ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి మరో జీవో జారీ చేసింది. ఎస్-3 జోన్ పేదల ఇళ్ల స్థలాలకు 268 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో లబ్దిదారుల సంఖ్య మేరకు అదనంగా భూమి కావాలంటూ కలెక్టర్లు లేఖ రాశారు. కలెక్టర్ల లేఖ మేరకు అదనపు భూమి కేటాయింపును సీఆర్‌డీఏ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. సీఆర్‌డీఏ కమిషనర్ ప్రతిపాదనల మేరకు ఏపీ సర్కార్.. అమరావతి రాజధానిలో ఎస్-3 జోన్‌లో పేదల ఇళ్ల స్థలాలకు 268 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు చేసింది.
పేదలందరికీ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్-3 జోన్‌లోని 268 ఎకరాలను.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు 168 ఎకరాలు, గుంటూరు కలెక్టర్‌కు 100 ఎకరాలు కేటాయించారు. రాజధానిలోని బోరుపాలెంలో 2 ఎకరాలు, పిచుకల పాలెంలో 20 ఎకరాలు, అదే గ్రామంలో వేరే బ్లాకులో 81 ఎకరాలు, అనంతవరం లో 64 ఎకరాలు, నెక్కల్లులో వంద ఎకరాలను పేదలకు ప్రభుత్వం కేటాయించింది. సీఆర్డీఏ కమిషనర్ అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇళ్ల స్థలాలను కేటాయించాలని నిర్ణయించింది.
ఈ మేరకు యన్టీఆర్, గుంటూరు, జిల్లాల కలెక్టర్‌లకు ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.ఇప్పటికే ఆర్ – 5 జోన్‌లో 1,134 ఎకరాలను పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన పట్టాల పంపిణీకి శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. బహుళ ప్రయోజనాల అవసరాల కోసం నిర్దేశించిన ఎస్-3 జోన్‌లో ఎకరం ధర రూ.4.1 కోట్లని ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీన జరిగిన 33వ సీఆర్‌డీఏ సమావేశంలో నిర్ణయించారు.
ఇప్పుడు అందులో 6 శాతం ధరకే అంటే.. ఎకరా రూ.24.40 లక్షల చొప్పున 268 ఎకరాలను ప్రభుత్వానికి విక్రయించాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పట్టాల కోసం తీసుకుంటున్నందున మౌలిక ధరలో ఆరు శాతానికే విక్రయించడానికి నిర్ణయించినట్లు సీఆర్‌డీఏ పేర్కొంది. ఎన్టీఆర్ జిల్లా నుంచి 168 ఎకరాలకు ప్రతిపాదన రాగా.. బోరుపాలెంలో 2.05 ఎకరాలు, పిచ్చుకల పాలెంలో 20.47 ఎకరాలు, పిచ్చుకలపాలెంలోనే మరో 81.09 ఎకరాలు, అనంతవరం లో 64.39 ఎకరాలు కేటాయించారు.
నెల్లూరులో ఆసక్తికరంగా పాలిటిక్స్.
అలాగే గుంటూరు జిల్లా పరిధిలో నిర్దేశించిన వంద ఎకరాలను నెక్కల్లు గ్రామంలో కేటాయించింది. ఎన్టీఆర్ జిల్లాకు నిర్దేశించిన 168 ఎకరాలకు రూ.41.33 కోట్లు, గుంటూరు జిల్లాకు నిర్దేశించిన 100 ఎకరాలకు రూ. 24.60 కోట్లు.. మొత్తంగా 268 ఎకరాలకు రూ.65.93 కోట్లుగా సీఆర్‌డీఏ లెక్క గట్టింది.అయితే ఇలా అమరావతి భూములు ఇలా సెంటు స్థలాలుగా పంపిణీ చేయడం చట్ట విరుద్ధమని.. అమరావతి రైతులతో సీఆర్డీఏ చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నరని రైతులు హైకోర్టుకు వెళ్లారు. అక్కడ అనుకూల తీర్పు రాకపోవడంతో సుప్రీకోర్టుకు వెళ్లారు. దీనిపైసుప్రీం కోర్టులో విచారణ జరగాల్సి ఉంది.