ఘాట్ రోడ్ లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. తిరుమల – తిరుపతి ఘాట్ రోడ్డులో బుధవారం జరిగిన బస్సు ప్రమాదంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. డౌన్ ఘాట్ రోడ్డులో కూడా కాంక్రీట్ తో రీటైనింగ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఘాట్ రోడ్డు లో బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గురువారం వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, ఇందుకు దారి తీసిన కారణాలు ఏమై ఉండొచ్చు అనే అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు.
ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన… బస్సులో సాంకేతిక ఇబ్బందులేమీ లేవని ఓలెక్ట్రా సంస్థ ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు సమాచారం ఇచ్చారన్నారు. అతి వేగం లేదా డ్రైవర్ నిర్లక్ష్యం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు. దీని పై విచారణ జరపాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. శ్రీ వేంకటేశ్వర స్వామి దయ వల్ల బస్సులోని ప్రయాణీకులెవరికీ పెద్ద గాయాలు కాలేదన్నారు. తిరుమలకు వచ్చిన భక్తులను క్షేమంగా తిరుపతికి చేర్చడానికి టీటీడీ అన్ని భద్రతా చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని.. అవసరమైతే విద్యుత్ బస్సుల డ్రైవర్లకు మరోసారి శిక్షణ ఇప్పించాలని చైర్మన్ సూచించారు. టీటీడీ ఛైర్మన్ తో పాటు సివిఎస్వో నరసింహ కిషోర్, రవాణా విభాగం జిఎం శేషారెడ్డి, ఆర్టీసీ ఆర్ ఎం చెంగల్ రెడ్డి, ఓలెక్ట్రా విద్యుత్ బస్సుల తయారీ సంస్థ ప్రతినిధులు ఉన్నారు. తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం జరిగింది. తిరుమల నుంచి తిరుపతికి భక్తులతో వెళ్తోన్న ఎలక్ట్రిక్ బస్సు బుధవారం మధ్యాహ్నం బోల్తా పడింది. తిరుమల నుంచి వస్తుండగా మొదటి ఘాట్ రోడ్డులోని 29, 30 మలుపు వద్దకు రాగానే డివైడర్ ను ఢీకొట్టిన బస్సు పక్కకు బోల్తా పడింది.
ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో విధులు ముగించుకొని అదే మార్గంలో వెళ్తోన్న ఎస్పీఎఫ్ సిబ్బంది బస్సు ప్రమాదాన్ని గమనించి వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన బస్సు అద్దాలను ధ్వంసం చేసి బస్సులోని భక్తులను కాపాడారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, సహా ఐదుగురు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.