విజయవాడ, ఫిబ్రవరి 2: వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ల కేటాయింపు భయం పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ వస్తుందో రాదోననే ఆందోళనలో ఉన్న వారిలో మాజీ మంత్రి వెల్లంపల్లి కూడా ఉన్నారు. నియోజక వర్గంలో రకరకాల కారణాలతో గ్రాఫ్ పడిపోయిన వారిలో వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా ఉన్నారు. గడపగడపకు తిరుగుతున్నా ఎమ్మెల్యే గ్రాఫ్ అంతంత మాత్రంగానే ఉండటం, తెర వెనుక తనను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానం ఆయన్ని వేధిస్తోంది. పశ్చిమ నియోజక వర్గంలో తనకు పోటీ నాయకుల్ని సొంత పార్టీ నేతలే ప్రోత్సహిస్తుండటంతో రగిలిపోయారుదీంతో ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తాజాగా అందరూ చూస్తుండగానే తీవ్రస్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.
విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పుట్టిన రోజు వేడుకల్లో ఇద్దరు నేతలు తీవ్ర పదజాలంతో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన నాయకుడిని ముఖ్యమంత్రి దగ్గరకు నువ్వెలా తీసుకెళ్తావంటూ వెలంపల్లి శ్రీనివాస్, ఉదయభానుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నీలా ఎప్పటికప్పుడు పార్టీలను మారే వ్యక్తిని తాను కాదంటూ ఉదయభాను అంతే కోపంతో వెలంపల్లిపైకి వెళ్లడంతో మిగిలిన వారు విస్తుపోయారువైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బహిరంగంగా దుర్భాషలాడుకోవడం చూసి ఖంగుతిన్న నేతలు ఇద్దరికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వైసీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ జన్మదినం సందర్భంగా పటమటలోని పార్టీ కార్యాలయానికి జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చారు.
అక్కడి నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్ వచ్చారు.ఉదయభానును చూడగానే వెలంపల్లి ఆగ్రహంతో… తన నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఆకుల శ్రీనివాస్ కుమార్‌ను సీఎం జగన్ దగ్గరకు తీసుకెళ్లడానికి ‘నువ్వు ఎవరు అని ప్రశ్నించి పార్టీలో నువ్వేమైనా పోటుగాడివా..’ అని దూషించారు. వెల్లంపల్లి వైఖరి ఊహించని సామినేని ఉదయభాను ‘ పార్టీలో తాను సీనియర్ లీడర్‌ను. నీలా పదవి కోసం పార్టీలు మారలేదని రిప్లై ఇచ్చారు. మూడు పార్టీలు మారిన ఊసరవెల్లివి అంటూ, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమని తీవ్రంగా హెచ్చరించారు. తనకు చెప్పడానికి నువ్వెవరివి అని నిలదీశారు. ఉదయభాను, వెల్లంపల్లి ఆగ్రహంతో ఒకరిపైకి మరొకరు వెళ్లడంతో వారి అనుచరులు పక్కకు తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆకుల శ్రీనివాస్ వైసీపీలో క్రియాశీలకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆకుల శ్రీనివాసరావు పోటీ చేసి ఓడిపోయారు.
నాటి ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన వెలంపల్లి ఓటమి పాలయ్యారు. ఆకుల శ్రీనివాస్ వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులతో ప్రయత్నాలు చేస్తున్నారు. బలమైన సామాజిక వర్గం కావడంతో పశ్చిమలో పట్టుందని చూపే ప్రయత్నాలు చేస్తున్నారు.జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తన నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు గతవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఆ సమయంలో ఆకుల శ్రీనివాస్ ఎదురుపడ్డారని చెబుతున్నారు. ఈ నెల 28న తన కుమార్తె వివాహమని, సీఎం జగన్‌కు ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు వచ్చానని ఆకుల చెప్పడంతో ఉదయభాను తనతో పాటు శ్రీనివాస్‌ను సీఎం వద్దకు తీసుకువెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందజేయించారు. తన మీద పోటీచేసిన వ్యక్తిని సొంత పార్టీ ఎమ్మెల్యే జగన్ వద్దకు తీసుకెళ్లడంతో మాజీ మంత్రి వెల్లంపల్లి రగిలిపోయారు. ఉదయభాను కనిపించగానే కసి తీర్చుకునే ప్రయత్నించారు. వెల్లంపల్లి అక్రోవానికి కారణమైన ఆకుల శ్రీనివాస్ అనుకున్నది సాధిస్తారో లేదో కానీ పార్టీ నాయకుల దగ్గర మాత్రం వెల్లంపల్లిని విలన్ చేయడంలో సక్సెస్ అయ్యారు.