తెలుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తుతం యువగళం పాదయాత్రలో ఉన్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి గాని ఆయన పాదయాత్ర పూర్తయ్యే అవకాశం లేదు. చంద్రబాబు తర్వాత భావినేతగా ఎదగాలంటే లోకేష్ ఆ మాత్రం రిస్క్ చేయక తప్పదు. అయితే ఆయన మంగళగిరి నియోజకవర్గం నుంచి ఈసారి పోటీ చేస్తారా? లేదా? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. రెండోసారి కూడా లోకేష్‌ను ఓడించాలన్న ఉద్దేశ్యంతో వైసీపీ హైకమాండ్ తీరు ఉంది. మంగళగిరిలో పోటీ చేస్తే ఓడించడానికి అన్ని రకాల శక్తిసామర్థ్యాలతో పాటు వ్యూహాలను కూడా అధికార పార్టీ అనుసరిస్తుంది.
లోకేష్‌ను ఓడించి మానసికంగా దెబ్బతీయడమే కాకుండా, అమరావతిలో తమ పట్టును నిలబెట్టుకోవాలన్న ద్విముఖ వ్యూహంలో జగన్ ఉన్నట్లే కనపడుతుంది. అందుకోసమే రాజధాని అమరావతి ప్రాంతంలో ఆర్ 5 జోన్‌లో యాభై వేల మందికి పైగా జగన్ పట్టాలను నిన్న పంపిణీ చేశారు. పండగలాగా జరిగిన ఈ కార్యక్రమానికి పెద్దయెత్తున జనం హాజరయ్యారు. వీరంతా మంగళగిరి ఓటర్లుగా త్వరలో మార్చే ప్రక్రియను కూడా అధికార పార్టీ చేపడుతుంది. ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురు ఉన్నా లక్షా యాభై వేల ఓట్లుంటాయి. ఇద్దరుంటే లక్ష ఓట్లు ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుపై పడతాయి. దీంతో దాదాపు లక్షకు పైగా ఓట్లు వైసీపీ ఖాతాలో పడినట్లే అనుకోవాల్సి ఉంటుంది. ఇది మంగళగిరి వైసీపీకి పెద్ద ఎస్సెట్‌గా మారబోతుంది. టీడీపీ అభ్యర్థి మళ్లీ గెలుపు కోసం శ్రమించాల్సి ఉంటుంది.
అసలే మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ గెలిచి దశాబ్దాలు దాటుతుంది. 1983లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఒకసారి, 1985లో మరొకసారి మాత్రమే అక్కడ టీడీపీకి గెలుపు సాధ్యమయింది. ట్రాక్ రికార్డు కూడా బాగా లేకపోవడంతో ఆ తర్వాత అక్కడ టీడీపీ కూడా పోటీ చేసే సాహసం చేయలేదు. 2014లో టీడీపీ తరుపున గంజి చిరంజీవి, 2019లో నారా లోకేష్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అక్కడ చేనేత సామాజికవర్గానికి చెందిన వారు ఎక్కువ. ఇప్పటికే ఆ సామాజికవర్గానికి చెందిన ముఖ్య నేతలైన మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ పదవిని, 2014లో పోటీ చేసి ఓటమి పాలయిన గంజి చిరంజీవిని వైసీపీలోకి తీసుకుని జగన్ నామినేటెడ్ పదవి ఇచ్చారు. దీనికి తోడు అదనంగా ఇప్పుడు యాభై వేల మంది ఓట్లు కలుస్తున్నాయి.
విజయవాడలో సీఎం వైయస్.జగన్ పర్యటన.
దీంతో లోకేష్ మంగళగిరిలో మరోసారి పోటీ చేయడంపై సందిగ్దత నెలకొంది. మంగళగిరిలో పోటీ చేయడం రిస్క్ అనే చాలా మంది సీనియర్ నేతలు చంద్రబాబుకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర చేస్తున్నారు కనుక లోకేష్‌ను మరో నియోజకవర్గానికి షిఫ్ట్ చేయడం మంచిదన్న సూచనలు ఎక్కువగా అందుతున్నాయి. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కోసం కొన్ని నియోజకవర్గాలను సెలెక్ట్ చేసి ఉంచారని సమాచారం. అందులో భాగంగా గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు, విశాఖ జిల్లాలోని రాజాం, అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం నియోజకవర్గాలను పార్టీ నేతలను పరిశీలించి ఓకే చేసినట్లు చెబుతున్నారు.
మంగళగిరిలో పోటీ చేసి రిస్క్ తీసుకోవడం కంటే సేఫ్ ప్లేస్‌కు షిఫ్ట్ అవ్వడం బెటరన్న అభిప్రాయం చంద్రబాబు కూడా వ్యక్తం చేసినట్లు సమాచారం. అందుకోసమే లోకేష్ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాత దీనిని ఫైనల్ చేయనున్నారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. వెనక్కు తగ్గితే జగన్ వల్లే నియోజకవర్గం మారారన్న విమర్శలను కూడా చినబాబు ఎదుర్కొనాల్సి ఉంటుంది. అందుకనే ఆయన పోటీ చేయడం, చేయకపోవడం అనేది ఆయన చేతిలోనే ఉంది. డెసిషన్ మాత్రం లోకేష్ దే. అయితే ఆయన మరోసారి రిస్క్ చేసుకుంటారా? అన్నది తేలాల్సి ఉంది.