టీడీపీ నేత, చింతకాయల అయ్యన్న పాత్రుడు
విజయవాడ ఫిబ్రవరి 16:సీఎం జగన్మోహన్ రెడ్డి పై టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్రెడ్డి డైరెక్షన్లోనే వైఎస్ వివేకా హత్య జరిగిందని ఆరోపించారు. బాబాయిని చంపడానికి ఎంపీ టిక్కెట్ కారణమని పేర్కొన్నారు. ఈ కేసులో విజయసాయిరెడ్డి ని కూడా సీబీఐ విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. తన తప్పులు బయటపడుతుంటే సీఎం జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. కోడికత్తి కేసు నాలుగేళ్లు అయినా ఎందుకు విచారణ సాగుతోందని ప్రశ్నించారు.
ఏపీ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. అసలు ఏపీకి సీఎం జగన్రెడ్డా..? సజ్జల రామకృష్ణారెడ్డా? అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు.వివేకానంద రెడ్డి హత్యను జగన్ రెడ్డి ఆనాడు చంద్రబాబు కు ఆపాదించారని, అవినీతి పత్రికలో విషం కక్కారని అయ్యన్న పాత్రుడు దుయ్యబట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాక హత్య కేసు మాఫీ చేయాలని చూశారని.. ఇప్పుడు సీబీఐ విచారణలో వాస్తవాలు బయటకి వస్తున్నాయన్నారు. రక్తపు మడుగులో ఉంటే విజయసాయి రెడ్డి గుండె పోటు అని ఎలా చెప్పారని ప్రశ్నించారు.