- ఎస్సై ఇంట్లో 1,750 గ్రాముల డ్రగ్స్
- స్వాధీనం చేసుకున్న నార్కోటిక్ విభాగం అధికారులు
- గతంలో సర్వీస్‌నుంచి రాజేందర్తొలగింపు
- కోర్టు స్టే ఆర్డర్‌తో మళ్లీ విధుల్లోకి..
డ్రగ్స్ కేసులో చేతివాటం ప్రదర్శించిన సైబర్ క్రైమ్ ఎస్సై రాజేందర్ ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ లో 1,750 గ్రాముల డ్రగ్స్‌ను ఇంట్లో దాచిపెట్టి అమ్మేందుకు ప్రయత్నించడంతో.. పక్కా సమాచారం అందుకున్న హైదరాబాద్ నార్కోటిక్ విభాగం అధికారులు రాజేందర్ ను అరెస్ట్‌చేశారు. అనంతరం నార్కోటిక్ విభాగం అధికారులు, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీఎస్ న్యాబ్) డైరెక్టర్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కు నివేదిక అందజేశారు. రాజేందర్ ను అరెస్టు చేసి రాయదుర్గం పోలీసులకు అప్పగించారు.
మహారాష్ట్రకు వెళ్లి.. స్మగ్లర్లను పట్టుకుని..
తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్న రాజేందర్ నేతృత్వంలోని బృందం ఇటీవల మహారాష్ట్రకు వెళ్లి డ్రగ్స్ స్మగ్లర్లను పట్టుకున్నారు. ఈ క్రమంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకుని హైదరాబాద్ కు తీసుకొచ్చారు. అయితే డ్రగ్స్ ను సంబంధిత విభాగానికిగానీ, కోర్టుకు గానీ అప్పగించకుండా రాజేందర్డ్రగ్స్ ను తన ఇంట్లోనే దాచి పెట్టుకున్నాడు. దీంతో ఎస్సై రాజేందర్ ఇంట్లో తనిఖీలు చేప్టట్టగా డ్రగ్స్ ప్యాకెట్లు దొరికాయి. గతంలో రాయదుర్గం ఎస్సైగా పనిచేసినప్పుడు రాజేందర్ ఏసీబీకి పట్టుబడ్డారు. అప్పట్లో ఆయనను సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఆ ఉత్తర్వులపై కోర్టు నుంచి రాజేందర్ స్టే ఆర్డర్ తెచ్చుకుని సైబరాబాద్ సీసీఎస్ లో ఎస్సైగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో తన తీరు మార్చుకోని ఎస్సై రాజేందర్ ఇంట్లో డ్రగ్స్ దాచి అడ్డంగా దొరికిపోయారు.