విశాఖ బ్రిటిష్ వారి కాలంలో జిల్లాగా ఏర్పడింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ప్రాంతమిది. తరువాత కాలంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు విశాఖ నుంచే ఏర్పడ్డాయి. అంటే ఒకపుడు ఉత్తరాంధ్రా అంతా విశాఖ జిల్లాగానే ఉండేదన్న మాట. ఇక విశాఖ విభజన ఏపీలో ఇప్పటికీ పెద్ద జిల్లావే. విశాఖలో మొదటి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. అలాగే పారిశ్రామిక విస్తరణ జరిగిన తరువాత అనేక ఇతర పరిశ్రమలు కూడా వచ్చాయి. ఇక విశాఖలో నలభయేళ్ల క్రితం వరకూ జనాభా గట్టిగా అయిదారు లక్షలు మాత్రమే. కార్పోరేషన్ గా ఏర్పడింది కూడా ఆనాడే.విశాఖలో ప్రభుత్వ భూములకు కొదవ లేదు అన్న మాట కొన్ని దశాబ్దాల క్రితం ఉండేది. ఏ పరిశ్రమ పెట్టాలన్నా విశాఖ అనుకూలం అనడానికి కూడా విస్తారంగా భూములు, నీరు ఉండడమే కారణం.
రెవిన్యూ రికార్డుల లెక్క ప్రకారం చూస్తే వేలాది భూములు విశాఖ నిండా ఉన్నాయని చెబుతారు. అలాంటి విశాఖలో పాతికేళ్ళ నుంచే భూములు మెల్లగా తగ్గిపోవడం మొదలయ్యాయి. విశాఖ కూడా ఆ సమయం ఉంచే అభివృద్ధిలో పరుగులు తీస్తూ సాగుతోంది. దాంతో భవిష్యత్తుని నాడే చూసిన జాగ్రత్తపరులు హిరణ్యాక్షుడి తరహాలో విశాఖ భూములను చాప చుట్టేసారు అన్న ఆరోపణలు ఉన్నాయి.విశాఖలో రాజకీయ పరిణామాలు కూడా మూడు దశాబ్దాల నుంచి మారిపోయాయి. స్థానికులు కాకుండా ఇతర ప్రాంతాల వారు రావడంతో వారికి ఉన్న ముందు చూపుతో పాటు, వ్యాపార ఆలోచనలు కలగలిపి విశాఖ భూములకు రెక్కలు వచ్చేలా చేశాయని చెబుతారు.
ఇక గత రెండు దశాబ్దాలుగా చూసుకుంటే విశాఖ జిల్లాలో భూ కబ్జాలకు గురి కాని ప్రాంతం లేదనే చెబుతారు. దీని మీద వారూ వీరూ అన్న తేడా లేకుండా ఎవరికి పలుకుబడి ఉంటే వారే పెత్తందార్లు అయిపోయారు అన్నది కూడా ఉంది. దాంతో విశాఖలో ప్రభుత్వ భూములన్నీ కూడా హాంఫట్ అన్నట్లుగా మాయం అయిపోయాయి.ఇక తెలుగుదేశం గత అయిదేళ్ల పాలనలో విశాఖలో పెద్ద ఎత్తున భూ దందా సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. సాక్షాత్తూ చంద్రబాబు మంత్రివర్గ సహచరుడు అయ్యన్నపాత్రుడే విశాఖలో పెద్ద ఎత్తున భూములు కబ్జా అయ్యాయని సంచలన అరోపణలు చేశారు. ఇక విపక్షాలు అన్నీ కలసి ఆందోళను చేసిన మీదట చంద్రబాబు సర్కార్ సిట్ ని ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపించింది.
ఆ నివేదిక బయటపెట్టకుండానే బాబు గద్దె దిగారు, ఇపుడు వైసీపీ సర్కార్ కొత్తగా సిట్ ని ఏర్పాటు చేసింది. దీని నివేదిక ఇంకా రాలేదు కానీ విశాఖలో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటామని మంత్రులు అవంతి శ్రీనివాసరావు, కన్నబాబు చెబుతున్నారు. ఇక నాడు భూకబ్జా జరిగిందని ఒప్పుకున్న టీడీపీ ఇపుడు ప్లేట్ ఫిరాయించడమేంటి అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా విశాఖలో భూములు పెద్దల చేతిలో ఉన్నాయని మేధావులు అంటున్నారు. విశాఖ బాగుపడాలంటే ఆ భూములు వెనక్కి తీసుకురావాలని కూడా వారు కోరుతున్నారు. ఈ విషయంలో కేవలం టీడీపీ నేతలు మాత్రమే కాదు అన్ని పార్టీల వారు ఉన్నారని కూడా అంటున్నారు. మరి రాజకీయాలకు అతీతంగా భూ దందాల పైన ఆపరేషన్ చేయగల సత్తా అధికార పార్టీకి ఉందా అన్నదే పెద్ద సందేహం.