కరీంనగర్, ఫిబ్రవరి 24:జగిత్యాల జిల్లాల మల్యాల మండలంలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగింది. గురువారం రాత్రి ప్రధాన ఆలయంలో రెండు విగ్రహాలు చోరికి గురయ్యాయి. ప్రధాన ఆలయంలోని గర్భగుడిలో రెండు విగ్రహాలు, విలువైన వెండి వస్తువులు దొంగిలించినట్లు తెలుస్తోంది. 15 కిలోల వెండితో పాటు కొన్ని బంగారు ఆభరణలు చోరీకి గురైనట్లు సమాచారం. వీటి విలువు సుమారు రూ. 9 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.విషయం తెలుసుకున్న మల్యాల సీఐ ఆలయానికి చేరుకున్నారు. వెంటనే డాగ్ స్వ్కాడ్‌తో సోదాలు ప్రారంభించారు. స్పెషల్ టీమ్స్ ఫింంగర్ ప్రింట్స్ సేకరించే పనిలో పడ్డాయి. ఆలయాన్ని మూసివేసిన అధికారులు విచారణ జరుపుతున్నారు. పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.
ఆలయం వెనుక గుట్ట దిగువన సీతమ్మ బావి వరకూ వెళ్లి డాగ్ స్క్వాడ్ ఆగింది. ఇదిలా ఉంటే ఆలయంలో రాత్రి పూట నలుగురు హోంగార్డులు సెక్యూరిటీగా ఉన్నారు. కొండగట్టు ఆలయ చరిత్రలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ఇదేతొలిసారి. ముసుగు వేసుకున్న ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది.ఇక ఇటీవల కొండగట్టు అభివృద్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజా బడ్జెట్ లో నిధులు కేటాయించడంతో పాటు ముఖ్యమంత్రి నేరుగా ఆలయాన్ని సందర్శించారు. దీంతో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. తాజాగా ఈ దొంగతనం వ్యవహరంతో మరోసారి అంజన్న ఆలయం వార్తల్లో నిలిచింది.