ఏపీలో పలు చిట్ ఫండ్స్ సంస్థలపై వరుస దాడులు చేస్తున్న ప్రభుత్వం.. అవకతవకలను గుర్తించింది. దీంతో చిట్ ఫండ్ వ్యాపారం పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. చిట్ ఫండ్ నిర్వహణకు కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. నూతన విధానంలో ఆన్ లైన్ లోనే లావాదేవీలు సాగనున్నాయని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. ఇ -చిట్స్ అనే ఎలక్ట్రానిక్ అప్లికేషన్ ను మంత్రి ప్రారంభించారు. చిట్ ఫండ్ కొత్త విధానం ప్రకారం అన్ని చిట్ ఫండ్ కంపెనీలు ఆన్ లైన్ విధానంలో మాత్రమే లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుంది.
ఇందుకు ఏపీ రెవిన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలు ఇ-చిట్స్ అనే యాప్ రూపొందించింది.చందాదారులు ఇ- చిట్స్ ద్వారా తన డబ్బు సురక్షితంగా ఉందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. కొన్ని సంస్థలు చందాదారులను మోసం చేస్తున్నాయని, అలాంటి వాటికి అడ్డుకట్టవేసేందుకే ఈ విధానం తీసుకొచ్చినట్లు మంత్రి ధర్మాన తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఆన్‌లైన్‌లోనే చిట్స్ ను పరిశీలించి ఆమోదం తెలియజేస్తారన్నారు. ఇకపై ఈ విధానం ద్వారా మాత్రమే చిట్ లు నిర్వహించాల్సి చిట్ ఫండ్ సంస్థలను ఆదేశించారు.
చిట్ సంస్థలన్నీ ఈ విధానాన్ని అమలు చేయాల్సిందేనని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు.చందాదారులు మోసపోకుండా ఉండాలనే ఈ విధానం తెచ్చామని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఏపీలో గత కొంత కాలంగా కొన్ని ప్రైవేట్ చిట్ సంస్థల్లో సీఐడీ సోదాలు చేస్తుంది. ఈ కేసులో కొందరిని సీఐడీ అధికారులు ఇప్పటికే ప్రశ్నించారు. చిట్ ఫండ్ విధానంలో తప్పులు జరుగున్నాయని, చందాదారుల డబ్బును ఇతర మార్గాలకు మళ్లిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏపీ ప్రభుత్వం చిట్స్ నిర్వహణలో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.
మరోవైపు చిట్ ఫండ్ సంస్థల్లో సోదాలు చేస్తున్న ఏపీ సీఐడీ.. మార్గదర్శి వ్యవహారంలో దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ తో పాటు, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును సీఐడీ విచారించింది. మార్గదర్శిలో నిధుల మళ్లింపు జరిగిందని సీఐడీ అభియోగిస్తుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని మార్గదర్శి చిట్ ఫండ్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం ఆడిటర్‌ను నియమించింది. ఆడిటర్ నియమించడం చెల్లుబాటు కాదని మార్గదర్శి సంస్థ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై వాదనలు ఉన్న కోర్టు ఆడిటర్ నియామకంపై స్టే విధించింది.