ప్రయాణికుడ్ని రన్నింగ్ రైల్లో నుంచి తోసేసిన ఘటన కలకలంరేపింది. అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు దుండగులు ప్రయాణికుల్ని బయటకు తోసేశారు. రైల్లో సీటు కోసం గొడవపడిన వారికి నచ్చచెప్పినందుకు రైల్లో నుంచి రమేష్ కుమార్ అనే ప్రయాణికుడిని ఇద్దరు వ్యక్తులు తోసేశారు. ప్రయాణికుడు రమేష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమేష్ కుమార్ది అన్నమయ్య జిల్లా పీటీఎం మండలం కుమ్మవారి పల్లె. స్వయంగా బాధితుడే 108కు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. అతడికి డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.రైల్లో చైన్ లాగి మరీ చోరీమరోవైపు రైల్లో చోరీ ఘటన కలకలంరేపింది. రన్నింగ్ రైల్లో చైన్ లాగి నిద్రిస్తున్న మహిళల మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్లారు. చెన్నై నుంచి షిర్డీకి వెళ్తున్న షిర్డీసాయి ఎక్స్ప్రెస్ రైలు తెల్లవారుజామున 2:30 గంటలకు ఇస్వీ-కుప్పగల్లు రైల్వే స్టేషన్ మధ్య రైలులో చైను లాగడంతో ఆగింది. ఎస్1, ఎస్9 స్లీపర్ బోగీల దగ్గరకు వచ్చిన దొంగలు కిటికీల పక్కన నిద్రిస్తున్న మహిళల మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్లారు.
దొంగల్ని కొందరు మహిళలు ప్రతిఘటించగా నిద్రిస్తున్న ముగ్గురు మహిళల మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్లారు.అర్ధరాత్రి కావడంతో చల్ల గాలి కోసం ప్రయాణికులు కిటికీలను తెరచి ఉంచారు. దీంతో దొంగలు కింద నుంచే చోరీ చేశారు. రైలు అక్కడి నుంచి బయల్దేరి మంత్రాలయం రైల్వే స్టేషన్ చేరుకుంది. ఆదోని రైల్వే స్టేషన్లో గురువారం తెల్లవారుజామున 2:11కు స్టేషన్ చేరుకొని బయలుదేరినట్లు తెలుస్తోంది. ఇస్వీ-కుప్పగల్లు చైన్ లాగిన ప్రదేశంలో రైలు 11 నిమిషాల పాటు నిలిచిపోయినట్లు చెబుతున్నారు. రైల్వే గార్డు మెసేజ్ ద్వారా ఆదోని స్టేషన్ మేనేజర్కు సమాచారం అందించారట. షిర్డీ ఎక్స్ప్రెస్కు స్టాపింగ్ చైన్ లాగింది నిజమేనని.. అయితే ఎవరూ కూడా చైన్ స్నాచింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేయలేదని రైల్వే పోలీసులు అంటున్నారు.