- పది కిలోల బియ్యం ధర 20 పౌండ్లు
- స్టోర్లలో నోస్టాక్ బోర్డులు
- నాలుగింట ఒకవంతు భారత్ బియ్యాన్ని వినియోగిస్తున్న అమెరికన్లు
- ఈనెల 20 నుండి బియ్యం ఎగుమతిని నిలిపివేసిన భారత్
బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం అమెరికా, బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ నేపాల్ వంటి అనేక దేశాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. గురువారం నుంచి అమలైన ఈ నిర్ణయం కొద్ది గంటల్లోనే అమెరికాలోని అనేక నగరాలలో తీవ్ర ప్రభావం చూపింది. మరీ ముఖ్యంగా అమెరికాలో ప్రవాస భారతీయులు (ఎన్ ఆర్ ఐ)లు అధికంగా నివసించే ప్రాంతాలలో ప్రజలు శుక్రవారం నుంచే ఎగబడి అధిక పరిమాణంలో బియ్యం కొనుగోలు చేయడంతో కృత్రిమ కొరత ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకొని స్టోర్స్ యజమానులు బియ్యం ధరను విపరీతంగా పెంచేశారు. అనేక స్టోర్స్ లో బియ్యం స్టాక్స్ ఇలా వస్తే అలా ఖాళీ అయిపోతున్నాయి. డల్లాస్ లో సోనా మసూరి బియ్యానికి డిమాండ్ పెరిగింది. పది కిలోల బియ్యానికి ఇరవై పౌండ్లు ధరను అక్కడి వినియోగదారులు చెల్లిస్తున్నారు. బియ్యం కొరతతో ఒక కుటుంబానికి ఒక రైస్ బ్యాగ్ సోనా మసూరి బియ్యాన్ని మాత్రమే అమ్ముతున్నారు. ఈనెల 20 నుంచి ధరల పెరుగుదల కారణంగా బియ్యం ఎగుమతిని కేంద్ర ప్రభుత్వం నిషేదించింది.
బాస్మతి బియ్యం తప్ప మిగతా అన్ని రకాల బియ్యం ఎగుమతులను నిలిపివేసింది. దేశీయ మార్కెట్ లో వైట్ రైస్ తగినంత లభ్యత, ధరల స్థిరీకరణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అమెరికన్ అగ్రికల్చర్ డిపార్టుమెంట్ లెక్కల ప్రకారం ఆ దేశంలో వినియోగించే బియ్యంలో నాలుగింట ఒకవంతు కంటే ఎక్కువ భారత్ దేశం నుంచే దిగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా భారత్ నుంచి అమెరికాకు బాస్మతి రైస్ ఎక్కువగా దిగుమతి అవుతుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే బియ్యం ఎగుమతుల్లో భారత్ అగ్రగామిగా ఉంది. అలాగే బియ్యం ఉత్పత్తిలో చైనా తర్వాత రెండో పెద్ద ఉత్పత్తిదారుగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా మూడు బిలియన్ల మంది ప్రజలు వరిని ప్రధాన ఆహారంగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బియ్యం ఎగుమతుల్లో 40 శాతానికి పైగా భారత్ వాటా కలిగివుంది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా బియ్యం వినియోగిస్తున్న ఆఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో పెద్ద ఎత్తున ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంది.