టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర శుక్రవారం నందికొట్కూరు నియోజకవర్గం కృష్ణారావుపేటలో కొనసాగింది. అక్కడి పత్తిరైతును లోకేష్ కలిసి ఆయన సాధకబాధకాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు మంగలి సాయిబాబు మాట్లాడుతూ నాకున్న 3.5ఎకరాల్లో పత్తిపంట వేస్తున్నాను. నాలుగేళ్లుగా వరుస నష్టాలే వస్తున్నాయి. లక్షరూపాయలు ఖర్చవుతుంటే కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదు. అకాల వర్షాల వల్ల పంట దెబ్బతింటే ఇటువైపు ముఖం చూపించిన వారు లేరు. ప్రభుత్వం నుంచి విత్తనాలు, పంటల బీమా, సబ్సిడీలు ఏవీ రావడం లేదు. నకిలీ విత్తనాల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నాం.
పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆత్మహత్యలే శరణ్యమని అన్నారు. నారా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కల్తీ విత్తనాల మాఫియా పేట్రేగిపోతోంది. జగన్ అధికారంలోకి వచ్చాక అప్పుల పాలై 3వేలమందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుల సగటు అప్పులో ఆంధ్రప్రదేశ్ జాతీయస్థాయిలో మొదటిస్థానంలో ఉంది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కల్తీ విత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం. ఎపి సీడ్ కార్పొరేషన్ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సరఫరా చేస్తాం. పెట్టుబడులు తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని అన్నారు. .