విజయవాడ, ఏప్రిల్ 19, (న్యూస్ పల్స్): ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు డైనమిక్‌గా మారుతున్నాయి. ఏ రోజు ఎలాంటి పరిస్థితి ఉంటుందో అంచనా వేయడం కష్టంగా మారింది. అధికార వైఎస్ఆర్‌సీపీని సమస్యలు చుట్టు ముడుతున్నాయి. ఓ వైపు పాలనా పరమైన సవాళ్లు మరో వైపు కేసులు చుట్టు ముడుతున్నాయి. ఈ కేసులు ప్రతిపక్షాలకు సంబంధం లేనివి. గతంలో తమకు రాజకీయంగా మేలు చేసిన కేసులు ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీకి చికాకు తెప్పిస్తూండటం ఏపీ రాజకీయాల్లో ప్రత్యేకం అనుకోవాలి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ అధికార పార్టీ పూర్తిగా డిఫెన్స్‌లోకి వెళ్లిపోతోంది. ప్రతీ దానికి వివరణ ఇవ్వాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితిని కంటిన్యూ చేస్తూ.. వైఎస్ఆర్‌సీపీని ఉక్కిరి బిక్కిరి చేయాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఏపీలో రాజకీయ ఎజెండా సెట్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్‌సీపీ ఎగ్రెసివ్ గా నిర్ణయాలు తీసుకుంటుంది. దూకుడుగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ సంప్రదాయ రాజకీయాలు చేస్తుంది. సహజంగా ఓ సారి అధికారంలో ఉండి ఓడిపోయిన పార్టీపై.. అధికారంలోకి వచ్చే పార్టీ ఎదురుదాడి చేయడానికి ఎప్పటికప్పుడు డిఫెన్స్‌లో పడేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. గత ప్రభుత్వ తప్పులను బయట పెట్టి .. ప్రజల్లో విపక్ష పార్టీని ఇబ్బంది పెట్టవచ్చు. వైఎస్ఆర్‌సీపీ మొదటి రెండేళ్లు అదే ప్రయత్నాలు చేసింది కానీ… రాను రాను గత ప్రభుత్వంలో ఫలానా తప్పు జరిగిందని సాక్ష్యాలతో సహా ప్రజల ముందు పెట్టలేకపోయారు. కానీ రెండేళ్ల తర్వాత నుంచి తామే కార్నర్ అవుతూ వస్తున్నారు. సంక్షేమ పథకాలు మాత్రమే ఎజెండా కావడం అభివృద్ధి లేకపోవడంతో ప్రధానంగా మైనస్ అయింది. వాటికి తోడు ఇప్పుడు గత నాలుగేళ్లుగా మెల్లగా నడుస్తున్న కేసులు ఎన్నికలకు ఏడాది ముందు క్లైమాక్స్‌కు వచ్చేశాయి. ఈ కేసుల వల్ల ప్రతిపక్షం టీడీపీకి ఇసుమంత ఇబ్బంది కలగదు.. కానీ అధికార పార్టీ మాత్రం ఎప్పటికప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. వైఎస్ వివేకా హత్య ఘటన గత ఎన్నికలకు ముందు జరిగింది. రకరకాల మలుపులు తిరిగి చివరికి క్లైమాక్స్‌కు వచ్చింది. సుప్రీంకోర్టు కూడా విచారణ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించింది. ఇప్పుడు ఈ కేసులో సీబీఐ ప్రధాన నిందితులుగా చెబుతున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలను వైఎస్ఆర్‌సీపీ మరో మాట లేకుండా సపోర్ట్ చేస్తోంది.
కారణం ఏమిటో తెలియదు కానీ నిజాయితీ నిరూపించుకోవాలని వైఎస్ అవినాష్ రెడ్డికి ప్రభుత్వ పెద్దలు చెప్పడంలేదు.. ఆయన నిజాయితిని నిరూపించడానికి వారే కష్టపడుతున్నారు. ఇది విపక్ష పార్టీకి కలిసి వచ్చింది. అసలు నిందితుల్ని ఎందుకు రక్షిస్తున్నారని ఎదురు దాడి చేస్తోంది. దాన్నే ఎన్నికల ప్రచారాస్త్రం చేస్తామన్నట్లుగా ప్రతిపక్ష నేత చంద్రబాబు చెబుతున్నారు. సీబీఐ దర్యాప్తు.. టీడీపీ చేసే విమర్శలపై వైఎస్ఆర్‌సీపీ ప్రతీ రోజూ వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఎదురుదాడి చేయడానికి ఇందులో టీడీపీని ఇబ్బంది పెట్టే విషయాలు లేకపోవడంతో పాటు.. చనిపోయిన వైఎస్ వివేకాపై అవినాష్ రెడ్డి దారుణమైన ఆరోపణలు చేస్తూండటంతో సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశం అవుతోంది. మరోవైపు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్‌పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి కేసు దర్యాప్తును ఎన్‌ఐఏ పూర్తి చేసింది. ఎన్‌ఐఏ కోర్టులో విచారణ ప్రారంభమయింది. బాధితుడు అయిన సీఎం జగన్ సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వెళ్లడంలేదు. అలాగే ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలిన అంశాలతో గతంలో ఈ ఘటనపై వైఎస్ఆర్‌సీపీ చేసిన ప్రచారాన్ని టీడీపీ గుర్తు చేస్తోంది. సానుభూతి కోసం జగన్ డ్రామా ఆడారని విమర్శలు చేస్తున్నారు. ఈ కేసు విషయంలో ఎన్ ఐఏ దర్యాప్తు కోరుకుంది వైఎస్ఆర్‌సీపీనే. ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు సరిగ్గా లేదని తాము చెప్పిన కోణాల్లో దర్యాప్తు చేయలేదని .. ఆ దర్యాప్తు సంస్థ తీరును విమర్శిస్తున్నారు. ఇవన్నీ టీడీపీకి అస్త్రాలుగా మారాయి. ప్రజల్లో దేనిపై ఎక్కువ చర్చ జరిగితే దాన్నే ఎన్నికల ఎజెండాగా మార్చాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ఉంది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీకి ఎంతో ఉపయోగపడ్డాయనుకున్న రెండు కేసులు ఇప్పుడు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారడం.. రాజకీయంగా విశేషమేనని అనుకోవచ్చు. వీటిపై ఎదురుదాడి చేయడానికి వైఎస్ఆర్‌సీపీ ఇబ్బంది పడుతోంది.