హైదరాబాద్, ఏప్రిల్ 17: నిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉంటాయి. అందుకు తెలంగాణలో ఉత్కంఠ భరితంగా నడుస్తున్న ‘పొంగులేటి..జూపల్లి’ పొలిటికల్ డ్రామాను ఉదాహరణగా చెప్పవచ్చు అంటున్నారు. పొంగులేటి ఏ పార్టీలో చేరతారు? జూపల్లి దారెటు? అనే చర్చ కూడా సస్పెన్స్ థ్రిల్లర్ ను మరిపిస్తోంది. అయితే ఇంతరకూ ఈ ఇద్దరు నాయకులూ కూడా తమ మనసులోని మాటను బయట పెట్టలేదు. కానీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న పొంగులేటి, జూపల్లి తాజా సమాచారం మేరకు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.ప్రధానంగా, రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితిలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదనీ, అదే జరిగితే కాంగ్రెస్, బీఆర్ఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమనీ, అది తమకు ఇష్టం లేదని ఆ ఇద్దరు నేతలు తమ ముఖ్య అనుచరుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. అలాగే మరి కొందరు ముఖ్యనాయకులు, బీఆర్ఎస్ తో ప్రీ పోల్ కాకున్నా పోస్ట్ పోల్ అలయన్స్ తప్పదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
అలాగే జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు సాగుతున్న ప్రయత్నాలలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఏదో ఒక స్థాయిలో పొత్తు తప్పదనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల నుంచే వినిపిస్తోంది. అలాగే బీఆర్ఎస్ నాయకత్వం కూడా ఒక్క పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయన వర్గానికి చెందిన కొద్ది మంది నాయకులు మినహా మిగిలిన కాంగ్రెస్ సీనియర్లతో స్నేహ సంబంధాలను కొనసాగిస్తోంది.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ అవసరమని లేదంటే కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన 20 – 30 మంది ఎమ్మెల్యేలు ముందులానే కారెక్కి చెక్కేస్తారని అన్నట్లు కూడా ప్రచారం జరిగుతోంది. ఈ నేపథ్యంలో పవర్ లోకి వచ్చినా రాకున్నా కేసీఆర్ కుటుంబ పాలనను, బీఆర్ఎస్ అరాచక పాలనను ఒక్క బీజేపీ మాత్రమే ఎదుర్కొనగలదని పొంగులేటి, జూపల్లి భావిస్తునట్లు తెలుస్తోంది. మరో వంక బీజేపీ నాయకులు ఈ మేరకు ఆ ఇద్దరు నాయకులకు హామీ ఇచ్చినట్లు చెపుతున్నారు. అంతే కాదు బీజేపీకి పూర్తి మెజారిటీ రాకున్నా, కర్ణాటక, మధ్య ప్రదేశ్, మహారాష్త్రలో అధికారం దక్కించుకున్న పద్దతిలో.
తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ను గద్దె దించి అధికారం దక్కించుకునేందుకు మోదీ షా జోడీ వెనకాడరనే నమ్మకం కుదిరిందని అందుకే పొంగులేటి, జూపల్లి బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. అదే విధంగా వారి సొంత వ్యాపార, ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా కూడా వారికీ బీజేపీనే ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాయస్ అవుతుందని అంటున్నారు.అయితే తమ క్యాడర్ ను ఒప్పించడమే కొంచే కష్టంగా ఉందని ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో వామపక్ష భావజాల ప్రభావం ఎక్కువగా ఉండడంతో బీజేపీలో చేరితే క్యాడర్ ఎదురుతిరిగే ప్రమాదం ఉందని పొంగులేటి ముందు వెనుకలాడుతున్నట్లు తెలుస్తోంది. అయితే లా అనేక వ్యూహాగానాలు వినిపిస్తున్నా, పొంగులేటి ఎటు పోతున్నారు? జూపల్లి దారెటు? అనే ప్రశ్నలకు ఎవరూ స్పష్టమైన సమాధానం ఇవ్వలేక పోతున్నారు.
అయితే పొంగులేటి ఒక విషయం వరకూ క్లారిటీ ఇచ్చారు. ఆయన పుట్టింటికి వెళ్ళడం లేదు. వై ఎస్సార్టీపీలో చేరడం లేదు. తాను వైఎస్సీర్టీపీలో చేరడం లేదని పొంగులేటి తేల్చి చెప్పారు. అంతే కాదు షర్మిల పార్టీలో మొహమాటానికి చేరి తన గొంతు తాను కోసుకోలేనని వ్యాఖ్యానించారు. పార్టీలో చేరడం లేదని షర్మిలకు కోపం ఉండొచ్చని.. కానీ తాను ఏ లక్ష్యంతో బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చానో అలాంటి లక్ష్యం ఉన్న పార్టీలో చేరతానని తెలిపారు. ఇక ఇప్పడు కాంగ్రెస్ గూటికి వెళ్తారా లేక కమలం పార్టీలో చేరి పంతాన్ని నెగ్గించుకుంటారా అనేది ప్రస్తుతానికి సస్పెన్సే.అలాగే, జూపల్లి నోటి నుంచి నిర్ణయం వచ్చే వరకు జూపల్లి దారెటు అనేది కూడా సస్పెన్సే అంటున్నారు.
(న్యూస్ పల్స్)