స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి ఓ మహిళా సర్పంచ్ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హన్మకొండ జిల్లా జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. తాను గతంలో చేసిన లైంగిక ఆరోపణలకు సంబంధించి ఆధారాల టేపులు ఇవ్వాలని రాజయ్య తనపై ఒత్తిడి చేయిస్తున్నారని ఆరోపించారు. తన అనుచరులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. తనకు తన భర్తకు మధ్య చిచ్చు పెట్టాలని ఎమ్మెల్యే రాజయ్య చూస్తున్నారని నవ్య వ్యాఖ్యలు చేశారు. తన భర్తతో సహా ఎమ్మెల్యే రాజయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, దీనిపై మరోసారి తాను ఫిర్యాదు చేస్తానని నవ్య చెప్పారు.
కొద్ది రోజుల క్రితం స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మహిళా సర్పంచ్ లైంగిక ఆరోపణలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారని, హన్మకొండ జిల్లా జానకీపురం సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు చేశారు. తన మాట విననందుకు తనపై రాజయ్య లైంగిక వేధింపులకు దిగుతున్నారని నవ్య ఆరోపించింది. తనకు ఎమ్మెల్యే కాల్ చేసి బయటకు రమ్మంటున్నారని, కోరికతోనే పార్టీ టికెట్ ఇచ్చానని వేధిస్తున్నాడని నవ్య ఆరోపించారు. మరోవైపు నవ్య తనపై చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే రాజయ్య ఖండించారు.గత మార్చిలో మహిళా సర్పంచ్ ఎమ్మె్ల్యే రాజయ్యపై లైంగిక ఆరోపణలు చేశారు.
నవ్య ఆరోపణలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ వేధింపుల ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. అయితే, అధిష్ఠానం ఆదేశాలతో ఆరోపణలు చేసిన సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లి అదే నెలలో రాజయ్య సర్ధిచెప్పారు. ఇటీవల జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానని తెలిపారు. తనకు నలుగురు చెల్లెళ్లు ఉన్నారని, మహిళల ఆత్మగౌరవం కోసమే తాను పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రాణం ఉన్నంత వరకు మహిళలకు సహకారం అందిస్తానని అన్నారు. ఇటీవల జరిగిన కొన్ని పొరపాట్లకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. అభివృద్ధి విషయంలోనే నాపై ఆరోపణలు వచ్చాయని అన్నారు. జానకీపురం అభివృద్ధికి రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నానని చెప్పారు.
సర్పంచ్ నవ్య ప్రవీణ్ కుమార్ లను కాపాడుకుంటానని అన్నారు. పార్టీ అధిష్టానం కూడా జానకీపురం గ్రామం అభివృద్ధి చేయాలని ఆదేశించిందని అన్నారు. ప్రవీణ్ ను చూసే సర్పంచ్ కు టికెట్ ఇచ్చానని, నవ్యను చూసి కాదన్నారు. స్టేషన్ ఘనపూర్ లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని అన్నారు.తనపై కొందరు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయంగా ఎదుర్కొలేకే తనపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారని భావోద్వేగానికి గురయ్యారు. 63 ఏళ్ల వయసున్న తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు.
దమ్ముంటే ఫేస్ టూ ఫేస్ రాజకీయాలు చేయాలని.. తాడోపేడో తెలుసుకుందామని ఎమ్మెల్యే సవాలు విసిరారు. అయితే ఏ సర్వే చూసిన తాను ముందు వరుసలో ఉన్నానని, తనను నిజాయితీగా ఎదుర్కోలేక కొందరు శవ రాజకీయాలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. ఎవరరెన్ని ఇబ్బందులు పెట్టిన ఫాదర్ కొలంబో ఆశిస్సులతో ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని స్పష్టం చేశారు. ఎంతో ఆత్మీయంగా తాను మమత అనురాగాలు పంచిపెడుతూ మహిళల గౌరవాన్ని పెంచే విధంగా మగవారితో సమానంగా రాణించాలని ప్రోత్సహిస్తున్నానని, వాటిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలతోపాటు స్వపక్ష నాయకులు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.