Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కడప సీటుపై టెన్షన్.

0

వచ్చే ఎన్నికలలో ఎలాగైనా కడప లోక్ సభ స్థానాన్ని గెలుచుకోలేకపోతే మొదటికే మోసం వస్తుందని జగన్ భావిస్తున్నారు.వివేకా హత్య వెనుక అంత:పుర రహస్యం ఉందనీ, ఆధిపత్య పోరు ఉందనీ, అందుకే అవినాష్ ను కాపాడేందుకు జగన్ ప్రయత్ని స్తున్నారనీ జనం నమ్ముతుండటంతో.. అలాంటిదేమీ లేదని చాటేందుకైనా  కడప లోక్ సభ స్థానంలో అవినాష్ రెడ్డి బదులు మరో అభ్యర్థిని నిలబెట్టాలన్న నిర్ణయానికి వచ్చేశారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఒక వేళ అవినాష్ రెడ్డికి పార్టీ టికెట్ ఇచ్చినా అక్కడ గెలిచే పరిస్థితి లేదనీ, స్థానికంగా అవినాష్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని సొంత సర్వేలే తేల్చేయడంతో ఇక అవినాష్ ను వదిలించేసుకోవడమే మేలన్న నిర్ణయానికి ఆయన వచ్చేశారంటున్నారు.

 

ఇప్పటికే వివేకా హత్య కేసులో అవినాష్ అరెస్టు కాకుండా ఉండడానికి ముఖ్యమంత్రిగా తన అధికారాన్ని పూర్తిగా వినియోగించడమే కాకుండా శక్తికి మించి ప్రయత్నించిన జగన్ ఇంకా అదే పద్ధతి కొనసాగిస్తే అవినాష్ పై వ్యక్తమౌతున్న వ్యతిరేకత తనపై ప్రతిఫలించచే అవకాశాలున్నాయని గ్రహించారు. దీంతో వచ్చే ఎన్నికలలో కడప నుంచి ఎవరిని నిలబెడితే విజయం తథ్యం అన్న అన్వేషణ ప్రారంభించారు. అయితే కడప నుంచి వైఎస్ కుటుంబం బయట నుంచి ఎవరు నిలబడినా విజయం సాధించే అవకాశం లేదని అక్కడి పార్టీ శ్రేణులే చెబుతుండటంతో జగన్ తన తల్లినే అక్కడ వైసీపీ అభ్యర్థిగా నిలబెడితే బెటర్ అన్న భావన కు వచ్చారు.

 

ఇందుకు విజయమ్మ అంగీకరిస్తారా అన్న విషయంలో అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచీ   గౌరవాధ్యక్షురాలిగా ఉన్న తల్లిని జగన్  సాగనంపి ఆమెకు పార్టీతో ఉన్న సంబంధాన్ని తెంపేశారు. ఆ తరువాత నుంచీ ఆమె తన కుమార్తె షర్మిలతో పాటే ఆమె పార్టీ వైఎస్సార్టీపీ గౌరవాధ్యక్షురాలిగా పూర్తిగా తెలంగాణకే పరిమితమయ్యారు. అంతే కాదు     జగన్మాత ఇప్పుడు కుమారుడిని ఇంటికి కూడా వెళ్లేందుకు సుముఖంగా లేరు. అందుకే ఇటీవల అమరావతి వచ్చినప్పటికీ తాడేపల్లి ప్యాలెస్ గడపలో అడుగు పెట్టలేదు. తన స్థాయికి ఏ మాత్రం తగకపోయినా సజ్జల నివాసానికి వెళ్లారు.

ఎట్టకేలకు టిడ్కో ఇళ్లు..

దీంతో జగన్ కోరినంత మాత్రాన ఆమె కడప లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీకి అంగీకరిస్తారా అన్న అనుమానాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమౌతున్నాయి.  ఏది ఏమైనా వచ్చే ఎన్నికలలో అవినాష్ రెడ్డికి మాత్రం కడప నుంచి పోటీ చేసే అవకాశం జగన్ ఇవ్వరన్నది మాత్రం కచ్చితమేనని అన్నారు. వివేకా హత్య కేసులో ఔట్ కమ్ ఏమిటన్నది పక్కన పెడితే.. వైసీపీకి అవినాష్ రెడ్డికి ఉన్న సంబంధం దాదాపుగా తెగిపోయినట్లేనని చెబుతున్నారు.  వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ ప్రమేయాన్ని కడప వాసులు గట్టిగా నమ్ముతుండటమే ఇందుకు కారణమని  వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

 

దీంతో జగన్ కు అవినాష్ ను కడప నుంచి దూరం పెట్టడం తప్ప మరో మార్గం లేని పరిస్థితి ఏర్పడింది. అయితే అవినాష్ ను కాకుండా మరెవరిని నిలబెట్టాలన్న విషయానికి వస్తే.. అక్కడా జగన్ కు తాను దూరం పెట్టిన తల్లిని మళ్లీ తీసుకువచ్చి నిలబెడితే తప్ప ఆ సీటును కాపాడుకోలేని పరిస్థితి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సరే జగన్ వెళ్లి తల్లిని కడప నుంచి వైసీపీ అభ్యర్థిగా నిలబడమని అర్ధిస్థారా? అలా అర్ధించినా, గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి ‘సగౌరవంగా’ సాగనంపిన కొడుకు అభ్యర్థనను ఆమె ఔదాలుస్తారా అన్నవి ప్రశ్నలే? మొత్తం మీద అక్కడ నిలబడేది ఎవరన్నది పక్కన పెడితే ఆ సీటు అవినాష్ చేయి జారిందని మాత్రం నిస్సందేహంగా చెప్పవచ్చు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie