Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

‘‌తెలంగాణ సమాజం మరోసారి సంఘటితం కావాలి’

'Telangana society needs to be united once again'

0

  1996లో ‘మరసం’లో నందిని సిధారెడ్డి గారు తెలంగాణ చర్చ తొలిసారిగా మొదలు పెట్టారు. ఎందుకు.. ఏమి•నే ఆయన మాకు వివరించారు.  ఆ రోజుల్లో తెలంగాణ డిమాండ్‌ను సమర్ధించిన  తొలి సాంస్కృతిక సంస్థ ‘మరసం’ మాత్రమే. 1996-97లో ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌సార్‌ ‌రాసిన ‘తెలంగాణలో ఏం జరుగుతోంది’ పుస్తకం మరింత ఆలోచింప చేసి క్లారిటి వచ్చింది. అక్కడి నుంచి తెలంగాణ గురించి అధ్యయనం ప్రారంభించాను. సిద్దిపేటలో 1998లో తెలంగాణ చైతన్య వేదిక పేరుతో  ఏర్పాటు చేశాం.  

తన పాట,మాటలతో సభికులను ఉర్రూతలు ఊగించిన మాంత్రికుడు.. ఉపాధ్యాయ వృత్తి నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా … సీఎం ఒఎస్‌డి  నుంచి తెలంగాణ ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్న కవి,గాయకుడు దేశపతి శ్రీనివాస్‌తో ‘ప్రజాతంత్ర ప్రతినిధి’ ప్రత్యేకంగా మాటామంతీ. తెలంగాణ సమాజం మళ్లీ సంఘటితం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. విశాలమైన ప్రాతిపదికగా ఐక్యతా రాగం వినిపించాలని కోరుతున్నారు. మణిపూర్‌లో పెచ్చురిల్లుతున్న హింసకు కారకులను వెతికిపట్టి ప్రజల  ముందు దోషులుగా నిలబెట్టాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ సమస్య దేశవ్యాప్తంగా ఉందన్నారు. కాలేజీల్లో విద్యార్థి సంఘాలు బలోపేతం కావాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇంటర్వ్యూలోని బాల్యం, ఉద్యమ అనుభవాల విశేషాలను ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌  ‌మాటల్లోనే విందాం…

సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన మీకు ఆధునిక సాహిత్యంలోకి రావడానికి ప్రేరణ..
మా నాన్నగారు గొప్ప చదువరి. అన్ని వారపత్రికలు మా ఇంట్లోకి తెచ్చేవారు. వాటిని క్రమంగా తప్పక చదివేది. రేడియో బాగా వినేది. దీంతోనే సాహితీ అభిరుచి పెరిగింది. పక్కనే వేముగంటి నర్సింహాచార్యులు ఉండేది. వారింట్లో విపరీతంగా పుస్తకాలు ఉండేవి. తరచుగా పోయి అక్కడే చదువుకునేవాణ్ణి. నేను మా ఇంటిలో ఎపుడూ ఒక ప్రశ్న మాదిరిగానే ఉండేది. ఆచార వ్యవహారాల పట్ల నాకు పట్టింపులు లేకుండే.1987లో నందిని సిధారెడ్డి గారు పరిచయమయ్యారు. వారి ద్వారా మంజీర రచయితల సంఘంలోకి వచ్చాను. రాహుల్‌ ‌సాంకృతాయన్‌ ‌సాహిత్యం కొత్తదారులు చూపింది. రంగనాయకమ్మ ప్రశ్నలు-జవాబులు పుస్తకం సమాజం పట్ల శాస్త్రీయ దృక్పథం కలిగించింది.

  ఇవాళ దేశానికి అతిపెద్ద సమస్య కమ్యూనల్‌ ‌ఫోర్సెస్‌. ‌మణిపూర్‌లో క్రౌర్యాన్ని చూస్తున్నం. ప్రభుత్వం వెనక ఉండి హత్యలు చేయించడం విషాదం. గతంలో గుజరాత్‌లో జరిగిన ప్రయోగం నేడు మణిపూర్‌లో జరుగుతోంది. మూకుమ్మడి హత్యలు ఒక వర్గం మీద జరగడం, దానికి పోలీసులు, ప్రభుత్వం మద్దతుగా ఉండటం చాలాచాలా ఆందోళనకరమైన విషయం. ఈ విషయంలో విశాల ప్రాతిపదికగా ఐక్యం  కావాల్సిన అవసరం ఉంది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం నిర్మించాల్సిన కర్తవ్యం మనదే. ఇవ్వాల్టికీ దక్షిణ భారతంలోని ప్రజల చైతన్యం గొప్పది. ప్రజల్లో సదాభిరుచి పోతుంది. మంచి కళను ఆరాధించడం, పుస్తక అధ్యయనం, ఉదాత్త భావాలను కలిగి ఉండకపోవడం శోచనీయం.  
image.png
నాటకం, సినిమా, కవిత్వం ప్రయాణం గురించి చెప్పండి.
