కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నేలమీదకు దిగొచ్చేలా చేస్తున్నాయి. అధికార పార్టీపై వ్యతిరేకత చీలిపోతే గెలిచిపోదామని భావించే ఫార్ములా అన్ని సార్లూ జరగదు. బీజేపీని బలోపేతం చేయడంతో కాంగ్రెస్ గెలుపునకు అడ్డుకట్ట వేయవచ్చన్నది ఇప్పటి వరకూ కేసీఆర్ వ్యూహం. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆ ఆలోచన సరైనది కాదని తేలింది. ప్రజలు ప్రభుత్వంపై విసుగెత్తితే మూకుమ్మడిగా ఒక పార్టీకే పట్టం కడతారన్నది కర్ణాటక ఫలితాల ద్వారా స్పష్టమయింది.
వ్యతిరేకత ఉన్నప్పుడు ప్రజలు కులం చూడరు. మతపరమైన పాచికలు పారవన్నది స్పష్టమైంది. నియంతలా వ్యవహరించిన తీరుకు ఒక రాష్ట్రాన్నే ప్రజలు కాంగ్రెస్‌కు అప్పగించారు. ఒక ఎంపీ పదవి తీసిస్తే.. ఒక్క రాష్ట్రాన్ని ఇవ్వగలిగిన శక్తి ప్రజలకు ఉందన్న సంగతి రాజకీయ పార్టీలకు ఈపాటికి అర్ధమై పోయి ఉంటుంది. నియంత పోకడలు, ఏకపక్ష నిర్ణయాలు ఇక చెల్లవు. విగ్రహాలు పెట్టడం, కొత్త కొత్త స్కీములతో కొన్ని సామాజికవర్గాలను ఆకట్టుకోవాలనుకుంటే వాళ్లు వేయరు.
మిగిలిన సామాజికవర్గాలు దూరమవుతాయన్న విషయాన్ని మహా నేతలు గుర్తుంచుకుంటే మేలన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. బెంగళూరు నగరంలో వరదలు ముంచెత్తి అన్ని కాలనీలు మునిగిపోవడం, రహదారులు నదులను తలపించిన తరహాలోనే హైదరాబాద్ నగరంలోనూ వర్షం వస్తే సేమ్ సీన్. నగర ఓటర్లు ఈసారి ఎటు వైపు మొగ్గు చూపుతారనో టెన్షన్ కొంత బీఆర్ఎస్‌లో బయలు దేరింది.. ప్రజల్లో తిరగకుండా ప్యాలెస్‌లకే పరిమితం అయ్యేరాజకీయ నేతలకు కర్ణాటక ఫలితాలు ఒక చెంపపెట్టు లాంటివి. కన్నడ నాట ఏకంగా పదమూడు మంది మంత్రులను ప్రజలు ఇంటి దారి పట్టించారు.
ఇతర పార్టీల నుంచి తెచ్చుకుని ఉప ఎన్నికల్లో గెలిపించుకున్నా సరే..ప్రజలు సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీని పక్కన పెట్టారు. తెలంగాణలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో అదే చేశారు. ఇప్పుడు జూనియర్ పంచాయతీ కార్యదర్శులను కూడా పక్కన పెట్టేందుకు సిద్ధమయింది. ఇలాంటి నియంత పోకడలను ప్రజలు హర్షించరు. తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్‌పై సహజంగా ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది. అంతేకాకుండా సెంటిమెంట్‌లు అన్ని సార్లూ పనిచేయవు. కన్నడనాట హనుమంతుడు కూడా బీజేపీని రక్షించలేకపోయాడు.
ఉద్యమ పార్టీ రాజకీయాపార్టీగా మారినట్లుగానే, అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీగా మార్చగల సత్తా ఒక్క ప్రజలకే ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేవలం సర్వేల మీద ఆధారపడి, సిట్టింగ్‌లను మార్చకుంటే ప్రజలు కూడా ముఖ్యమంత్రి సీటును వేరే వారికి అప్పగించేందుకు ప్రజలు సిద్ధమవుతారు. కేసీఆర్‌కు ఇప్పుడు కర్ణాటక ఫలితాల కలవరం పట్టుకుంది. వ్యతిరేకతను తగ్గించుకోవడానికి, మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఏమేం చేయాలో ఇప్పుడు వేరే ఆలోచన గులాబీ బాస్ చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప ఇప్పటి వరకూ వేసుకున్న అంచనాలు, వ్యూహాలు మాత్రం పనిచేయవనే కర్ణాటక ఫలితాలు చూసి అర్థమయిందంటున్నారు.