విశాఖపట్టణం, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్): రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి శనివారం విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. ఇటీవల ఎంవీవీ సత్యనారాయణ గారి కుమారుడు శరత్ చౌదరి – జ్ఞానిత వివాహం బెంగళూరులో జరిగింది. రిసెప్షన్ విశాఖపట్నంలో నిర్వహించారు. అయితే ఈ రెండు శుభకార్యాలకూ విజయసాయిరెడ్డి హాజరు కాలేకపోయారు. దీంతో కొత్త జంటను ఆశీర్వదించడానికి ఆయన ఎంవీవీ సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. కానీ కొత్త జంట విశాఖలో లేరు. దీంతో అక్కడి నుంచి వీడియో కాల్ చేసి మాట్లాడి ఆశీర్వదించారు.విజయసాయిరెడ్డి ఇలా ఎంపీ ఇంటికి వెళ్లడం వైసీపీలోనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. కొంత కాలంగా ఇద్దరు నేతల మధ్య సరిపడని పరిస్థితి ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లోనే ఈ విభేదాలు, ఈగోలు తారాస్థాయికి చేరుకున్నట్టు వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. ఒకరితో ఒకరికి పొసగక, ఒకరిగుట్టు ఇంకొకరు బయట పెట్టుకుంటూ మొత్తం పుట్టి ముంచేసేలా తయారైందని కొంత కాలంగా వైసీపీ నేతలు వారిలో వారు మథనపడుతున్నారు. రాజకీయ నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం.. ఆధిపత్య పోరు.. ఒకరి పరిధిలోకి.. ఒకరి వ్యాపార సామ్రాజ్యంలోకి ఇంకోరు చొరబడడం.. వంటివి ఇరు వర్గాల మధ్య జరిగాయి. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ.. వైస్సార్సీపీలో నంబర్ టూగా చెలామణి అవుతున్న విజయసాయి రెడ్డిలు పరస్పర విమర్శలు కూడా చేసుకున్నారు.
విశాఖ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములు.. రైతుల దగ్గరున్న వివాదాస్పద భూములను విజయసాయి రెడ్డి చవగ్గా కొన్ని.. రికార్డులు మార్చేసి ఇంకొన్ని తన బంధువుల పేర్లమీద్ మార్చేసుకున్నారని.. ఇంకొన్ని అయితే భూ యజమానులను భయపెట్టి చవగ్గా ఎంతో కొంత ఇచ్చి రాయించుకున్నారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంపై మీడియాకు కూడా సమాచారం ఇచ్చారని వైసీపీలో గుసగుసలు వినిపించాయి. తర్వాత విజయసాయిరెడ్డి కూర్మన్నపాలెంలో- ఎంవీవీ సత్యనారాయణకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ 11 ఎకరాల ప్రయివేట్ భూమిని డెవలప్మెంట్‌కు తీసుకున్న దాంట్లో ఉన్న లొసుగులను మీడియాకు ఇచ్చారు. ఇది సంచలనం అయింది.
ఇలా ఇలా ఒకరి బాగోతాన్ని ఒకరు బయటపెట్టుకుని మొత్తం పార్టీ పరువు తీస్తున్నారని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చివరికి విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలను తొలగించారు. అయినప్పటికీ ఆయన విశాఖ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఈ క్రమంలో ఎంవీవీ సత్యనారాయణతో రాజీకి వచ్చినట్లుగా తెలుస్తోంది. మామూలుగా అయితే ఆయన వచ్చే వారు కాదని.. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో.. పార్టీ నేతల మధ్య వర్గ పోరాటం ఉంటే సర్దుబాటు చేసుకోవాల్సిందేనని హైకమాండ్ ఆదేశించడతోనే ఆయన ఎంవీవీ ఇంటికి వెళ్లినట్లుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.