బాల్యం నుంచి నాటకం అంటే మరీ ఇష్టం. బాల్యంలో సినిమా చూసొచ్చి నాతోటి పిల్లలకు సినిమా అభినయించి చెప్పేవాడిని.మా మేనమామ నవ్యకళానికేతన్‌ ‌సంస్థ ఆధ్వర్యంలో నాటకాలు వేసేది. అనేక నాటకాలు చూసి అద్దం ముందు నిలబడి పాత్రలను ప్రాక్టిసు చేసేది. అలా నాటకాల మీద విపరీతమైన ఆసక్తి పెరిగిపోయింది. హైస్కూల్‌లో పలు సందర్భాల్లో నాటకాలు వేసేది. డిగ్రీలో అనాజ్‌పూర్‌ ‌కిషన్‌ ‌సాయంతో నాటక పరిషత్‌ ‌పోటీల్లో ‘గార్ధవ బాండం’ పొలిటికల్‌ ‌సెటైర్‌ ‌నాటకంలో నటించి ‘ఉత్తమ హాస్యనటుడి’గా బహుమతి గెలుచుకోవడం మరచిపోలేని యాది. మంజీర రచయితల సంఘం ఆధ్వర్యంలో మద్యపాన నిషేధ  ఉద్యమంలో ‘గెలిచి తీరాలి మనం’ వీధినాటిక ప్రదర్శన ఆ రోజుల్లో ప్రజల్ని తీవ్రంగా ఆలోచింప చేసింది. నా తల్లి దు:ఖాన్ని చూసి అభినయించడం నేర్చుకున్నాను. అలిశెట్టి ప్రభాకర్‌ ‌చనిపోయినపుడు ఆర్థిక సాయం కోసం  తనికెళ్ల భరణి రాసిన ‘గోగ్రహణం’ నాటకం చారిటి షో చేశాం. ‘జై తెలంగాణ’ సినిమాలో నటించాను. సాహిత్య సృజనలో సిధారెడ్డి కవిత్వం తొలి ప్రేరణ. కె.శివారెడ్డి కవిత్వాన్ని  అనాజ్‌పూర్‌ ‌కిషన్‌ ‌పరిచయం చేశారు. 1980ల చివర్లో వసీరా, ఆశరాజు, త్రిపురనేని శ్రీనివాస్‌ల కవిత్వం నన్ను బాగా ఆకర్షించేది. నా తొలి కవిత ‘రూపాయి పారుతున్న దేశం’ ఆంధ్రప్రభలో అచ్చయి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అపుడు ఎన్‌.‌గోపి, వేముగంటి నర్సింహాచార్యులు అభినందించారు. ఖైదీల హక్కుల గురించి ‘బందీకానీ గొంతుక’ రాసిన కవితను చదివి వరవరరావు ప్రశంసించారు. సింగరేణిలో రమాకాంత్‌ ఎన్‌కౌంటర్‌, ‌లంబాడ మహిళ సమ్ము గురించి రాసిన కవితలు మంచి కవిగా నిలబెట్టినాయి. కవిత్వం కంటే కార్యకర్తృత్వం నాపై డామినేట్‌ ‌చేసింది. సిద్దిపేటలో ‘మరసం’ సభలు విరివిగా జరగాడానికి కీలక కార్యకర్తగా పనిచేశాను. సాహితీ సభా పనుల్లో తలమునకలై కవి క్రమంగా వెనకబడిపోయాడు. ఎన్‌.‌వేణుగోపాల్‌, ‌కె.శ్రీనివాస్‌, ‌వరవరరావు, ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ‌గారి ఉపన్యాసాలు నామీద ప్రభావం చూపాయి. దీంతోనే ఉపన్యాస కళవైపు అడుగు పడ్డాయి. పాటను ఉపన్యాసంతో మిశ్రమం చేశాను. ప్రజల్ని ఆలోచింప చేయడానికి ఉపకరించింది. మరోవైపు సాహిత్య వ్యాసాలు కూడా రాయడం, కొన్ని పాటలు కూడా రాశాను.
తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష మీద ఎపుడు, ఏ వయసులో కలిగింది..
మా మేనమామ 1969 తెలంగాణ ఉద్యమం వల్ల ఏడాది విద్యాసంవత్సరం నష్టపోయిండు. ఆ విషయం ఆయన ముచ్చటలో చెప్పుకోగా విన్నాను. చెన్నారెడ్డి మోసం చేసిండని అనేవాళ్లు. అదే తొలిపరిచయం. 1996లో ‘మరసం’లో నందిని సిధారెడ్డి గారు తెలంగాణ చర్చ తొలిసారిగా మొదలు పెట్టారు. ఎందుకు.. ఏమి•నే ఆయన మాకు వివరించారు.  ఆ రోజుల్లో తెలంగాణ డిమాండ్‌ను సమర్ధించిన  తొలి సాంస్కృతిక సంస్థ ‘మరసం’ మాత్రమే. 1996-97లో ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌సార్‌ ‌రాసిన ‘తెలంగాణలో ఏం జరుగుతోంది’ పుస్తకం మరింత ఆలోచింప చేసి క్లారిటి వచ్చింది. అక్కడి నుంచి తెలంగాణ గురించి అధ్యయనం ప్రారంభించాను. సిద్దిపేటలో 1998లో తెలంగాణ చైతన్య వేదిక పేరుతో  ఏర్పాటు చేశాం. కొంతకాలం తెలంగాణ జనసభతో కూడా కలిసి పని చేశాను. పోలీసు నిర్బంధం  పెరిగింది. ఐనప్పటికీ తెలంగాణ కోసం గొంతెత్తడం ఆగిపోగిపోలేదు. మిర్యాలగూడలో డిటిఎఫ్‌ ‌ప్రభాకర్‌ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ సభలో నేను చేసిన
ఉపన్యాసం చాలా మందిని ప్రభావితం చేసిందని మిత్రులు చెప్పారు. ఆ రికార్డును ఆ రోజుల్లో కేబుల్‌ ‌ప్రసారాలతో విరివిగా ప్రజలు విన్నట్లు ప్రశంసలు లభించాయి. 2000లో కరీంగనగర్‌ ‌రాజరాజేశ్వరీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ‘తెలంగాణ మాండలిక భాష’ మీద సిధారెడ్డి గారి ప్రోత్సాహంతో పాట,మాట) ప్రసంగంతో తిరుగులేకుండా ఉద్యమంలో ముందుకు నడిచాను. తెలంగాణ జాగృతి పేరుతో మురళీధర్‌ ‌దేశ్‌పాండె ఆధ్వర్యంలో బోధ్‌లో తొలిసారిగా టి.ఆర్‌.ఎస్‌ ‌సభలో ప్రసంగం చేసిన. కొహెడలో దేశిని చినమల్లయ్య 2004లో సభకు ఆహ్వానించారు. సిద్దిపేట నుంచి నన్ను తీసుకుపోవడానికి ఈటల రాజేందర్‌, ‌జగదీశ్వర్‌రెడ్డి వొచ్చారు. ఆ సభలో వ్యవసాయంలో కరెంటు సంక్షోభాన్ని చెప్పడంతో ప్రజల్లో మంచి స్పందన కనిపించింది. ఇక్కడి నుంచి టి.ఆర్‌.ఎస్‌ ‌సభలకు రెగ్యులర్‌ ఉపన్యాసకుడిగా గుర్తింపు లభించింది. డి.టి.ఎఫ్‌, ఏపీటిఎఫ్‌, ‌టి.ఎన్‌.‌జీ.ఓ, ఉద్యోగ సంఘాలు, ప్రజాసంఘాలు అనేక సభలకు అవిశ్రాంతమైన నడక సాగింది. తెలంగాణలో నేను అడుగు పెట్టని మండలం లేదు.
తెలంగాణ కల సాకారమవుతదని మీరు ఆశించారా ?
ఆ రోజుల్లో కేంద్రం కామన్‌ ‌మినిమం ప్రోగాం తీసుకురావడం మనకు చాలా త్వరగానే రీయాక్షన్‌ ‌మొదలయింది. సమైక్యవాదం సామాజిక వేదికల మీద నిలబడలేకుండా పోయింది. ఉద్యమం ఎత్తుగడలోని ఒడిదుడుకులతో వెనక్కి ముందుకు సాగింది. ఎన్నికల ద్వారా ఒత్తిడి పెంచడంతోపాటు ప్రజల నుంచి కూడా ఉద్యమరూపంలో ఒత్తిడి ఉండాలనేది భావన. కేసీయార్‌ ‌గారి దీక్షతో పరిస్థితులు పరిపక్వం కావడం జరిగింది. డిసెంబరు 9 తర్వాత జరిగిన ఉద్యమం అలల మీద జరిగినట్లు అనిపిస్తుంది. కానీ డిసెంబరు 9కి ముందు జరిగిన కృషి, భావజాల వ్యాప్తి ఉద్యమం, తీవ్రమైన వాగ్వాదయుద్ధాలు ఊరూరు తిరిగిన సందర్భాలు అదే నాకూ ఎక్కువ ఇష్టం. లాబీయింగ్‌, ‌ప్రజా
ఉద్యమం తెలంగాణ సాధనలో కీలకంగా పనిచేశాయి. దిల్లీలో  తెలంగాణ ఉద్యమం పట్ల తప్పుడు అవగాహాన ఉండేది. ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌సార్‌, ‌కేసీయార్‌ ‌గారి లాబీయింగ్‌ ‌బాగా పనిచేసింది. ఎన్నికలను ప్రభావితం చేసే అంశంగా తెలంగాణ ఎపుడైతే రాజకీయ ఎజెండాలో  చేరిందో రాష్ట్ర సాధన మార్గం సులభమైంది. తెలుగుదేశం పార్టీకి పొత్తులోకి రావాల్సిన ఆగత్యం ఏర్పడింది. డిమాండ్‌ ‌స్వరూపాన్ని అనుసరించి పోరాట స్వరూపాలుంటాయి.
తెలంగాణ ఉద్యమంలో మిమ్మల్ని తీవ్రంగా నిరాశ పరిచిన సందర్భాలు..
నాకు నిరాశ ఎపుడు కలుగలేదు. నాదీ ఎపుడూ గొప్ప ఆశావాహ దృక్పథమే. బహుశా…అది కవిత్వం నుంచి వొచ్చిందేమో. తెలంగాణకు ముందున్న ఉద్యమాల నుంచి వొచ్చిన ఒక చైతన్యంగా భావిస్తాను. దాంతోనే ఎపుడూ నిరాశ పడలేదు. కానీ యువకుల ఆత్మహత్యలు బాగా కలిచివేశాయి. అది ఎవరూ వాంఛించనిది, ఊహించనిదీ. తొలుత శ్రీకాంతచారి చనిపోయినపుడు నేను పోలీస్‌స్టేషన్‌లో
ఉన్నాను. ఆ వార్త విని విచలితున్నయిపోయాను. మన చైతన్యం చేస్తుంటే, ఈ ఆత్మార్పణాలు చాలాసార్లు చాలాచాలా బాధించేవి. త్యాగంరీత్యా చూస్తే గొప్పవే కానీ పోరాట రూపంగా చూసినపుడు అవాంఛనీయ పరిణామంగానే బాధించింది. ఎన్నికల్లో వొచ్చిన ఎగుడుదిగుడులు బాధించలేదు. ఎన్నికల్లోకి పోయాక ఉద్యమం కొత్త సెక్షన్‌లోకి చేరుకుంది. సెక్టేరియన్‌ ‌కాకుండా ఉద్యమ నాయకత్వం బాగా కృషి చేసింది. అది కూడా కేసీఆర్‌ ‌గారి నిరాహార దీక్ష తర్వాత మరింత ఎక్కువ జరిగింది.
తెలంగాణ ఉద్యమం మిమ్మల్ని కవిగా చూసిందా ? రాజకీయ వక్తగా చూసిందా ?
నాది అన్నింటితో కూడిన సమ్మిళితమైన ప్రదర్శన కళ. కేవలం నేను గాయకుడిని మాత్రమే కాదు. వక్తను కూడా. అందులో మాటలతో కూడిన అభినయం కూడా సమ్మిశ్రితమై వుంటుంది. నా ఉపన్యాసంలో కవిత్వం కూడా అంతర్భాగమై ఉండేది. కవితాత్మకమైన వాక్యాలు చాలా వొచ్చేవి. నేను చాలా మంది కవుల కవితలు బహిరంగ సభల్లో కోట్‌ ‌చేసేవాడిని. తెలంగాణ గురించి ఏ మంచి కవిత్వం కనిపించినా ఆ సభల్లో ఊటంకించేది. పాఠ్యపుస్తకాలకు సంబంధించిన అంశాలు, విగ్రహాలకు సంబంధించినవి మాట్లాడిన. వాటి ప్రతిఫలనాలు నాలో చాలా ఆత్మవిశ్వాసం పెంచింది. భావజాలం బ్రహ్మాడంగా జనంలోకి తీసుకుపోతే ప్రజలకు దానిమీద మానసిక ఐక్యత కలిగితే వెంటనే ప్రతిచర్య వుంటుంది.
