బాలింతకు తీవ్ర ఇబ్బందులు
మెదక్ జిల్లాలో వర్షాలతో రోడ్లు అద్వాన్నంగా మారాయి. తండాలకు రోడ్లు సరిగా లేక వైద్యం కోసం గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. శివ్వంపేట మండలం రూప్ సింగ్ తండాలో వర్షాలకు రోడ్లు అధ్వానంగా మారడంతో అంబులెన్స్ వాహనం బురదలో కూరుకుపోయింది. అంబులెన్స్ లోనే వున్న బాలింత చంటిబిడ్డతో పాటు తీవ్ర ఇబ్బందులు పడింది.
మెదక్ ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ అయిన బాలింతను అంబులెన్స్ వాహనంలో ఇంటికి తీసుకెళ్తుండగా ఘటన జరిగింది. వర్షానికి తండా సమీపంలో రోడ్డు బురదమయంగా మారడంతో అంబులెన్స్ ఇరుక్కుపోయింది. బయటకు తీసే క్రమంలో అంబులెన్స్ మరింత కూరుకుపోయింది. దాంతో స్థానికులు పక్కనే వ్యవసాయ పొలంలో ఉన్న ట్రాక్టర్ను తెప్పించి, తాళ్ల సహాయంతో అంబులెన్స్ ని బయటకు తీసారు.