విద్యాశాఖ అధికారుల సమీక్షలో జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు
ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో జిల్లా 100% ఉత్తీర్ణత సాధించేలా చర్యలు చేపట్టాలని.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు.. సంబందిత అధికారులను ఆదేశించారు.మంగళవారం స్థానిక కలెక్టరేట్ విసి హాలులో, విద్యాప్రమానాల పెంపు, మనబడి “నాడు నేడు” ఫేస్-2 పనుల పురోగతిపై విద్యాశాఖ, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ట్రైనీ కలెక్టర్ రాహుల్ మీనా లతో కలిసి.. సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ్ రామరాజు మాట్లాడుతూ… ఈ విద్యా సంవత్సరం.. పదవ తరగతి పరీక్షలపై.. ప్రత్యేక దృష్టి సారించి.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి మంచి ఫలితాలు తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. పదవ తరగతి సిలబస్ త్వరితగతిన పూర్తి చేసి.. రివిజన్ కూడా చేపట్టేలా విద్యాశాఖ అధికారులు చొరవ చూపాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారికి అదనపు క్లాసులను కూడా తీసుకోవాలన్నారు. విద్యాప్రమానాల పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 100% ఉత్తీర్ణతతో.. రాష్ట్రంలోనే వైఎస్ఆర్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేలా కృషి చేయాలని విద్యాశాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.
అలాగే పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి యొక్క ఆరోగ్య స్థితి, ఎత్తు, బరువు ప్రమాణాలను.. ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అంతే కాకుండా పిల్లలచే పాఠాలు, పద్యాలు, సెమినార్స్, గ్రూప్ డిస్కషన్స్ నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారిలో.. భయం, బిడియం దూరం అవ్వడంతో పాటు.. మానసిక వికాసం, సామాజిక స్పృహ పెంపొందుతాయన్నారు. ఈ విషయంలో అవసరమైతే.. ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించాలని తెలిపారు.
విద్యార్థుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం.. పాఠశాలల్లో ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి.. విద్యార్థుల్లో చదువుపై మక్కువ పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా పిల్లల్లో పౌష్టికాహార లోపాలు కనిపించకుండా విద్యాశాఖ అధికారులు… వైద్యాధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.
రెండవ దశ నాడు నేడు పనులు నాణ్యతలో సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల నిర్వహణలో నాణ్యతా లోపాలు వుంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవన్నారు. అదేవిధంగా మండల స్థాయిలో మండల విద్యాశాఖ అధికారి, ఇంజనీరింగ్ అధికారి ఎప్పటికప్పుడు ప్రతి పనిని తనిఖీ చేస్తూ నివేదికలందించాలని తెలిపారు. ఇప్పటికే అన్ని పాఠశాలలను నాలుగు కేతగిరీలకు చెందిన సచివాలయ సిబ్బంది పర్యవేక్షించడం జరుగుతోందన్నారు.
ఈ కార్యక్రమంలో.. జిల్లా విద్యా శాఖ అధికారి చెప్పలి దేవరాజు, సమగ్ర శిక్ష పిడి అంబవరం ప్రభాకర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్.ఈ. శ్రీనివాసుల రెడ్డి, ఏపీ ఈడబ్ల్యుఐడీసీ ఈఈ కరుణాకర్ రెడ్డి, సమగ్ర శిక్ష ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్, మండల ఇంజనీర్లు, మండల విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారులు, సమగ్ర శిక్ష కంట్రోల్ రూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.