తెలంగాణ పునర్నిర్మాణం గురించి కాస్త వివరించండి..
మలిదశ ఉద్యమంలో ప్రధానంగా రైతాంగానికి సంబంధించిన చర్చ తీవ్రంగా జరిగింది. చెరువులు, నదీజలాల పంపిణీ, వ్యవసాయ సంక్షోభం, రైతు ఆత్మహత్యల మీద ఎక్కవ దృష్టి సారించాం. 1969 ఉద్యమం కేవలం నిధులు, ఉద్యోగాల వరకే పరిమితమైంది. అపుడు నీళ్ల గురించి ఇంతగా చర్చలేదు. మలిదశ ఉద్యమంలో నీళ్లు ప్రధానమైన అంశంగా మారింది. అందుకే ఈ పదేళ్లలో ఎక్కువగా ఫోకస్‌ ‌గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, నీళ్లు, కరెంటు మీదనే దృష్టిపెట్టడంతో అభివృద్ధి సాధ్యమైంది. ప్రజలకు ఉపశమనం కలిగింది.. తెలంగాణ సాధనకు ముందు రైతులో జీవితేచ్ఛనే పోయింది. పాలకుల ఎజెండాలో మాకు సంబంధించిన చర్చ ఉండదనే భావన రైతుల్లో అప్పుడు ఉండేది. నిరాశతో కూడిన వాతావరణం ఉండేది. ఇదీ సాధారణమైన మార్పు కాదు. అభివృద్ధి జరిగిన కాలం చిన్నదే. 50 ఏళ్లలో జరిగిన అన్యాయం మాట్లాడుకుని యాభై ఏళ్లకు సంబంధించిన స్వాప్నిక సమాజాన్ని ప్రజల ముందు పెట్టినం. తెలంగాణ వ్యవసాయం రంగంలో వొచ్చిన మార్పు గణనీయమైంది. దాని ఫలితాలు ప్రజల అనుభవంలో ఉన్నవి. ఖచ్చితంగా ఇవ్వాళ అంతటి అలజడి లేదు.
రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల గురించి నిరుద్యోగ యువత ఆందోళనగా, అసంతృప్తిగా ఉంది. వారికి మీరిచ్చే సలహాలు..
నిరుద్యోగ సమస్య వేరు. తెలంగాణ ఉద్యమంలో చర్చ చేసింది వేరు. ఉద్యమంలో స్థానికులకు ఉద్యోగాలు లక్ష్యంగా చర్చ జరిగింది. మొత్తం నిరుద్యోగ సమస్య కాదు. నిరుద్యోగ సమస్య భారతదేశం అంతటా ఉంది. దీనికి భారతదేశ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి
ఉంది. ఉత్పత్తి కేంద్రంగా ఉండే ఆర్థిక వ్యవస్థ ఉండాలి. ఇవ్వాళ దేశంలో ఆ పరిస్థితి లేదు. ఒక సేవలరంగం, ఎంటర్‌టైన్మెంట్‌ ‌రంగాలు విజృంభిస్తున్నాయి. స్వదేశీయమైన ఉత్పత్తి లేదు. దీంతోనే యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు. అందరూ ప్రభుత్వ ఉద్యోగాలవైపే దృష్టి. ఎంత రిక్రూట్‌మెంట్‌ ‌చేసినా దానికి పరిమితి వుంటుంది. అదీ కూడా నిజానికి రిక్రూట్‌మెంట్‌ ‌మరోవైపు జరగుతూనే ఉంది కదా! ఎక్కడికక్కడ స్వయం ఉపాధి అనేది రావాల్సి ఉంది. వ్యవసాయిక అనుబంధ పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాల్లో రావాల్సి ఉంది. కనుక ఇదొక పెద్ద ప్రాసెస్‌. ‌తెలంగాణ ఉద్యమానికి సంబంధించినంత వరకు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నదే డిమాండ్‌. ఇదీ నెరవేరింది. కొత్త ప్రెసిడెన్షియల్‌  ‌చట్టం తేవడంతో స్థానికులకు ఉద్యోగాలనే డిమాండ్‌ ‌పూర్తిగా నెరవేరింది. అందరికీ ఉద్యోగాల కల్పన అనేది భారతదేశం ఏర్పడినప్పటి నుంచి
ఉన్నదే. నిరుద్యోగం అనేది దేశవ్యాప్త సమస్యగా అర్థం చేసుకోవాలి.
