హైదరాబాద్, ఫిబ్రవరి 6,
ఏ పార్టీ వ్యవహారాలకైనా పార్లమెంటు సమావేశాలు చాలా కీలకం. అధికార పార్టీపై విపక్షాలు ఎటువంటి విధానాన్ని అనుసరిస్తున్నాయి? ఏ అంశాల్లో అధికారపార్టీని ఇరుకున పెడుతున్నాయో తెలిసిపోతుంది. కొన్ని అంశాలపై అజెండాలకు అతీతంగా ప్రతిపక్ష పార్టీలు కలిసి నడుస్తాయి. దేశంలో గుణాత్మక మార్పులు రావాలి.. అది భారత రాష్ట్ర సమితితోనే సాధ్యమని చెబుతున్నారు గులాబీ నేతలు. అందుకే బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా కలిసొచ్చే పార్టీలను కలుపుకొని వెళ్లేందుకు చూస్తున్నారు కూడా. ఈ వ్యూహంలో భాగంగా పార్లమెంట్‌లో బీఆర్ఎస్ ఎంపీలు వేస్తున్న అడుగులు రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి.
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఏ రోజు కా రోజు కొత్త స్ట్రాటజీ అమలు చేస్తోంది బీఆర్‌ఎస్. తొలిరోజు ఆమ్ ఆద్మీపార్టీ ఎంపీలతో కలిసి రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు గులాబీ ఎంపీలు. ఇటు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్నారు AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే. కేంద్రాన్ని నిలదీసేందుకు కలిసొచ్చే పార్టీలతో ఖర్గే సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ఆ విధంగా కాంగ్రెస్ నిర్వహించిన తొలి భేటీకి ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్లింది. కాంగ్రెస్ నిర్వహించిన మరో సమావేశంలో బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కనిపించారు. దీంతో రాజకీయ వర్గాల్లో అటెన్షన్ వచ్చింది. ఎందుకంటే.. గత పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంది గులాబీ పార్టీ. ప్రత్యామ్నాయ అజెండాను బలంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్న బీఆర్ఎస్..
కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా ఉండాలని చూస్తోంది. పార్లమెంట్ సమావేశాల బ్యాక్‌డ్రాప్‌లో కాంగ్రెస్ నిర్వహించిన సమావేశానికి గులాబీ ఎంపీలు వెళ్లడంతో చర్చగా మారింది. ఖమ్మం సభకు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ రావడంతో.. పార్లమెంట్‌లో ఆప్‌తో కలిసి బీఆర్‌ఎస్ ఎంపీలు కలిసి సాగినా పెద్దగా చర్చ లేదు. కానీ.. కాంగ్రెస్ మీటింగ్‌కు వెళ్లడంతో గులాబీ పార్టీ ఉభయ సభల్లో ఏ రోజు కా రోజు స్ట్రాటజీ అమలు చేస్తోందా అనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే మరికొందరు మాత్రం.. ఈ కలయిక.. పార్లమెంట్ సమావేశాల వరకే పనిచేస్తుందా లేక బయట కూడా కలిసి అడుగులు వేస్తారా అని ఆరా తీస్తున్నాయట.