అమరావతి ఫిబ్రవరి 13
గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను ఆకస్మికంగా మార్చి.. ఆయన స్థానంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను నియమించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2019 జూలై 24న విశ్వభూషణ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వంతో విభేదాలకు వెళ్లలేదు. ప్రభుత్వం నుంచి ఏ ఫైలు వచ్చినా దానిమీద పెద్దగా ప్రశ్నించేవారు కాదు. సర్కారుకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ పూర్తి సానుకూలత ప్రదర్శించారు. జగన్ ప్రభుత్వంతో గవర్నర్ పూర్తిస్థాయిలో మమేకమైనట్లు కేంద్రం కూడా గుర్తించింది. కొందరు ఢిల్లీ పెద్దలు ఈ వైఖరిని తప్పుపడుతున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. జగన్ ప్రభుత్వ అనాలోచిత విధానాలు, పోకడలను అడ్డుకోవాల్సిన ఆవశ్యకతను కేంద్రం గుర్తించిందా అన్న సందేహం తాజా నియామకం ద్వారా వ్యక్తమవుతోంది.
ఇలాంటి దూకుడుకు చెక్‌పెట్టడానికే జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను గవర్నర్‌గా నియమించారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎప్పుడూ వివాదాల జోలికిపోని జస్టిస్ అబ్దుల్ నజీర్ అవసరమైనప్పుడు చాలా గట్టిగా వ్యవహరిస్తారని, ఒత్తిళ్లకు లొంగరని న్యాయవర్గాలు అంటున్నాయి. ఈయన ద్వారా జగన్‌కు చెక్ పెట్టవచ్చని, మరీ అడ్డగోలుగా వ్యవహరించకుండా నిలువరించవచ్చనే ఆలోచనతోనే గవర్నర్‌గా ఎంచుకున్నారని చెబుతున్నారు.జగన్ సర్కారు చట్టవ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా.. మూడు రాజధానులు సహా అత్యంత వివాదాస్పదమైన చట్టాలు చేసినా మరో మాటకు ఆస్కారమివ్వకుండా గవర్నర్ విశ్వభూషణ్ ఆమోదముద్ర వేయడంపై ఢిల్లీ పెద్దలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
దానికి తాజా ఘటనే ఉదాహరణగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాజధాని ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రాలకు ఉన్న అధికారాలను పార్లమెంటులో ప్రస్తావించినప్పుడు.. ఆ ప్రశ్నతో నేరుగా సంబంధం లేకపోయినా.. జగన్‌రెడ్డి మూడు రాజధానుల చట్టంపై తమతో చర్చించలేదని, తమకు సమాచారం కూడా ఇవ్వలేదని కేంద్రం కొద్దిరోజుల కిందట ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రశ్న అడిగితే ఇలాంటి సమాధానం చెప్పడం సమంజసమే. కానీ ప్రశ్నతో సంబంధం లేకుండానే జవాబిచ్చిందని.. ఆ బిల్లు విషయంలో కేంద్రం జగన్ వైఖరి పట్ల అసహనంగా ఉన్నట్లు అర్థమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మూడు రాజధానుల బిల్లును విశ్వభూషణ్ కళ్లుమూసుకుని ఆమోదించారన్న ఆరోపణలు మొదటి నుంచీ ఉన్నాయి. అనేక సందర్భాల్లో కోర్టుమెట్లెక్కిన అనేక బిల్లులను గవర్నర్ న్యాయపరిశీలన కోరకుండానే ఆమోదించారన్న రాజకీయ విమర్శలూ లేకపోలేదు.
‘రాష్ట్రం ఏం చెప్పినా ఎస్ అంటున్నారు. ప్రభుత్వంలో, పాలనలో ఏదైనా తప్పు జరిగినప్పుడు గవర్నర్ ఎత్తిచూపించాలి. విధానపరమైన అంశాల్లో లోపాలు, ప్రతిపాదనల్లో తప్పులుంటే గవర్నర్ వెనక్కి తిప్పిపంపించాలి.తెలంగాణలో గవర్నర్ తమిళిసై అక్కడి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. ఇక్కడ ఆ స్థాయిలో కాకున్నా.. ప్రభుత్వానికి ఏది తప్పో.. ఏది ఒప్పో గవర్నర్ చెప్పగలగాలి. కానీ ఎందుకో ఆయన ఈ విషయంలో మౌనమునిలా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఏదొచ్చినా సంతకం పెట్టేస్తున్నారు’ అని ఢిల్లీ పెద్దలు గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. కేంద్రం ఇప్పటికైతే జగన్‌రెడ్డి ప్రభుత్వంతో కొంత మేర సత్సంబంధాలనే కొనసాగిస్తోంది. కొన్ని విషయాల్లో మాత్రం ఆచితూచి అడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది వరకు అడగడమే ఆలస్యం.. అదనపు అప్పులకు అనుమతి ఇచ్చేది. ఇప్పుడు కాస్త తగ్గించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై బీజేపీ నేతల స్వరం కూడా క్రమంగా మారుతూ వస్తోంది. కొందరు కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనకు వచ్చి జగన్ ప్రభుత్వ వైఖరిని, విధానాలను ఘాటుగానే విమర్శిస్తున్నారు.