Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

‘శ్రావణ’ గండం పార్టీలు అప్రమత్తం

0

గుబులు రేపుతున్న ‘మార్పు’ ప్రచారం
కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి సంచలనాలు
కండువాలు మార్చనున్న కీలక నేతలు?
నిశితంగా పరిశీలిస్తున్న అధిష్టానాలు
ఇప్పటి దాకా మంచిరోజుల కోసం ఎదురుచూపు
దగ్గర పడుతున్న అసెంబ్లీ ఎన్నికల గడువు
అభ్యర్థుల ఎంపికకు హైకమాండ్ తుది మెరుగులు
నేతలకు టిక్కెట్ల కేటాయింపులే అసలు సమస్య
బీఫారం రాకపోతే పార్టీల మార్పు ఖాయం

 

శ్రావణమాసం రాజకీయ పార్టీలన్నింటిలో గుబులు రేపుతోంది. ఇప్పటి దాకా ప్రధాన పార్టీలు ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటనకు ముహూర్తాల కోసం ఎదురుచూసాయి. ఇటు నాయకులు సైతం పార్టీ మార్పునకు మంచి రోజుల కోసం ఎదురుచూశారు. శ్రావణమాసం మొదలు కావడంతో పార్టీ అధినేతలు, నేతలు ఒక్కసారిగా అలర్ట్​అయ్యారు. దీంతో ఎప్పుడు ఏ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తుందోననే ఆసక్తి రాజకీయ వర్గాలలో నెలకొన్నది. కాంగ్రెస్ గురువారం నుంచే టిక్కెట్ల కోసం ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పర్వానికి తెరలేపింది. బీఆర్ఎస్​ సైతం 80 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించేందుకు సిద్ధమైందని అంటున్నారు.

ముహూర్తం 21
ఈ నెల 21 పంచమితో కూడిన శ్రావణ సోమవారం కావడంతో ఆ రోజు అభ్యర్థులను ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న బీజేపీ సైతం త్వరలోనే ప్రక్రియను ముగించాలని చూస్తోంది. అభ్యర్థుల ప్రకటన విషయాన్ని అటుంచితే, నేతల పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారం అన్ని పార్టీలను కలవరానికి గురి చేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్​ పార్టీలకు చెందిన చాలా మంది నాయకులు తమకు టిక్కెట్లు రాకపోతే పార్టీ మారాలని నిర్ణయం కొందరు ఈ మేరకు అనుచరులతో ప్రచారం చేయించుకుని అధిష్టానం దృష్టిలో పడ్డారు. ఇంకొందరు టిక్కెట్ రాకపోతే పార్టీ మారి తీరుతామని అల్టిమేటం జారీ చేశారు. ఇలాంటి వారిలో కొందరు టిక్కెట్ల హామీలు పొందినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ప్రస్తుతం తెలంగాణలో పొలిటికల్​కన్ఫ్యూజన్ నెలకొంది. శ్రావణమాసం ప్రారంభమైన నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక జాబితాకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాయి. సీనియర్ల పార్టీ మార్పుపై వినిపిస్తున్న ఊహాగానాలతో అప్రమత్తంగానూ ఉంటున్నాయి. సీనియర్లను పార్టీలో చేర్పించుకునేందుకు ఇదే అనుకూల సమయమని భావిస్తున్న ప్రధాన పార్టీలు వారికి గాలం వేస్తున్నాయి. అధికార బీఆర్ఎస్​, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు చాలా మంది నేతలపై పార్టీ మార్పు ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్​ లో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి నలుగురైదుగురు ఆశావాహులున్నారు. టిక్కెట్టు రాకపోతే వీరిలో కొందరు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాలలో గెలుపు గుర్రాల ఎంపిక అధికార పార్టీకి సవాలుగా మారింది. ఒకవేళ ఇతర నేతలు పార్టీ మారితే గెలుపుపై పడే ప్రతికూల ప్రభావాలపైనా సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నారు. పార్టీ మారుతారనే ప్రచారంలో ఉన్న కొందరితో నేరుగా మాట్లాడిన కేసీఆర్ వారికి నామినేటెడ్ పొస్టుల హామీ సైతం ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.