సినిమా తదితర పారిశ్రామిక రంగంలో ఆంధ్ర పెట్టుబడిదారుల గుత్తాధిపత్యానికి ప్రభుత్వ సహకారంపై మీ అభిప్రాయం.
సినిమా ఒక మార్కెట్‌. ‌దీంల్లో ప్రభుత్వ జోక్యం తక్కువగా వుంటుంది. నిర్మాతలు లాభాల దృష్టితోనే సినిమాలు తీస్తారు. ప్రభుత్వం చెప్పినట్లు సినిమాలు తీయరు. కొన్ని రంగాల్లో కొన్ని పరిమితులున్నాయి. అనివార్యతలు కూడా ఉన్నవి. ఆస్థాయిలో పెట్టుబడులు పెట్టగలిగేవారు ఉండటం పరిమితం. తెలంగాణ సమాజంలోనే ఆ శక్తులు బలపడి ఉన్నవి.
తెలంగాణ ఉద్యమ కవి గాయకుడిగా, భావజాల వ్యాప్తికర్తగా సమాజానికి మీరిచ్చే సందేశం..
తెలంగాణ సమజానికి సందేశాన్ని ఇచ్చే శక్తివంతుణ్ణి కాదు. అంతటి అనుభవం కూడా నాదీ కాదు.కానీ తెలంగాణ ఉద్యమంలో ప్రజలకు సంఘటితంగా మాట్లాడటం అనే అనుభవం వొచ్చింది. ప్రజల ఆ సంఘటితత్వం కాపాడుకోవాలి. వాళ్ల వాళ్ల సిద్ధాంత పరిధుల్ని అధిగమించి అంశాల వారిగా కలిసి నడిచారు.  ఇదొక అద్భుతమైన విషయం.  ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌గారు చెప్పినట్లు తెలంగాణ కోసం ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌నుంచి ఆర్‌.ఎస్‌.‌యు వరకు కలిసి నడక సాగింది. నేడు విశాలమైన ప్రాతిపదికగా ప్రజా ఉద్యమాలు నడవాల్సిన అవసరం
ఉంది. ఇవాళ దేశానికి అతిపెద్ద సమస్య కమ్యూనల్‌ ‌ఫోర్సెస్‌. ‌మణిపూర్‌లో క్రౌర్యాన్ని చూస్తున్నం. ప్రభుత్వం వెనక ఉండి హత్యలు చేయించడం విషాదం. గతంలో గుజరాత్‌లో జరిగిన ప్రయోగం నేడు మణిపూర్‌లో జరుగుతోంది. మూకుమ్మడి హత్యలు ఒక వర్గం మీద జరగడం, దానికి పోలీసులు, ప్రభుత్వం మద్దతుగా ఉండటం చాలాచాలా ఆందోళనకరమైన విషయం. ఈ విషయంలో విశాల ప్రాతిపదికగా ఐక్యం  కావాల్సిన అవసరం ఉంది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం నిర్మించాల్సిన కర్తవ్యం మనదే. ఇవ్వాల్టికీ దక్షిణ భారతంలోని ప్రజల చైతన్యం గొప్పది. ప్రజల్లో సదాభిరుచి పోతుంది. మంచి కళను ఆరాధించడం, పుస్తక అధ్యయనం, ఉదాత్త భావాలను కలిగి ఉండకపోవడం శోచనీయం. ప్రచార దుగ్ద మేధావుల్లో  కూడా పెరిగింది. ఉత్తమ అభిరుచులు, ఉత్తమ సాహిత్యం ప్రజల్లోకి తేవాల్సిన అవసరం ఉంది. విప్లవాలు తర్వాత ముందు ఈ ప్రయత్నం జరగాల్సి ఉంది. కాలేజీల్లో విద్యార్థి సంఘాలు కనుమరుగై ఉన్మాద విషసంస్కృతి కౌగిట్లో విద్యార్థులు చిక్కుతున్నారు.
సమాజం అంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
-కోడం కుమారస్వామి
ప్రజాతంత్ర – కాళోజీ జంక్షన్‌(‌వరంగల్‌)

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie