తెలంగాణను ఐదు అంతర్జాతీయ అవార్డులు వరించాయి. రాష్ట్రంలోని ఐదు నిర్మాణాలకు లండన్‌లోని గ్రీన్ ఆర్గనైజేషన్ అందిస్తున్న గ్రీన్ యాపిల్ అవార్డులు దక్కాయి. సచివాలయం, యాదాద్రి ఆలయం, మొజంజాహీ మార్కెట్, దుర్గం చెరువు, కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణాలకు ఈ అరుదైన గౌరవం లభించింది. భారత్‌కు గ్రీన్ యాపిల్ అవార్డులు రావడం ఇదే ప్రప్రథమమని ఈ సందర్భంగా గ్రీన్ ఆర్గనైజేషన్ వెల్లడించింది.
బ్యూటిఫుల్ వర్క్‌స్పేస్ బిల్డింగ్ కేటగిరీలో తెలంగాణ సచివాలయానికి, హెరిటేజ్ కేటగిరీలో మొజంజాహీ మార్కెట్‌కు, యూనిక్ డిజైన్ కేటగిరీలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికి, స్పెషల్ ఆఫీస్ కేటగిరీలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు, అద్భుతమైన మతపరమైన నిర్మాణాల విభాగంలో యాదాద్రి ఆలయానికి గ్రీన్ యాపిల్ అవార్డులు వచ్చాయి. మే 16న లండన్‌లో జరగనున్న అవార్డుల ప్రదానోత్సవంలో స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ ఈ అవార్డులను అందుకోనున్నారు. కాగా, తెలంగాణకు ఐదు అంతర్జాతీయ అవార్డులు రావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
అసలేంటి గ్రీన్ ఆర్గనైజేషన్ అంతే ఏమిటి ?
ది గ్రీన్ ఆర్గనైజేషన్ 1994లో లండన్‌లో ఏర్పాటైంది. ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ గురించి ప్రచారం చేయడంతో పాటు.. ఇందుకు కృషి చేస్తున్న వారిని ఇది గుర్తించి అవార్డులు అందిస్తున్నది. ఈ మేరకు 2016 నుంచి గ్రీన్ యాపిల్ అవార్డులు మొదలుపెట్టింది. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తున్న సంస్థలు, కౌన్సిల్స్, కమ్యూనిటీలకు ఇది అవార్డులను అందిస్తున్నది.
అత్యంత విశాలమైన ప్రదేశంలో ఆకర్షణీయంగా నిర్మించడంతో పాటు ఇతరత్రా విషయాలను పరిగణలోకి తీసుకుని భవన నిర్మాణాలకు ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అవార్డులను అందజేస్తున్నది. నివాసాలు, కోటలు, మ్యూజియం, బ్రిడ్జిలు, మతపరమైన స్మారక కట్టడాలు, వారసత్వ కట్టడాలు.. ఇలా వివిధ కేటగిరీల్లో ఈ అవార్డులు ఇస్తున్నది. గతంలో లండన్‌లోని బాఫ్టా ( బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్), నేషనల్ మ్యూజియం ఆఫ్ ఖతార్, మలేసియాలోని జలాన్ మహ్‌కోట ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నాయి.