తిరుమల:ఆల్ ఇండియా యాంటీ టెర్రరిజం ఫ్రంట్ చైర్మన్ మణీందర్ సింగ్ జీత్ మంగళవారం శ్రీవారి దర్శనార్థం తిరుమల కి వచ్చారు. దర్శనం తరువాత పద్మావతి అతిథి గృహంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎల్టీటీఈ ప్రభాకరన్ పై తమిళనాడు ప్రభుత్వం స్టాండ్ ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తిరుమలలోని రాధేయం అతిథి గృహంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభాకరన్ గురించి వార్త మొదటిసారి వింటున్నాననీ, ఢిల్లీ వరకూ ఈ వార్త ఇంకా చేరలేదన్నారు. ముందు తమిళనాడు ప్రభుత్వం స్టాండ్ దీనిపైన ఏంటో క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. వాళ్లు ప్రభాకరన్ వారసులుగా ఉండాలి అనుకుంటున్నారా లేదా తీవ్రవాదిని తీవ్రవాదిగానే చూడాలనుకుంటున్నారో చెప్పాలన్నారు.
రాజీవ్ గాంధీని చంపేసిన టెర్రరిస్టు భావజాలంతో అక్కడి నాయకులు రాజకీయాలు చేయాలనుకుంటే అది సరికాదన్నారు. తాను కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని చెప్పారు. ఈలోగా దీనిపైన తమిళనాడు ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. రాజీవ్ హత్య కేసులో దోషులును విడిచి పెట్టేశారనీ, అది కూడా కరెక్ట్ కాదనీ, ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఎన్నేళ్లు శిక్ష అనుభవించినా వాళ్ల భావజాలంలో మార్పు రాదన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో టెర్రరిజం తగ్గుముఖం పట్టిందన్నారు.
టర్కీ పాలకులు పాకిస్తాన్ కు అనుకూలంగా ఉన్నా ఆపద సమయంలో ఇండియా మానవత్వంతో టర్కీని ఆదుకుంటోందన్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తోందనీ, విశాఖను రాజధానిగా నిర్ణయించడం మంచి పరిణామం అన్నారు. ఏపీ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. నార్కో టెర్రరిజాన్ని అంతమొందించాలంటే విద్యార్థులకు మంచి విద్యను అందించాలని అభిప్రాయపడ్డారు.