వీరుంటారా? మారుతారా!
బీఆర్ఎస్ అధినేత ముందు అసంతృప్తి తెలపలేని, ఈ ఎన్నికలలో ఎలాగైనా పోటీ చేయాలనే తపనతో ఉన్నకొందరు నేతలు కాంగ్రెస్​ వైపు చూస్తున్నారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి, హైదరాబాద్ నగర మాజీ మేయర్​ తీగల కృష్ణారెడ్డి, కొత్తగూడెం, జనగామ, మంచిర్యాల, బెల్లంపల్లి,స్టేషన్ ఘన్ పూర్, నల్లగొండ, మహబూబాబాద్​ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నడిపెల్లి దివాకర్​ రావు, దుర్గం చిన్నయ్య, తాటికొండ రాజయ్య, కంచర్ల భూపాల్​ రెడ్డి, శంకర్ నాయక్​కు ఈ సారి టిక్కెట్లు అనుమానమేననే ప్రచారం జరుగుతోంది. దీంతో వచ్చే ఎన్నికలలో పోటీ విషయంలో వారి నిర్ణయం ఎలా ఉంటుందోననే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్​పార్టీ బలంగా ఉన్న, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలపై సీఎం కేసీఆర్​ ప్రత్యేక దృష్టిసారించారు. ఇప్పటికే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్​ కుమార్​రెడ్డి, జానారెడ్డితో చర్చలు జరిపినట్లు ప్రచారం జరగగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ప్రచారాన్ని ఖండించారు. జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దంటూ సంగారెడ్డికి చెందిన పలువురు బీఆర్ఎస్​ నేతలు గురువారం హరీశ్​రావును కలవడం గమనార్హం.

కాంగ్రెస్ లోనూ కలవరం
కాంగ్రెస్ సీనియర్లలో నెలకొన్న విభేదాలు, కొనసాగుతోన్న చేరికలు, మారుతున్న సమీకరణాలను పరిశీలిస్తే, రానున్న రోజులలో ఏ నేత ఏ పార్టీలో చేరుతారోననే ఆందోళన అధిష్టానంలో నెలకొన్నది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరికపై స్థానిక కీలక నేత జగదీశ్వరరావు తో పాటు నాగర్ కర్నూల్ కు చెందిన నాగం జనార్దన్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడిన నాగం జనార్ధన్ రెడ్డి కొల్లాపూర్​లో జగదీశ్వర రావు ముందు నుండే పార్టీలో కష్టపడి పని చేస్తుంటే జూపల్లి వచ్చి మద్యలో దూరారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో జగదీశ్వరరావు పార్టీ వీడుతారనే ప్రచారం జరుగుతోంది. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేశ్ రెడ్డి సైతం ఇటీవల కాంగ్రెస్​ లో చేశారు. వచ్చే ఎన్నికలలో ఆయన నాగర్ కర్నూల్​ టిక్కెట్ ఆశిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రాజేశ్ రెడ్డి చేరికపైనా నాగం అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించాలంటూ టీపీసీసీ, ఏఐసీసీ వేదికగా పోరాటం చేస్తున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అడిగిన సీట్లు ఇవ్వకపోతే కాంగ్రెస్ ను బీసీలే ఓడిస్తారంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా వచ్చే ఎన్నికలలో ఆయన తన వర్గానికి ఎన్ని సీట్లు ఖాయం చేసుకుంటారోననే చర్చ హాట్ టాపిక్​ గా మారింది. ఒకవేళ అధిష్టానం అడిగిన మేరకు టిక్కెట్లు ఇవ్వకపోతే ఎంత మంది బీసీలు కాంగ్రెస్​ పార్టీకి దూరమవుతారోననే ప్రచారం జరుగుతోంది.

ప్రత్యామ్నాయం బీజేపీ
కాంగ్రెస్​, బీఆర్ఎస్ అసంతృప్త నేతలకు బీజేపీ ప్రత్యామ్నాయంగా మారింది. ఆయా పార్టీలలో పోటీ ఎక్కువగా ఉండడంతో టిక్కెట్ల అవకాశాలున్న బీజేపీ వైపు అసంతృప్త నేతలు దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ గ్రాఫ్​ పడిపోవడం, చాలా వరకు సెగ్మెంట్లలో ఎమ్మెల్యే అభ్యర్థులే లేకపోవడంతో ఆ పార్టీ అధిష్టానం కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్​, బంగారు లక్ష్మణ్​ సహా సీనియర్లందరినీ బరిలో దింపాలని భావిస్తోంది. అయినా పలు నియోజకవర్గాలలో ఎమ్మెల్యే స్ధాయి అభ్యర్థులు లేకపోవడంతో బీఆర్ఎస్​ కు చెందిన అసంతృప్త నేతలకు గాలం వేస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్​ పలువురు అసంతృప్తులతో రహస్య చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా ఆయన బీఆర్ఎస్ కు చెందిన 15 మంది కీలక నేతలు త్వరలోనే బీజేపీలో చేరుతారంటూ గురువారం ప్రకటించడం చర్చకు దారితీసింది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie