ఎటు చూసినా పచ్చదనంతో అలరారుతుండే గ్రామాలన్నీ పోలీసు టికెట్లతో నిండిపోయాయి. జేసీబీలు, మట్టి తోలే ట్రక్కుల రద్దీ కనిపిస్తోంది. గ్రామీణుల కదలికలపై పోలీసు నిఘా ఉంది. ఎవరెటు పోతున్నారు.. గ్రామాల్లో కొత్త ముఖాలేమైనా ప్రత్యక్షమయ్యాయా అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం చుట్టుపక్కల జిల్లాల్లోని పేదలకు రాజధాని గ్రామాల్లో నివేశన స్థలాలు ఇచ్చేందుకు పనులు చేపట్టింది. ప్రభుత్వ నిర్ణయాన్ని రాజధానికి భూములు ఇచ్చిన రైతులు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.
కర్ర విరగకుండా, పాము చావకుండా ఉండేట్లు ధర్మాసనం ఆదేశించింది. ‘మా బతుకు అగమ్యగోచరమైంది.. ఈ ప్రభుత్వానికి మా ఉసురు తగలకపోదు..’ అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఒప్పందం మేరకు అభివృద్ది చేసిన భూములను ఇవ్వకుండానే ఆర్-5 జోన్ పేరుతో ఇతరులకు ఇళ్ల స్థలాలు కేటాయించడానికి అమరావతి రైతులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ప్రభుత్వమే ఇంత మోసం చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలంటూ నిలదీస్తున్నారు. జీవనాధారమైన భూములను రాజధాని కోసం త్యాగం చేస్తే ప్రతిఫలం ఇదా అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఎనిమిదేళ్ల క్రితం మేమిచ్చిన భూముల్లో నాలుగోవంతు అభివృద్ధి చేసి ప్లాట్లు ఇస్తామన్నారు. నాటి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ కూడా అంగీకరించారు. ఈయన ముఖ్యమంత్రి అయ్యాక మా ప్లాట్ల గురించి పట్టించుకోలేదు. అసలు రాజధాని ఇక్కడ కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇంకో రెండేళ్లయితే కౌలు కూడా రాదు. మా బతుకేంటో అర్థం కావడం లేదు. ఊరు విడిచి పోవాల్సి వస్తుందేమో. ఎటుపోవాలో తెలీడం లేదు.. అంటూ తుళ్లూరు మండలం దొండపాడు రైతు కన్నీళ్లు పెట్టుకున్నాడు.
‘ఇది అన్యాయమని నిలదీస్తే పోలీసులతో కొట్టించారు. మహిళలని కూడా చూడకుండా..’ అంటూ ఇక చెప్పలేక మొహం తిప్పుకున్నాడు.ఎకరానికి 40 క్వింటాళ్ల మిర్చి పండే భూములు మావి. ముందుగా అమ్ముకున్నోళ్లు బాగుపడ్డారు. బిడ్డల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని భూమిని తెగనమ్ముకోలేకపోయాం. నాడు అధికార ప్రతిపక్షాలు నమ్మబలికితేనే భూములు ఇచ్చాం. ఇప్పుడు మాకు కేటాయించిన భూమిని అభివృద్ధి చేయకుండా ఎక్కడ నుంచో కుటుంబాలను తీసుకొచ్చి ఇక్కడ ప్లాట్లు ఇవ్వడానికి సిద్దమవుతున్నారు.
ఇది అన్యాయం కాదా? పేదలను ముందుపెట్టి పెద్దలు నొక్కేసే కార్యక్రమంలా ఉంది.. అంటూ దొండపాడు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆయాల ఎకరానికి పాతిక సెంట్లు చెప్పున ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. ఆ భూములన్నీ చిల్లచెట్లతో నిండిపోయాయి. వాటిని అభివృద్ధి చేసి ముందు మాకివ్వాలి కదా ! ప్రభుత్వమే ఇంతటి మోసానికి పాల్పడితే ఇంక ఎవరికి చెప్పుకోవాలి ?.. అంటూ అనంతవరం గ్రామానికి చెందిన రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.తాడికొండ నియోజకవర్గంలోని నెక్కల్లు, అనంతవరం, పిచ్చికలపాలెం, బోరుపాలెం గ్రామాల పరిధిలో సుమారు 268 ఎకరాల్లో లే అవుట్లు సిద్దం చేస్తున్నారు.
ఆయా గ్రామాల్లో ప్రజలు పనులను అడ్డుకుంటారనే అనుమానంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసు బలగాలను దించింది. గ్రామాల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే ఆరా తీస్తున్నారు. లేఅవుట్లు సిద్దం చేస్తున్న భూముల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి పోలీసులకు డ్యూటీ వేశారు. బుధవారం రైతులకు, ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న కేసుపై సుప్రీం కోర్టు తీర్పు చెబుతున్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకూడదనే ప్రభుత్వం పోలీసు బలగాలను దించినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు.