తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ ను విస్తరించేందుకు,జనాలలోకి పార్టీని తీసుకెళ్లేందుకు అవలంబించిన ఫార్ములానే కేసీఆర్ ఇప్పుడు మహారాష్ట్రలోనూ అమలు చేయనున్నారా? అంటే ఔననే సమాధానాలే వస్తున్నాయి. కేసీఆర్ మహారాష్ట్ర నుంచి లోక్ సభకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారంటూ ప్రగతిభవన్ వర్గాలలో ప్రచారం జరుగుతున్నది. దీని మీద పరిశీలన జరిపేందుకు అక్కడ ప్రత్యేక టీమ్ మకాం వేసిందని సమాచారం. నాందేడ్ లేదా ఔరంగాబాద్‌నుంచి బీఆర్ఎస్ అధినేత బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ క్రమంలోనే నాందేడ్, ఔరంగాబాద్‌లో పార్టీ కార్యక్రమాలను స్పీడ్చేశారని చెబుతున్నారు. దీంతో పాటు మెదక్ లోక్ సభ స్థానం నుంచి కూడా కేసీఆర్పోటీ చేసే అవకాశాలున్నాయి.
సీనియర్ అధికారుల పరిశీలన
ప్రస్తుతం నాందేడ్, ఔరంగాబాద్ పార్లమెంట్నియోజకవర్గాలలో కేసీఆర్ సర్వే బృందాలు మకాం వేశాయి. ఇప్పటికే ఓ ప్రయివేట్సంస్థతోనూ సర్వే కూడా చేయించినట్లుగా చెబుతున్నారు. ఈ కీలక పనిని రాష్ట్రానికి చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మాజీ ఐపీఎస్ ఆధ్వర్యంలో సర్వే బృందాలు వివిధ కోణాలలో వివరాలు సేకరిస్తున్నాయి. ‘ తెలంగాణలో అమలవుతున్న పథకాలు మీకు తెలుసా? రైతుబంధు, దళితబంధు గురించి తెలుసా? అంటూ స్థానికుల నుంచి ఆరా తీస్తున్నాయి. స్థానిక పరిస్థితులు, కేసీఆర్ పోటీ చేస్తే ఎలా ఉంటుంది? అక్కడ ఇప్పటి వరకు ఉన్న నేతలు, ప్రజాప్రతినిధులపై అనుకూలత, వ్యతిరేకత, ఎలాంటి హామీలు ఇవ్వాల్సి ఉంటుంది? అనే అంశాల మీదా పరిశీలన చేస్తున్నారు.
తెలంగాణలో ప్రాంతీయేతరులు పార్టీ పెట్టడంపై గతంలో సీరియస్అయిన కేసీఆర్బీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత మహారాష్ట్రపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు.ఇతర రాష్ట్రాలలో ఆ పార్టీని బలోపేతం చేసే విషయంలో అంతగా ముందుకు వెళ్లలేదు. జాతీయ పార్టీ ఏర్పాటుకు ముందు పక్క రాష్ట్రాలకు వెళ్లి నేతలను కలిసి వచ్చిన కేసీఆర్ బీఆర్ఎస్ ఆవిర్భావ ప్రకటన తర్వాత మాత్రం ఏ స్టేట్ కు వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. అయితే, పక్క రాష్ట్రాలు కేసీఆర్ ను రావద్దని అంటున్నాయని, మొదట అనుకూలంగా మాట్లాడిన నేతలు ఇప్పుడు మాత్రం సైలెంటుగా ఉంటున్నారని అంటున్నారు. అంతా కలిసి కాంగ్రెస్ కూటమిలో ‘ఇండియా’ పేరుతో ఒక్కటి కావడంతో కేసీఆర్‌ను ఏ స్టేట్లోకి అడుగుపెట్టనీయడం లేదనే ప్రచారం కూడా జరుగుతున్నది. బీఆర్ఎస్ఏర్పాటు తర్వాత ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలను ప్రగతిభవన్ కు పిలిపించి చర్చించారు. ఏపీ, ఒడిశాకు ఇన్చార్జులను నియమించారు. తర్వాత సైలెంట్ అయిపోయారు. మహారాష్ట్రలో మాత్రమే ప్రత్యేక దృష్టి పెట్టి పార్టీని విస్తరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాందేడ్ ప్రాంతం నుంచి నేతలను పార్టీకి చేర్చుకున్నారు. ఇప్పుడు ఔరంగాబాద్ పై ఫోకస్ పెంచుతున్నారు. దీంతో నాందేడ్ లేదా ఔరంగాబాద్ నుంచి పోటీకి కేసీఆర్ సిద్ధమవుతున్నారరనే చర్చ జరుగుతోంది.
అన్ని వివరాల సేకరణ
గతంలో నిఘా సంస్థలతో రాష్ట్రంలో సర్వేలు చేసిన మాజీ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో మహారాష్ట్రలో సర్వే జరుగుతున్నది. నాందేడ్, ఔరంగాబాద్ ప్రాంతాలలో అధికారిక వివరాలను మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సేకరిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే వారానికి రెండుసార్లు నాందేడ్ లో పర్యటిస్తున్న సదరు సీనియర్ ఐఏఎస్ అధికారి ఇటీవల వీఆర్ఎస్ తీసుకుని సీఎం కేసీఆర్ దగ్గర కీలక పోస్టులో చేరిపోయారు. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి అధికారిక సమాచారం సేకరించడం, నాందేడ్, ఔరంగాబాద్ ప్రాంతాలలో గ్రామాలవారీగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే విషయాలను అధికారిక యంత్రాంగం నుంచి సేకరిస్తున్నట్లు తెలుస్తున్నది. పనిలో పనిగా ఇతర పక్క రాష్ట్రాల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. రైతుబీమా, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి అంశాలపై క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై కూడా ఆరా తీస్తున్నారు. ఈ పథకాలపై అక్కడి ప్రజల నుంచి వచ్చే స్పందనను ఆయా రాష్ట్రాలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారానికి వాడుకోనున్నారు.
పార్టీ వేవ్కోసమే
నిజానికి, జాతీయ పార్టీల నుంచి ముఖ్య నేతలు వారి సొంత రాష్ట్రాలలో కాకుండా ఇతర రాష్ట్రాలలో పోటీ చేసి, పార్టీకి వేవ్ తీసుకురావడంలో కొంత మేరకు సక్సెస్ అయ్యారు. 2019 ఎన్నికలలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచారు. గతంలో ఇందిరాగాంధీ తన సొంత నియోజకవర్గమైన రాయ్‌బరేలీని వదులుకుని మెదక్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూడా మహారాష్ట్ర నుంచి ఎంపీగా గెలిచారు. రెండుసార్లు హన్మకొండ నుంచి లోక్‌సభకు ఎన్నికైన తర్వాత మూడోసారి మహారాష్ట్ర లోని రాంటెక్ నుంచి ఎన్నికయ్యారు. ఇక్కడి నుంచి రెండుసార్లు పీవీ గెలిచారు. ఆ తర్వాత నంద్యాల నుంచి గెలిచారు. ఇటీవల పీవీ నర్సింహారావు చిట్రపటాలను కూడా మహారాష్ట్రలో బీఆర్ఎస్ తరుపున ప్రచారానికి వాడుకుంటున్నారు. ఇలా చాలామంది నేతలు తమ సొంత రాష్ట్రం నుంచి కాకుండా వేరే రాష్ట్రాల నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. తమ పార్టీని వేరే రాష్ట్రాలలో కూడా బలోపేతం చేయడం, శ్రేణులలో ఉత్సాహం నింపేందుకు ఇలా నేతలు వేరే రాష్ట్రాల నుంచి పోటీ చేశారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
సిసెరో ఏం చెప్పింది?
ప్రముఖ సర్వే సంస్థ సిసెరో నెలన్నర కిందట కీలక నివేదికను సీఎం కేసీఆర్‌కు అందించినట్లు సమాచారం. సిసెరో నివేదిక తర్వాత ఇప్పుడు రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ ఆధ్వర్యంలోనే మరో సర్వే చేయిస్తున్నారు. మహారాష్ట్రతో పాటుగా కర్ణాటక, ఏపీ, తమిళనాడు రాష్ట్రాలలో బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలో దింపితే ఓటర్ల నాడి ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ ‘సిసెరో’ అనే ఢిల్లీకి చెందిన ఎన్నికల సంస్థతో ఓ సర్వే చేయించారని సమాచారం. సిసెరో సంస్థ గతంలో ఆర్జేడీ, ఎస్పీ, డీఎంకే వంటి పార్టీలతోపాటూ జాతీయ స్థాయిలో ప్రముఖ న్యూస్ ఛానెళ్లకు కూడా సర్వేలు చేసి పెట్టింది. ఇటీవల మహారాష్ట్రలో సర్వే చేసిన సిసెరో సంస్థ బీఆర్ఎస్ నేతలను బరిలో దింపేందుకు అనుకూల నియోజకవర్గాల వివరాలు అందించినట్లు తెలిసింది. కేవలం మహారాష్ట్ర మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటకలో ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి సర్వే చేయించినట్లు తెలిసింది. ప్రధానంగా మహారాష్ట్రలో బీఆర్ఎస్ వేవ్ ఉందని, ఎన్నికల నాటికి ఈ వేవ్ పెరుగుతుందని, ఆ స్టేట్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తే పార్టీకి కొంత ప్రయోజనం ఉంటుందని నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మహారాష్ట్రలో మకాం వేసిన సర్వే బృందాలు అక్కడ బీఆర్ఎస్కు వేవ్పెరుగుతుందని రోజువారీ నివేదికలను కేసీఆర్‌కు అందిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇక్కడ పాత వ్యూహమే
పార్టీని ప్రజలలోకి తీసుకెళ్లే వ్యూహంలో భాగంగానే కేసీఆర్ మహారాష్ట్ర నుంచి పోటీ చేస్తారని ప్రగతిభవన్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ స్థానాల నుంచి ఎంపీగా పోటీ చేసి లోక్ సభకు వెళ్లారు. పార్టీని ప్రజలలోకి తీసుకెళ్లడంతోపాటు ఉద్యమాన్ని సైతం ప్రజలలోకి తీసుకెళ్లగలిగారు. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి కేసీఆర్ పోటీ చేయడం వల్ల అక్కడ పార్టీకి మైలేజ్ పెరగడంతో పాటు బీఆర్ఎస్ గురించి ప్రజల్లో చర్చ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అక్కడి నుంచి పోటీ చేయడంపై ఇప్పటికే జాతీయ స్థాయిలో పేరున్న పలు సంస్థలతో క్షేత్రస్థాయిలో సర్వే చేయించుకున్నారట. మహారాష్ట్ర నుంచి ఎంపీగా గెలిచి, రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ క్రియాశీలకం అవుతారని కొన్ని సర్వే సంస్థలు ఇప్పటికే వెల్లడించాయి.
స్టేట్ నేతలు అక్కడ కూడా
మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో రాష్ట్ర నేతలను సైతం పోటీకి దింపే అవకాశాలున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రకు పార్టీ అధ్యక్షుడు, కన్వీనర్లు, కో ఆర్డినేటర్లను ప్రకటించిన కేసీఆర్ తానే చీఫ్‌గా ఉన్నారు. కేసీఆర్ కుటుంబం నుంచి కల్వకుంట్ల వంశీధర్‌రావుకు మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ నాందేడ్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అక్కడి రాజకీయాలలో ఆయన తన సామాజికవర్గం నేతలతో పదేపదే సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ నెల ఆరున రవీందర్ సింగ్ బర్త్‌డే వేడుకలను కూడా నాందేడ్‌లో ఘనంగా నిర్వహించుకున్నారు. మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతాల నుంచి నేతలను అటువైపు తిప్పుతున్నారు.