Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఈ సారి..అంత ఈజీ కాదా…

0

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీని టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి తొలిసారి ఎన్నికలకు వెళుతున్నారు. ఈ ఏడాది అక్బోబరులోనే తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయని ఆయనే ఎమ్మెల్యేలకు తెలిపారు. డిసెంబరు వరకూ సమయం ఉన్నప్పటికీ కేంద్ర ఎన్నికల కమిషన్ అక్టోబరులో నిర్వహించే అవకాశముందని ఆయన అంచనా వేస్తున్నారు. అంటే ఆగస్టులో తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. అంటే కేసీఆర్ లెక్క ప్రకారమే ఇంకో మూడు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.

 

అయితే ఇప్పటి వరకూ కేసీఆర్ దేశ రాజకీయాలు తప్పించి రాష్ట్ర రాజకీయాలపై పెద్దగా ఫోకస్ పెట్టలేదనే చెప్పాలి. హైదరాబాద్‌లో మాత్రం అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, నూతన సచివాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అంతే తప్ప ఆయన జిల్లాల్లో తిరిగింది లేదు. మరోవైపు అనేక సమస్యలు ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ చూడాల్సి వస్తుంది. బీజేపీ బలపడి కాంగ్రెస్ ఓట్లు చీల్చుకుంటే తన గెలుపు మూడోసారి సులువని లెక్కలు వేసుకుంటున్నారు. అయితే అది సాధ్యమా? ఆయన హామీలు ఎంత వరకూ నెరవేరాయన్నది పెద్దయెత్తున ప్రజల్లో చర్చ జరుగుతుంది.

 

కేసీఆర్ అంచనా వేసినట్లుగా ఏ వర్గమూ సంతృప్తికరంగా లేవని పలు సంస్థల సర్వేల్లో వెల్లడవుతుంది. అయితే ఈ అసంతృప్తి కేసీఆర్ గెలుపుపై ఎంత ప్రభావం చూపుతుందన్న విషయం పక్కన పెడితే ఈ ఎన్నికలు కేసీఆర్‌కు అంత కష్టం కాదన్నది కాదనలేని వాస్తవం  రైతులకు పెట్టుబడి సాయం ఇస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ అదే సమయంలో రుణమాఫీ విషయంలో చేతులెత్తేశారు.గత ఎన్నికలకు ముందు లక్ష రూపాయల రైతు రుణ మాఫీ చేస్తానన్న కేసీఆర్ హామీ నెరవేరలేదు.

 

ఇప్పటికీ పాతిక వేల రూపాయల లోపు రుణం పొందిన వారికే రుణ మాఫీ చేయగలిగారు. ఇంకా దాదాపు 30 లక్ష మంది రైతులకు రుణ మాఫీ చేయాల్సి ఉందని చెబుతున్నారు. వీరంతా కేసీఆర్ సర్కార్‌పై అసంతృప్తితోనే ఉన్నారని తెలుస్తోంది. అలాగే పోయిన సారి వచ్చిన వరదలకే పంట నష్టం చెల్లించలేదు. ఇక ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇక సాయం అందుతున్న నమ్మకమూ లేదు. ఆయన ఆదేశాలు వచ్చే లోపు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని వాపోతున్నారు రైతులు. రైతాంగం నీరు తమ పొలాలకు అందుతున్నాయని ఆనంద పడలా? లేక నష్టపోయిన పంటను చూసి ఏడ్వాలా? కూడా తెలియడం లేదు.

 

125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన దళితుల ఓట్లన్నీ గంపగుత్తగా పడే అవకాశమైతే లేదు.  వాహనాలు ఆగిపోయిన ఘటన భారత్ లో చోటు చేసుకోలేదు దళిత బంధు… దళిత బంధు పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలను ఇస్తానని ప్రకటించారు. బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించారు. కానీ పంపిణీ చేయాలంటే పైసలు లేవు. జీతాలకే వెతుక్కోవాల్సిన పరిస్థితి. కేంద్రంతో కొట్లాట కారణంగా ఆ సర్కార్ అప్పులకు రెడ్ సిగ్నల్ చెబుతుంది. ఇలా కేసీఆర్ దళిత బంధు పథకం హామీ ఎన్నికలు వచ్చే లోపు నెరవేరదనే చెప్పాలి.

 

అయినా దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేలు సూచించిన వారికే కొందరికి ఇస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దళితుల్లోనే ఎక్కువ మంది అసంతృప్తిగా ఉన్నారని పలు సంస్థలు జరిపిన సర్వేల్లో వెల్లడవుతుంది. హుజూరాబాద్‌లో దళితబంధు పథకం అమలు చేసినా కొందరికే దక్కడంతో మిగిలిన వారు ఈటలవైపే మొగ్గు చూపిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలోని దళితులందరికీ ఎన్నికలలోపు ఆ పథకాన్ని వర్తింప చేయడం కేసీఆర్ వల్ల కాదు. దీంతో ఆ వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవ్వడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.

 

డబుల్ బెడ్‌ రూం ఇళ్లు కూడా కేసీఆర్ సర్కార్‌కు ఇబ్బందికరంగా మారనున్నాయి. కొందరికే అవి దక్కడంతో ఎక్కువ మంది అసంతృప్తికి గురవుతున్నారు. ఈ పథకంలో కూడా ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన వారికే ప్రాధాన్యత ఇవ్వడం ఇబ్బందికరంగా మారింది. అర్హులైన వారికి కాకుండా అనుయాయులకే ఎమ్మెల్యేలు కట్టబెడుతున్నారన్న విమర్శలున్నాయి. ఇక విద్యార్థులు, నిరుద్యోగులు కూడా కేసీఆర్ పాలన పట్ల సంతృప్తికరంగా లేరన్నది వాస్తవం. నోటిఫికేషన్లు విడుదలయినా పోస్టులు భర్తీ చేయలేకపోవడం, ప్రశ్నాపత్రాల లీకేజీ వంటివి కేసీఆర్ పాలనపై అసంతృప్తిని మరింత పెంచిందంటున్నారు. తొమ్మిదేళ్ల పాలన చూసిన ప్రజలు కూడా కేసీఆర్ పాలనపై విసుగెత్తి ఉన్నారని పలు సర్వేల్లో ఇప్పటికే వెల్లడయింది.

 

నోటిఫికేషన్ వెలువడితే ఇక చేయడానికి ఏమీ ఉండదు. కేసీఆర్ కేబినెట్ లోని మంత్రుల్లో ఎక్కువ మంది ఈసారి గెలిచే అవకాశం లేదన్న వార్తలు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. డబ్బు అన్ని రోజులూ పనిచేయదు. తెలంగాణలో అస్సలు అది వర్క్‌ అవుట్ కాదు. ప్రజలు మార్పు కావాలని కోరుకుంటే కేసీఆర్‌కు జనం గుడ్‌బైై చెప్పడం ఖాయమంటున్నారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చి ఉండవచ్చు. అయితే ఆ జమానా వేరు. ఇప్పుడు జనరేషన్ వేరు. యువతలో కొంత మార్పు వచ్చిందన్నది విశ్లేషకుల అంచనా. మరి వీటన్నింటి నుంచి కేసీఆర్ తనదైన వ్యూహంతో ఎలా బయటపడతారన్నది ఆసక్తికరమైన అంశమే.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie