హైదరాబాద్, ఫిబ్రవరి 6, (న్యూస్ పల్స్)
తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సింగల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ ను సమర్ధించిన డివిజన్ బెంజ్.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐతో దర్యాప్తు చేపించాలని ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై ఏం జరుగుతుందనే ఉత్కంఠ అందరిలో ఏర్పడింది. సీబీఐతో విచారణకు గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ ఆదేశాలపై తెలంగాణ సర్కార్.. డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. సీబీఐ విచారణకే మొగ్గు చూపింది. ఈ కేసులో జనవరి 18న చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పును రిజర్వ్ చేశారు.
హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు వెళ్లేందుకు అడ్వకేట్ జనరల్ కొంత సమయం అడిగారు. అప్పటి వరకు ఆర్డర్ సస్పెండ్ లో ఉంచాలని కోరారు. అయితే ఆర్డర్ సస్పెన్షన్ కు హైకోర్టు నిరాకరించింది.బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎటువంటి మనీలాండరింగ్ జరగనప్పటికీ ఈడీ కేసు నమోదు చేయడం చెల్లదని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్‌కు సమాధానం ఇవ్వడానికి సమయం ఇవ్వాలని రోహిత్‌రెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేయడంతో.. విచారణ ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది.కాగా..
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. మోయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో కొందరు వ్యక్తులు.. తమను ప్రలోభపెట్టారన్న వ్యాఖ్యలు కలకలం రేపాయి. డబ్బు ఆశ చూపారని, పార్టీ మారేందుకు ఒత్తిడి చేశారని వివరించారు. దీంతో ఈ కేసు పలు మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతం సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతి పొందింది.అయితే, ఈ విషయంపై తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని కాబట్టి, ఆర్డర్ ను సస్పెన్షన్‌లో ఉంచాలని ప్రభుత్వం తరపు న్యాయవాది ద్విసభ్య ధర్మాసనాన్ని కోరారు. అందుకు న్యాయమూర్తులు నిరాకరించారు.
మాకేమి భయం లేదు- గువ్వల బాలరాజు
ఎమ్మెల్యేల ఎర కేసులో సీబీఐ విచారణకు సహకరిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో సీబీఐ దర్యాప్తును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను కేసీఆర్ ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇవాళ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలపై అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడారు.ఎమ్మెల్యే ప్రలోభాల కేసును సీబీఐ విచారిస్తే ఎందుకు భయపడతామన్నారు.
కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను, ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని దర్యాప్తు సంస్థలను ఆయన కోరారు. న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటామన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ముందుకు సాగుతున్నామన్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తిని దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ కేసులో సిట్ విచారణకు బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. సిట్ ఇచ్చిన నోటీసులపై హైకోర్టుకు వెళ్లి ఎందుకు స్టే తెచ్చుకున్నారని ప్రశ్నించారు.