సోషల్ మీడియా వేదికగా ప్రచారం అవుతున్న ట్రోల్స్ తో బెజవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇరకాటంలోకి వెళుతున్నారు.అసంతృప్తి గా ఉన్న నేతలను టార్గెట్ గా చేసుకొని ట్రోల్స్ మొదలవటంతో వ్యవహరం ఆసక్తిగా మారింది. అసంతృప్తి ఉన్న నేతలను టార్గెట్ చేసుకొని వాట్సాప్ గ్రూపుల్లో ట్రోల్స్ మొదలవటంతో సదరు నేతలు లబోదిబోమంటున్నారు. కొందరు ఈ వ్యవహారాన్ని ఖండిస్తుంటే, మరి కొందరు సైలెంట్ గా ఉండిపోతున్నారు. బెజవాడ కేంద్రంగా మెదలయిన సోషల్ మీడియా ట్రోల్స్ ఇప్పుడు ఆసక్తి కరంగా మారాయి.బెజవాడ కార్పొరేషన్ పరిధిలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి.
విజయవాడ సెంట్రల్,విజయవాడ తూర్పు,విజయవాడ పశ్చిమ నియోజకవర్గాలు..ఈ మూడింటిలో విజయవాడ పశ్చిమం,విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసన సభ్యులు విజయం సాధించారు.మరో ఏడాది కాలంలో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో అప్పుడే అధికార పార్టీలో శాసన సభ్యులను టార్గెట్ గా చేసుకొని అసంతృప్తి వాదులు బయటకు వస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి.విజయవాడ సెంట్రల్ నియోజవకర్గంలో శాసన సభ్యుడిగా మల్లాది విష్ణు ఉన్నారు.ఆయన ప్లానింగ్ కమిటి ఉపాధ్యక్షుడిగా కూడ అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నారు.
అయినప్పటికి మల్లాది విష్ణు ప్రాతినిథ్యం వహిస్తున్న సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన పరిధిలో ఉన్న కార్పొరేటర్లు అంతా గుర్రుగా ఉన్నారనే ప్రచారం ఉంది.కార్పొరేషన్ అధికారులను పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకోవటం, ఏ చిన్న పని కావాలన్నా, ఎమ్మెల్యే జోక్యం తోనే అయ్యే విధంగా విష్ణు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ వ్యవహరం పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పోరేటర్లు శాసన సభ్యుడు విష్ణు అంటే గిట్టటం లేదని అంటున్నారు.ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడ ఇప్పడు ఇదే పరిస్థితి తెరమీదకు వస్తోంది. స్థానిక శాసన సభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు. ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా కూడా పని చేశారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా పార్టీకి ఆయనే అధ్యక్షుడు కూడా. అయినప్పటికి ఆయన నియోజకవర్గంలో కార్పోరేటర్లు అసంతృప్తిగా ఉన్నారని,తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చెలరేగింది.దీంతో అందులో కీలకంగా ఉన్న కొందరు ఎందుకొచ్చిన గొడవంటూ,మీడియా ముందుకు వచ్చి వివరణ కూడ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.వాస్తవానికి బెజవాడ పశ్చిమంలో నిన్నటి వరకు వెలంపల్లి శ్రీనివాసరావుకు తిరుగు లేదని అంతా భావించారు.
అయితే బెజవాడ కార్పోరేషన్ కు మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో తలెత్తిన విదాదం కాస్త, ఆయనకు వ్యతిరేకతను తెచ్చిపెట్టిందని అంటున్నారు. మేయర్ సీటు కోసం కార్పోరేటర్లు చైతన్యా రెడ్డి,అవుతు శైలజా,బండి పుణ్యశీల ప్రయత్నించారు.అయితే వీరిని కాదని అప్పట్లో మంత్రిగా చక్రం తిప్పిన వెలంపల్లి శ్రీనివాసరావు బీసీ వర్గంలో నగరాల సామాజిక వర్గానికి చెందిన రాయన భాగ్యలక్ష్మికి మేయర్ పదవిని ఇప్పించారు.దీంతో అప్పటి నుండి పశ్చిమంలో వెలంపల్లికి ఎదురు గాలి మెదలయ్యిందని అంటున్నారు.
రాజకీయాల్లో ఎప్పుడు ఎం జరుగుతుందో తెలియదంటారు.జిల్లా పార్టీ అద్యక్షుడిగా మిగిలి నియోజకవర్గాలను సైతం కలుపుకొని వెళ్లాల్సిన వెలంపల్లికి ప్రస్తుతం ఆయన నియోజకవర్గంలోనే ఎదురు గాలి వీస్తోందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మెదలయ్యాయి. అంతే కాదు వెలంపల్లి తన నియోజకవర్గంలో పార్టీ కోసం మెదటి నుండి కష్టపడిన వారికి కాదని తన సామాజిక వర్గానికి,ధనిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. దీంతో తాజా రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారాయి.ఎన్నికలు సమీపిస్తున్న వేళ,సిట్టింగ్ లకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు కూడ సొంత పార్టీలోనే వ్యక్తం అవుతోంది.