ముంబై, ఫిబ్రవరి 21:ఎన్నికల సంఘం నిర్ణయంపై స్టే విధించాలని ఉద్ధవ్ ఠాక్రే తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోరగా సుప్రీంకోర్టు అందుకు తిరస్కరించింది. శివసేన విషయంలో ఎన్నికల సంఘం తప్పుడు నిర్ణయం తీసుకుందని, ఈసీ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ స్పందిస్తూ.. ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేస్తుందని చెప్పారు. ప్రతిరోజూ చేసే రోజువారీ పనులపై ప్రభావం చూపకూడదని తాము కోరుకుంటున్నామని, కాబట్టి మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విచారణ జరుపుతామని ఆయన చెప్పారు.ఉద్ధవ్ వర్సెస్ షిండే వివాదానికి సంబంధించిన ఇతర అంశాలను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇప్పటికే లోతుగా విచారణ చేస్తోందని, అందువల్ల మధ్యలో అడ్డుకోవడం సరికాదని అన్నారు.
ఈ కొత్త పిటిషన్ కూడా పూర్తి స్థాయిలో స్టడీ చేయాల్సి ఉందని అన్నారు. అందుకే రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు విచారణ జరుపుతామని చెప్పారు.షిండే వర్గానికి చెందిన 5 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, ప్రభుత్వ ఏర్పాటుకు షిండేను ఆహ్వానించడం, కొత్త స్పీకర్ ఎన్నిక వంటి పలు అంశాలపై ఉద్ధవ్ వర్గం లేవనెత్తిన ప్రశ్నలపై దాఖలైన పిటిషన్ పై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది.
అసలైన శివసేనగా భావించి ఏక్ నాథ్ షిండే వర్గానికే పార్టీ పేరు, గుర్తు ఇవ్వాలని ఎన్నికల సంఘం శుక్రవారం (ఫిబ్రవరి 17) ఆదేశించింది. దీంతో ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 78 పేజీల తీర్పులో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి కేటాయించిన పేరును, మండుతున్న కాగడా గుర్తును మహారాష్ట్రలో రాబోయే అసెంబ్లీ ఉప ఎన్నికల వరకు కొనసాగించడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. ఎన్నికల కమిషన్, షిండే వర్గం మధ్య రూ.2000 వేల కోట్ల డీల్ కుదిరిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. రౌత్ ఆరోపణలు నిరాధారమైనవని ఆరోపిస్తూ బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.