- తమ కుమార్తెకు ఎస్ఐ ఉద్యోగం
- రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
- నిరుపేదల కోసం పనిచేస్తా: ఎస్సై ఉద్యోగానికి ఎంపికైన శృతి
కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడిని నిజం చేస్తూ తుంగతుర్తి మండల కేంద్రంలో కడుపేద దర్జీ కుటుంబానికి చెందిన అమ్మాయి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోలీసు ఉద్యోగాల భర్తీలో భాగంగా సివిల్ ఎస్సైగా ఎంపికయింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిరుపేద కుటుంబీకులైన గట్టు దేవేందర్ ,హేమలతలు తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి పక్కన చిన్న డబ్బా కొట్టులో బట్టలు కుట్టుకుంటూ జీవన సాగిస్తున్నారు. వారికి ఇద్దరమ్మాయిలు.
తుంగతుర్తి లోని ప్రభుత్వ పాఠశాలలోనే వారికి విద్యాభ్యాసం నేర్పించారు .పెద్ద కుమార్తె గట్టు శృతి పదవ తరగతి అనంతరం హనుమకొండలోని ఎస్ వి త్రిశూల్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని ఇంజనీరింగ్ ప్రభుత్వ సీటు సంపాదించి పూర్తి చేసింది .అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని పట్టుదలతో ముందుకు సాగింది .ఖరీదైన కోచింగ్ తీసుకోవడానికి తమ తల్లిదండ్రుల వద్ద డబ్బులు లేవని తెలుసుకున్న శృతి పుస్తకాలను కొనుక్కొని ఇంటి వద్దనే పట్టుదలతో చదివింది.
ముందుగా నిర్వహించిన పరీక్షలు క్వాలిఫై పొంది ఈవెంట్స్ లో సెలెక్ట్ అయింది .అనంతరం నిర్వహించిన మెయిన్స్ పరీక్షలో మంచి మార్కులు పొంది ఎస్సై పోస్ట్ కు అర్హత సాధించింది .ఆదివారం ప్రకటించిన జాబితాలో ఎస్సై ఉద్యోగం వచ్చిందని తెలుసుకున్న శృతి ఆమె తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేవు .నిరుపేద కుటుంబీకులమైన తమ కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఉన్నాయని తమ కుమార్తెకు ఎస్సై ఉద్యోగం వచ్చిందని తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఈ సందర్భంగా శృతి మాట్లాడుతూ నిరుపేద కుటుంబీకులైన తమ తల్లిదండ్రులు ఎంతో శ్రమపడి తనను చదివించారని వారికి ఇక ముందు కష్టం కలగకుండా ఉద్యోగం సంపాదించాలని పట్టుదలతో కృషి చేశానని తన కృషికి ఫలితం లభించిందని అన్నారు. తనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పేద ప్రజలకు సేవ చేయడానికి కృషి చేస్తానని అన్నారు. శృతికి ఎస్సై ఉద్యోగం రావడం పట్ల ఆమె బంధువులు తుంగతుర్తి పట్టణవాసులు ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.