్న సంఘటన జరిగింది
కస్టమర్ కేర్ నుంచి ఫోన్లు ఆకట్టుకుంటున్న అమ్మాయిల మాటలు
ఫిలిప్స్ జాన్సన్ అండ్ జాన్సన్ అనే యాప్‌లు కంప్యూటర్ ద్వారా ఒక కస్టమర్ కేర్ ను ఏర్పాటు చేసి అమ్మాయిలను నియమించుకొని వారిద్వారా మొబైల్ ఫోన్లు నెంబర్లకు కాల్ చేయించి పలానా యాప్ లో పెట్టుబడి పెడితే మీరు పెట్టిన పెట్టుబడికి మూడింతలు డబ్బు 45 రోజుల్లో వస్తుందని ఆశను బాధితులలో చూపారు ఈ విషయాలను నమ్మిన సుమారు 500 మందికి పైగా బాధితులు నల్లగొండ సూర్యపేట జిల్లాలకు చెందినవారు పెట్టుబడులు పెట్టి సుమారు నాలుగు కోట్ల రూపాయలను పోగొట్టుకున్నట్టు బాధితులు వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా పెట్టుబడి పెట్టినవారు కొత్తవారిని చేర్పిస్తే అధిక మొత్తంలో బోనస్ ఇస్తామంటూ ఆశ చూపి నిలువునా ముంచారు
500 రూపాయలతో ప్రారంభ ఖాతా
ఫిలిప్స్ , జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు మొదటగా 500 రూపాయలతో తమ ఖాతా ప్రారంభించవచ్చు ఇలా పెట్టుబడి పెట్టిన వారికి 45 రోజుల్లో మూడింతలు లాభం వస్తుంది రోజువారీగా తమకు వచ్చిన లాభాన్ని ఆయ వ్యక్తుల ఖాతాల్లో సైబర్ కేటుగాళ్లు వేస్తుంటారు. ఇలా ప్రాథమిక దశలో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టినప్పుడు వెంటనే లాభాలను చూపిస్తూ డబ్బులను పెట్టుబడి పెట్టిన వారికి పంపిస్తూ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే మరింత లాభం వస్తుందని నమ్మబల్కుతారు దీంతో 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి 45 రోజుల్లో రోజుకు 5000 చొప్పున మీ ఖాతాల్లోకి పంపిస్తామని చెప్పడంతో పలువురు ఆశపడి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టారని పోలీస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పెట్టుబడి పెట్టిన మొదట్లో కొద్ది రోజులు బాగానే డబ్బులు ఆన్లైన్ అకౌంట్ లో వేసి తదుపరి యాప్ లను ఆన్లైన్లో ఎత్తేస్తుంటారు.
నల్లగొండ సూర్యపేట జిల్లాలో మోసపోయిన బాధితులు
ఈ నోట విన్న నలగొండ సూర్యపేట జిల్లాలో చెందిన పలువురు ఫిలిప్స్ జాన్సన్ అండ్ జాన్సన్ యాప్‌లలో పెట్టుబడి పెట్టి నిట్ట నిలువునా మోసపోయినట్టు బాధితులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లి మండలానికి చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు అరవపల్లి మండలంలోని జాజిరెడ్డిగూడెం వేల్పుచర్ల పర్సాయపల్లి స్టేజి కాసర్ల పాడు కుంచమర్తి రామన్నగూడెం చాకలి గూడెం నల్గొండ జిల్లాలోని శాలిగౌరారం మండలం వంగమర్తి ఇటుకులపాడు చిత్తలూరు తదితర గ్రామాల చెందిన సుమారు 500 మంది ఈ సైబర్లలో చిక్కుకొని డబ్బులు పోగొట్టుకున్నారు ఒక్క వేల్పుచర్ల గ్రామంలోనే 200 మంది దాకా బాధితులు ఉండడం గమనార్హం.
