Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మళ్ళీ రెక్కలు తోడుకుంటున నాటుసారా రాకాసీ

0

కానరాని ఎక్సైజ్‌ అధికారులు దాడులు
ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలం లోని పల్లెల్లో నాటుసారా మళ్లీ గుప్పుమంటోంది. ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టినా, నల్లబెల్లం అమ్మకాలపై నిఘా
పెట్టినా.. ‘చక్కెర’రూపంలో కొత్త రెక్కలు తొడుక్కుంటోంది. గోదావరి నది వెంట.. అడవి మొదట్లో.. వ్యవసాయ బావుల వద్ద గుడుంబాగా విరగకాస్తోంది. సారా, గుడుంబా తయారీకి కొంతకాలంగా దూరంగా ఉన్నవారంతా.. తిరిగి మళ్లీ సారా వైపు మళ్లుతున్నట్లు ‘ముద్ర’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. ఎక్సైజ్‌ అధికారులు నాటుసారా తయారీదారులను అదుపులోకి తీసుకుని విచారించగా.. నల్లబెల్లం బదులుగా చక్కెర వాడుతున్న విషయాన్ని వెల్లడించారు.

చక్కెర ఎందుకంటే..?
రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణల కారణంగా నల్లబెల్లం దొరకడం లేదు. ఎక్కడైనా దొరికినా కిలో రూ.90 నుంచి రూ. 110 దాకా పలుకుతోంది. అది కూడా నమ్మకస్తులైన వారికే విక్రయిస్తున్నారు. అదే చక్కెరకు ఎంతైనా దొరుకుతుంది. నల్లబెల్లంతో పోలిస్తే చౌకగా వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో చక్కెర ధర రూ.45 వరకు ఉంది. అయితే వ్యాపారులు ఛత్తీస్‌గఢ్, ఏపీ రాష్ట్రాల నుంచి ఖండసారి చక్కెర (కాస్త నలుపుగా, నాణ్యత తక్కువగా ఉండే స్థానిక మిల్లుల చక్కెర)ను తీసుకొచ్చి రూ.35కే కిలో చొప్పున సారా తయారీదారులకు విక్రయిస్తున్నారు. దీంతో సారాకు చక్కెర వినియోగం పెరిగింది.

నాటుసారా మాఫియాతో కొందరు రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతున్నారు. .
పల్లెల్లో సారా మళ్లీ ఏరులై పారుతోంది. నల్లబెల్లం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. సారాకు బానిసై జనం అటు జేబులను ఇటు ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటున్నారు. అధికారుల అమ్యామ్యాలతో సారా తయారీ మళ్లీ ఊపందుకుంటోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కొన్ని ప్రాంతాల్లో నల్లబెల్లం దొరక్కపోవడంతో చక్కెర వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. కల్తీ సారాతో కొందరు ఆస్పత్రుల పాలవుతుంటే ఇంకొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అధికారులు సైతం మామాళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. సారా తయారీదారుల నుంచి ముట్టాల్సినవన్నీ ముట్టుతున్నాయని, అందుకే చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.పగలు రాత్రి అనే తేడా లేకుండా సారా అమ్మకాలు సాగుతుండడంతో చిన్నా, పెద్దా తేడా లేకుండా సారాకు బానిసలవుతున్నారు. పలు గ్రామాల్లో సారా తయారీ కుటీర పరిశ్రమగా మారింది. సారా తయారీ దారులు సారా తయారీలో బెల్లం ఊటతో పాటు అమ్మోనియా వంటి పలు రసాయన పదార్థాలు కలపడంతో కల్తీ సారా తయారు కావడంతో తాగే వారి ఆరోగ్యం దెబ్బ తింటుంది.ఈ విషయం తెలిసినా అలవాటును వదులుకోలేనివారు సారాకు బానిసై ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటున్నారు.

సారా తాగి తాగి ఆరోగ్యం పాడై మా నాన్న చనిపోయారు. మా అమ్మకు సారా తాగడం వల్ల క్యాన్సర్ గడ్డలైనయి. ఆ వ్యాధితో మా అమ్మ కూడా చనిపోయింది. నేనొక్కణ్నే మిగిలాను. మా ప్రాంతంలో చాలా మంది తమ తల్లిదండ్రులను, భర్తను, పిల్లలను కోల్పోయారు. సారా తాగడం వల్లే కాదు.. తాగుడుకు బానిసై మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గుడుంబా మా గూడెంలో గుప్పుమంటోంది. కళ్ల ముందే మా వాళ్లు చనిపోతుంటే ఏం చేయలేకపోతున్నాం. దయచేసి అధికారులు మా గూడెంలో ఈ సారా మహమ్మారిని వెళ్లగొట్టాలి. మా బతుకులు మార్చాలి.”

– గూడెం ప్రజలు
రెక్కాడితే కానీ డొక్కాడని ఈ ఆదివాసీల్లో చాలా మంది… రోజు వారీగా సంపాదించిన డబ్బును గుడుంబా కోసమే ఖర్చు చేస్తున్నారు. వీటికి అలవాటు పడిన వారు ఆరోగ్యంపై దృష్టి పెట్టడమే మానేశారు. అసలే పౌష్టికాహారానికి నోచుకోని వీరు… సారాకు బానిసవటంతో చిన్నవయసులోనే ప్రాణాలు కోల్పోతూ…. కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో తమ గూడేల మనుగడ ప్రశ్నార్థంగా మారుతుందని ఆదివాసులు ఆందోళన చెందుతున్నారు. నాటు సారా… ఇళ్లకు ఇళ్లను, ఊళ్లకు ఊళ్లను కబళించే భూతం. గుడుంబా నిర్మూలనతోనే ప్రగతి సాధ్యమని భావించిన సర్కార్‌… రాష్ట్రంలో ఎక్కడికక్కడ నిర్మూలన చర్యలు చేపట్టింది. అయితే సర్కార్‌ సంకల్పం కేవలం పట్టణాలు, వాటికి చేరువలో ఉన్న గ్రామాల్లో నెరవేరినా.. మారుమూల ప్రాంతాల్లో మాత్రం గుట్టుచప్పుడు కాకుండా గుప్పుమంటూనే ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie