రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టిడిపి నేత ఆంజనేయులు. మృతదేహాన్ని అనాథ శవంలా వదిలివేశారన్న టిడిపి నేతలు.
కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి, అమలాపురం నియోజకవర్గం ఇన్చార్జి అయితా బత్తుల ఆనందరావు అన్నారు. అమలాపురం సమనస గ్రామానికి చెందిన టిడిపి నేత, మాజీ ఎంపిటిసి ఆంజనేయులు రాజమండ్రిలో జరిగిన మహానాడుకు వెళ్లి తిరిగి వస్తుండగా మందపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో అతడి మృతదేహాన్ని కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా డెడ్ బాడీని అనాథ శవంలా వదిలేశారని టిడిపి నేతలు మండిపడ్డారు.
కనీసం మృతదేహాన్ని ఫ్రీజర్ బాక్స్లో పెట్టకపోవడం శోచనీయమన్నారు. డెడ్ బాడీ నుంచి వచ్చిన రక్తం మంచం, నేలపైన పారిందన్నారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటాం
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టిడిపి నేత, మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు కుటుంబాన్ని పార్టీ పరంగా ఆదుకుంటామని టిడిపి నేతలు రెడ్డి అనంత కుమారి, అయితాబత్తుల ఆనందరావు తెలిపారు. మృతి చెందిన విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్ళామన్నారు. పార్టీ నేతను కోల్పోవడంపై వారు విచారం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.