తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త పాత్రలోకి ప్రవేశించారు. పార్టీని గతంలో వీడిన వారు ఎవరైనా రావచ్చని ఆయన పేర్కొన్నారు. తాను మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో పనిచేస్తున్నానని, ఎవరైనా ఢిల్లీ పెద్దలతో ఏ విషయమైనా మాట్లాడుకోవచ్చని తెలిపారు. బీఆర్ఎస్ ను ఓడించాలంటే అందరూ ఏకమవ్వాలని రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. వచ్చిన నేతలను సాదరంగా ఆహ్వానం పలుకుతామని తెలిపారు. కాంగ్రెస్‌లో ఇక వర్గాలు ఉండవని, ఒకే వర్గం పార్టీ విజయం కోసం పనిచేస్తుందని తెలిపారు.
కవిత అరెస్ట్ చేయకపోడమే మైనస్సా.
పార్టీని వీడిన నేతలందరూ తిరిగి కాంగ్రెస్‌కు వచ్చినా ఆదరణ ఏమాత్రం తగ్గదని కూడా రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.ప్రధానంగా కర్ణాటక ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అనుసరించిన స్టయిల్‌ను రేవంత్ రెడ్డి కూడా అనుకరిస్తున్నారు. అందరినీ కలుపుకుని పోయి కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలన్న లక్ష్యంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిస్తే ఆ క్రెడిట్‌లో కొంతైనా తనకు దక్కుతుందని ఆయనకు తెలియంది కాదు. అలాగే ముఖ్యమంత్రి పదవి కూడా తన చేతిలో లేదని అర్థమయింది.
డీకే శివకుమార్ ను చూసిన తర్వాతైనా అలాంటి అపోహలు కాంగ్రెస్‌లో ఎవరు పెట్టుకున్నా అది తుడిచేయాల్సిన పరిస్థిితి ఏర్పడింది. ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాదు తెలంగాణలోని కాంగ్రెస్ నేతలందరూ హైకమాండ్ నిర్ణయానికే కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.. ముందుగానే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను ముఖ్యమంత్రి పదవి రేసులో లేనని చెప్పడం వెనక కూడా డీకేను చూసిన తర్వాతనే అంటున్నారు. ఇక ముఖ్యమంత్రి పదవిపై ఆశలకన్నా కాంగ్రెస్ నేతల్లో అధికారంలోకి పార్టీ వస్తే చాలు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది.
గొడవలు పడి పార్టీని మరోసారి అధికారంలోకి రానివ్వకుండా చేస్తే నష్టపోయేది పార్టీ కన్నా తామేనని గుర్తించిన నేతలందరూ ఐక్యత బాట పడుతున్నట్లే కనిపిస్తుంది.. నిజానికి డీకే శివకుమార్ పడిన కష్టానికి ఆయనకే ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని అందరూ ఆశించినా.. అనుకున్నట్లుగానే సిద్ధరామయ్య ఎగరేసుకు పోయారు. రెండేళ్ల తర్వాత ఎవరు రాజో? ఎవరు రెడ్డో? ఎవరికీ తెలియదు. అందుకే అధికారంలోకి వస్తే కనీసం పవర్ మజాని అయినా అనుభవించవచ్చని తెలంగాణ కాంగ్రెస్ నేతలందరూ ఏకాభ్రియానికి వచ్చినట్లే కనిపిస్తుంది.
తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా దాదాపు తొమ్మిదేళ్ల నుంచి పవర్ కు దూరంగా ఉంది. ఇప్పుడు రాకపోతే క్యాడర్ తో పాటు ఓటు బ్యాంకును కూడా కోల్పోవడం కష్టమే. అందుకే తెలంగాణ కాంగ్రెస్ నేతలందరిలోనూ ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసి కనిపిస్తుంది. మరి అందరూ ఏకమై ఒకే మాట మీద నడిస్తే అది పెద్ద కష్టమేమీ కాదన్న కామెంట్స్ కూడా వినపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు మంచి రోజులు వచ్చినట్లేనా?