Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

వ్యూహం ప్రకారమేవందే ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి..

0

న్యూఢిల్లీ ఏప్రిల్ 15:75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా అత్యాధునిక హంగులతో గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే సెమీ-హైస్పీడ్ వందే భారత్ రైళ్లకు 2019 ఫిబ్రవరిలో శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రధాన నగరాలకు అనుసంధానించడంలో భాగంగా రానున్న కాలంలో 400 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం బడ్జెట్‌లో నిధుల కేటాయింపులను కూడా చేపడుతోంది. అయితే, ఆదిలోనే హంసపాదు ఉన్నట్టు కొద్దికాలం క్రితం పట్టాలు దాటుతున్న పశువులను వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొన్న ఘటనలు రెండు మూడు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ఆ ఘటనలు కనుమరుగైనా, కొన్ని చోట్ల వందే భారత్ రైళ్లపై రాళ్ల దాడులు అదపాదడపా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, ఈనెల 14న ‘మైసూరు-చెన్నై’ వందే ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల రువ్విన ఘటన చోటుచేసుకోవడంతో ఈ దాడుల వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారు? వ్యూహాలు ఏవైనా ఉన్నాయా? అనే సందేహాలు మరోసారి తెరపైకి వచ్చాయి. బెంగళూరు డివిజన్ రూట్‌లో అగంతకులు రాళ్లు రువ్విన ఘటనలో నాలుగు కోచ్‌లకు చెందిన కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి.

ఈ ఘటనతో ప్రమేయమున్న వారిని గుర్తించేందుకు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.తాజా రాళ్ల దాడి ఘటనలో ఎవరూ గాయపడనప్పటికీ వ్యూహం ప్రకారమే దాడులు జరిగి ఉండవచ్చనే అభిప్రాయాన్ని ఒక ట్వీట్‌లో రైల్వే అధికారి ఒకరు వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు రువ్విన పలు ఘటనలు చోటుచేసుకున్నాయని, సికింద్రాబాద్-విశాఖపట్నం, న్యూ జలపాయ్‌గురి-హౌరా మార్గంలో ఈ ఘటనలు వెలుగుచూశాయని ఆయన చెప్పారు. ఈనెలలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌తో దాడి జరగడం ఇది రెండోసారని, దీనికి ముందు ఏప్రిల్‌లో విశాఖపట్నం-సికింద్రాబాద్ రూటులోనూ దాడులు జరిగాయని అన్నారు. మూడు నెలల్లో మూడోసారి దాడి జరిగినట్టు ఆయన వివరించారు. ఇటీవల కాలంలో తెలంగాణ, బిహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్‌లోనూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు రువ్వుడు ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఇండియాలోని 14 రూట్లలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. భోపాల్-న్యూఢిల్లీ, చెన్నై-కోయంబత్తూరు, సికింద్రాబాద్-తిరుపతి, అజ్మీర్-ఢిల్లీ కంటోన్మెంట్ రైళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్‌లో ప్రారంభించారు.

దాడుల వెనుక ఎవరున్నారు?
దేశంలోని పలు చోట్ల వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు రువ్వుడు ఘటనలు వెలుగుచూసినప్పటికీ, తాజగా బెంగళూరు డివిజన్‌లో కొద్ది గ్యాప్‌లోనే రెండుసార్లు దాడులు జరగడం వెనుక రాజకీయ కోణం ఏదైనా ఉందా? ఇవి ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయా? కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మరో నెల రోజుల్లో జరుగనున్న తరుణంలో రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఎవరైనా ఈ దాడులను ప్రేరేపిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రచారం కోసమే బీజేపీయే కావాలని కొట్టిస్తోందని, రాష్ట్రంలో బీజేపీకి ప్రభుత్వ వ్యతిరేకత కొంత ఉండటంతో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని కొందరి ఆరోపణగా ఉంది. అయితే, వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లతో కేంద్ర సర్కార్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే కొందరు కుయుక్తులు పన్నుతున్నారంటూ బీజేపీ తిప్పికొడుతోంది.

రాజకీయ ఉద్దేశాలతో దాడులు సిగ్గుచేటు…
వందేభారత్ రైళ్లపై రాళ్ల దాడుల ఘటనలను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ అడ్వయిజర్ కంచన్ గుప్తా తీవ్రంగా ఖండించారు. ”రాజకీయ ఆదేశాలు లేకుండా వందే భారత్ రైళ్లపై రాళ్ల దాడులు వంటివి చోటుచేసుకోవు. ఇది సిగ్గుచేటైన వ్యవహారం. ఇది భారత ముఖచిత్రం ముక్కు కోయడంతో సమానం. దేశానికి మంచి చేయలేకపోతే వచ్చినా ఇబ్బంది లేదు, కానీ దేశానికి ఎవరూ మంచి చేయకుండా అడ్డుకోవాలనుకోవడం మాత్రం మంచిది కాదు” అని ఆయన వ్యాఖ్యానించారు. రైల్వే ఆస్తులను కాపాడటమనేది సమష్టి బాధ్యత అని ఒక ప్రకటనలో పేర్కొంది. రైళ్ల మెయింటనెన్స్ అనేది రైల్వే సిబ్బంది పాత్ర మాత్రమే కాదని, ప్రయాణికుల పాత్ర కూడా సమంగా ఉందని పేర్కొంది. ఉభయులూ సహకరించినప్పుడే ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు అందుతాయని తెలిపింది. కాగా, గత జనవరి నుంచి కాజీపేట, ఖమ్మం, కాజీపేట-భువనగిరి, ఏలూరు-రాజమండ్రిలోని కొన్ని చోట్ల రాళ్ల రువ్వుడు ఘటనలు చోటుచేసుకోవడంపై దక్షిణ మధ్య రైల్వే తీవ్ర హెచ్చరికలు చేసింది. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు రైల్వే చట్టంలోని సెక్షన్ 153 కింద ఐదేళ్ల జైలు శిక్షను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది.

రైళ్లపై దాడులను నిరోధించేందుకు ఆర్‌పీఎప్ సైతం పలు చర్యలు చేపట్టింది. దాడులకు అవకాశమున్న ప్రాంతాల్లో బందోబస్తును పటిష్టం చేస్తోంది. ప్రజలను జాగృతం చేయడం, గ్రామ సర్పంచుల సమన్వయంతో ట్రాకుల వద్ద ‘విలేజ్ మిత్ర’ సంఘాలను ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకుంటోంది. కాగా, రైళ్లపై దాడుల వెనుక రాజకీయ కోణాన్ని కొట్టివేయలేనప్పటికీ రైల్వే శాఖ, ఆర్‌పీఎఫ్ ముందస్తు చర్యలు తీసుకోవడం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం వల్ల మెరుగైన వాతావరణం సాధ్యమని పలువురు సామాజిక కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie