స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: సిస్ బ్యాంకు నుండి తెస్తానన్న నల్లధనం ఏది? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ బిజెపి ప్రభుత్వాన్ని ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల బివైజి ఫంక్షన్ హాల్ లో గురువారం టిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. మండల పార్టీ అధ్యక్షుడు భూక్య రమేష్ నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన దేశపతి మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వస్తే ఇతర దేశాల్లో ఉన్న నల్లధనం తెప్పించి ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు జమ చేస్తామని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ తొమ్మిదేళ్లు గడిచిన అమలుకు నోచుకోలేదన్నారు. బిజెపి పాలిత ప్రాంతాల్లో మహిళలకు రక్షణ లేదని అనేక సంఘటనలు రుజువు చేసిన ప్రధాని స్పందించడం లేదని ఆరోపించారు.
9 ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రణాళికాబద్ధంగా పథకాలకు రూపకల్పన చేసి అమలు చేయడం అద్భుతం అన్నారు. సాగు నీటి కల్పనతో ప్రతి ఎకరా సాగవుతుందన్నారు. ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతు బీమా తో రైతు ధీమాగా ఉంటున్నారు అన్నారు. విద్యాభివృద్ధి కోసం వెయ్యి గురుకులాలు, 35 మెడికల్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఘనత కెసిఆర్ ది అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లతో ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి కెసిఆర్ కు మనం అండ దండగా ఉండాలని పిలుపునిచ్చారు.
పచ్చగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మత చిచ్చు లేపి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్న బిజెపిని ఎన్నికల్లో తిప్పి కొట్టాలన్నారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రసంగం మధ్య మధ్యలో పాటలు పాడడం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ కార్యకర్తలే బలం, నియోజకవర్గ ప్రజలైన బలగం అన్నారు. ఇంకా ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, నియోజకవర్గం కోఆర్డినేటర్ కేసి రెడ్డి మనోజ్ రెడ్డి, ఎంపీపీ భూమిశెట్టి సరిత, దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు కార్యనిర్వహక అధ్యక్షుడు బొమ్మిశెట్టి బాలరాజు, ఎస్టీ సెల్ జిల్లా నాయకుడు మాలోతు రమేష్ నాయక్, సాంస్కృతిక విభాగం రాష్ట్ర నాయకురాలు ఎడవల్లి విజయ, సోషల్ మీడియా ఇంచార్జ్ రంగు రమేష్, రంగు హరీష్ తదితరులు పాల్గొన్నారు.