అప్పులు తెచ్చి బంగారం కుదువబెట్టి
వాస్తవానికి ఫిలిప్స్ జాన్సన్ జాన్సన్ ఆన్లైన్ యాప్ లో పెట్టుబడి పెట్టినవారు పెద్ద ధనికులు కాదు మధ్యతరగతి దిగువ తరగతి చెందిన అమాయకపు గ్రామీణులు చిన్నాచితక వ్యాపారాలు చేసుకునేవారు ఆశ అనే వలలో పడి డబ్బులు పోగొట్టుకున్న వారు యాప్ లో పెట్టుబడికి తమ దగ్గర డబ్బులు లేనప్పటికీ ఇంట్లో ఉన్న బంగారం మహిళల మెడలో ఉన్న బంగారం కుదువ పెట్టి మరీ కొందరు ఇతరుల వద్ద అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టారు ముఖ్యంగా స్థానిక చిరు వ్యాపారులు విద్యావంతులు మరికొందరు ఉద్యోగస్తులు రోజు కూలీలు ఆటో డ్రైవర్లు ఈ యాప్ లో వలలో చిక్కుకొని డబ్బులు పోగొట్టుకున్న ప్రధాన బాధితులు. మొదట్లో కొద్ది మొత్తంలో డబ్బులు తిరిగి రావడంతో వెంటనే పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెట్టి పోగొట్టుకున్న సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఒకే కుటుంబంలో అన్నకు తెలియకుండా తమ్ముడు తండ్రికి తెలియకుండా కొడుకు అమ్మకు తెలియకుండా బిడ్డ భార్యకు తెలియకుండా భర్త ఇలా ఆయా కుటుంబాల్లో ఒకరి తెలియకుండా ఒకరు ఎక్కువ లాభాలు వస్తాయని ఆశతో పెట్టుబడి పెట్టిన వారు ఉన్నారు
ఈనెల 19 నుంచి యాప్ బంద్
గత కొన్నాళ్లుగా గుట్టుగా సాగుతున్న ఈ ఆన్లైన్ దోపిడీ ఫిలిప్స్ జాన్సన్ అండ్ జాన్సన్ యాప్‌లు జూలై 19 అకస్మాత్తుగా బంద్ కావడంతో బాధితులు తలలు బాదుకుంటూ లబోదిబోమంటున్నారు.
నాలుగు కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టిన కేటుగాళ్లు
సూర్యాపేట నల్లగొండ జిల్లాలోని సుమారు 500 కు పైగా బాధితులు పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. వీరందరూ వద్ద నుంచి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు పైగా సైబర్ కేటుగాళ్లు గుంజారని అధిక మొత్తంలో పెట్టుబడులు రాగానే అతను చూసి ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టి యాపులను ఆపివేశారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఎవరికి చెప్పుకున్నా తమ బాధలు తీరేది కావనీ ,ఈ విషయంలో పోలీసులు చొరవ తీసుకొని మరింత లోతుగా విచారణ జరిపి తమ డబ్బులు తమకు ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఎక్కడో ఏ దేశంలోనో ఏ రాష్ట్రంలోనూ ఉండి నూతన సాంకేతిక పురోగతిని అందిపుచ్చుకొని మోసాలు చేయడమే ధ్యేయంగా పెట్టుకొని అమాయకులను లక్ష్యంగా చేసుకొని డబ్బులను కొల్లగొడుతున్న సంఘటనలు నేడు ప్రపంచంలో అనేకం జరుగుతున్న సందర్భంలో వీటికి అడ్డుకట్ట వేయడానికి పోలీసులు చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రతివారు కూడా నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని పోలీస్ వర్గాలు చెబుతున్నట్లుగా కొత్త యాప్‌లను లింకులను తెరవకుండా సైబర్ దోపిడీదారులఆశల వలలో చిక్కకుండా ప్రతివారు అవగాహన పెంచుకున్న నాడే ఇలాంటి సైబర్ మోసగాళ్లకు అడ్డుకట్ట పడుతుందని సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆ దిశగా ప్రతివారు చైతన్యవంతులు కావాలని చేతిలో ఫోన్ ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు వచ్చిన లింకులను గుడ్డిగా ఓపెన్ చేయొద్దని పోలీసు ఉన్నతాధికారులు సైబర్ విజ్ఞులు చెబుతున్న వాస్తవాలను అర్థం చేసుకొని స్వీయ రక్షణ పాటించి జాగ్రత్తలతో మెలగాలని మనము కోరుకుందాం.