గుండెపోటు’ అనే జగన్ చెప్పారు
సమయం నిర్దిష్టంగా చెప్పలేను
వివేకా కేసులో అజేయ కల్లం వాంగ్మూలం
త్వరలో దువ్వూరి కృష్ణ, ఉమ్మారెడ్డికీ పిలుపు!
వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలిసింది. ‘‘తన చిన్నాన్న వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని ఆరోజు జగన్ మాకు చెప్పారు’’ అని ఆయన తెలిపినట్లు సమాచారం. ‘ఏ సమయంలో చెప్పారు?’ అని సీబీఐ అధికారులు ప్రశ్నించగా.. ‘సమయం నిర్దిష్టంగా గుర్తులేదు. తెల్లవారుజామునే ఇది జరిగింది’’ అని పేర్కొన్నట్లు సమాచారం. 2019 మార్చి 14వ తేదీ అర్ధరాత్రి తర్వాత (15వ తేదీ) పులివెందులలో వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.
అదే రోజున.. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జగన్ ఎన్నికల ప్రణాళికపై సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అందులో.. అజేయ కల్లం, జగన్ వ్యక్తిగత కార్యదర్శి కృష్ణమోహన్ రెడ్డి, ప్రస్తుత ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ, మేనిఫెస్టో కమిటీ చైర్మన్, ప్రస్తుత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.సమావేశంలో ఉండగానే తన సతీమణి భారతి నుంచి ఫోన్ రావడంతో.. జగన్ పైఅంతస్తుకు వెళ్లారు.ఆ తర్వాత కిందికి వచ్చి.. ‘చిన్నాన్న గుండెపోటుతో మరణించారు’ అని చెప్పినట్లు తెలిసింది.
భూమా అఖిల ప్రియను అరెస్ట్ చేసిన నంద్యాల పోలీసులు
ఈ నేపథ్యంలో.. జగన్‌తో ఆ సమయంలో సమావేశమైన వారి నుంచి వివరాలు రాబట్టాలని సీబీఐ నిర్ణయించుకుంది. ఇదే క్రమంలోనే ఇటీవల అజేయ కల్లంను పిలిచి, ఆయన వాంగ్మూలం తీసుకున్నట్లు సమాచారం. ‘చిన్నాన్న గుండెపోటుతో చనిపోయారు’ అని జగన్ తమకు చెప్పినట్లుగా అజేయ కల్లం వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని సీబీఐ అధికారులు కడప సెంట్రల్ జైలులోని అతిథి గృహంలో ప్రశ్నించారు. తాజాగా అజేయ కల్లం వాంగ్మూలాన్నీ నమోదు చేసుకున్నారు. ఇక మిగిలింది… ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దువ్వూరి కృష్ణ! అతి త్వరలో వారికీ పిలుపు వచ్చే అవకాశముంది!