చిరుత పులి గోర్లు దంతాలను విక్రయిస్తున్న ముఠా సభ్యుల అరెస్ట్
Gang members arrested for selling cheetah claws and teeth
- మూడు నెలల క్రితం చనిపోయిన చిరుత నుండి గోర్లు, దంతాలను విక్రయిస్తూ పట్టుబడ్డ నలుగురు సభ్యుల ముఠా
- నలుగురు సభ్యుల్లో మద్దిమడుగు డిప్యూటీ సర్పంచ్
- మీడియా సమావేశంలో డిఎఫ్ఓ రోహిత్ గోపిడి వెళ్ళడి
అమ్రాబాద్ నల్లమల్ల అటవీ ప్రాంతం మద్దిమడుగు లోతట్టు ప్రాంతంలో గత మూడు నెలల క్రితం చిరుత పులి చనిపోగా దాని గోర్లు, దంతాలను తొలగించి వాటిని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు జిల్లా అటవీశాఖ అధికారి రోహిత్ గోపిడి తెలిపారు. ఆదివారం అమ్రాబాద్ మండలం మన్ననూరు అటవీశాఖ ఈసీ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మద్దిమడుగు రేంజ్ పరిధిలో ఈనెల 4న అటవీ శాఖ అధికారుల తనిఖీలో కుమ్మ రోనిపల్లి గ్రామ సమీపంలో గల రైతు వేదిక వద్ద చిరుత పులి గోరు, రెండు దంతాలను విక్రయించేందుకు యత్నిస్తున్న మద్దిమడుగు డిప్యూటీ సర్పంచ్ చిన్నబోయిన ఆంజనేయులు, ఇప్పలపల్లి గ్రామానికి చెందిన నరేష్, మద్దిమడుగు కు చెందిన గుర్రం ఆంజనేయులు అరెస్టు చేసి వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని ఆయన తెలిపారు. మడ్లి ఈదయ్య అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని అతన్ని త్వరలో అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తామని ఆయన తెలిపారు. నల్లమల్ల అడవుల్లో నిరంతరం నిఘా పెట్టి ఉండే అటవీ శాఖ సిబ్బంది చిరుత పులి చనిపోయి మూడు నెలలు గడుస్తున్నా విషయాన్ని గుర్తించకపోవడం ఏమిటని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. మీడియా సమావేశంలో మద్దిమడుగు రేంజ్ అధికారులు అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.