రేవంత్ రెడ్డి సక్సెస్.. బీఆర్ఎస్కు బిగ్ షాక్. కేసీఆర్ అత్యంత సన్నిహితుడు కూచాడి శ్రీహరిరావు రాజీనామా..
తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయ్. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నేతల జంపింగ్‌లు ఎక్కువయ్యాయి. ఏ పార్టీలో అయితే తమకు ప్రాధాన్యత ఉంటుందో.. ఎక్కడైతే టికెట్ దక్కే ఛాన్స్ ఉంటుందో అని లెక్కలేసుకుని కండువాలు మార్చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలోకి వెళ్తున్నారంటే ఓ లెక్కంటుంది.. కానీ అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్తుండటంతో బీఆర్ఎస్లో అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొందని అధిష్టానం తలలు పట్టుకుంటోందట. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు బీఆర్ఎస్కు బైబై చెప్పేసి కాంగ్రెస్ బీజేపీలో చేరిపోగా.. ఆ జాబితాలోకి మరికొందరు నేతలు చేరిపోతున్నట్లుగా తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే తెలుస్తోంది.
ఆయన.. కీలక నేత, ఉద్యమకారుడు కావడంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన ఆ కీలక నేత మరెవరో కాదు తెలంగాణ ఉద్యమకారుడు కూచాడి శ్రీహరిరావు. ఈయన సీఎం కేసీఆర్ అత్యంత సన్నిహితుడిగా.. మంత్రి కేటీఆర్‌తోనూ దగ్గరి సంబంధాలు కలిగిన నేత. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి రాజకీయ శిష్యుడిగా శ్రీహరికి పేరుంది. ఉద్యమకాలంలో ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పశ్చిమ ప్రాంతానికి సారథ్యం వహించిన ఈయన.. 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీచేసి గట్టిపోటీ ఇచ్చారు. అయితే.. 2018 ఎన్నికల టైమ్‌లో అధిష్టానం, కేటీఆర్ సూచనతో పోటీచేయకుండా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మద్దతుగా నిలిచి గెలిపించారు.
ఇన్నిరోజులుగా అంతా బాగానే ఉన్నా ఈ మధ్యే ఇంద్రకరణ్ రెడ్డితో శ్రీహరిరావుకు అస్సలు పడట్లేదు. కొన్ని అంతర్గత కారణాల దృష్ట్యా అటు మంత్రితో.. ఇటు పార్టీకి దూరమవుతూ వచ్చారు. ఇన్నాళ్లు పార్టీలో అసంతృప్తిగానే పార్టీలో ఉన్న శ్రీహరి.. ఎన్నికలు సమీపిస్తుండటంతో అనుచరులు, కార్యకర్తల ఒత్తిడి మేరకు బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో అనుచరులు, ముఖ్య నేతలతో కూచాడి కీలక సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్లో పరిస్థితి ఇలా ఉంది..? అధిష్టానం పట్టించుకోవట్లేదు.. ఏ పార్టీలోకి వెళితే మంచిది..? అని అనుచరులతో శ్రీహరి చర్చించారు. కాంగ్రెస్‌లో చేరితే బాగుంటుందని అనుచరులు ఆయనకు చెప్పినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.
వేడెక్కిన వేములవాడ బీఆర్ఎస్ రాజకీయాలు.
సమావేశం అనంతరం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఉద్యమంలో ముందుండి పోరాడినప్పటికీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సరైన గుర్తింపు రాలేదని శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. రెండుసార్లు గెలిచిన బీఆర్ఎస్ ప్రజలను వంచించిందని.. ఇలాంటి మోసాలు చూడటం ఇష్టం లేక రాజీనామా చేస్తున్నాని ప్రకటించారు. అంతేకాదు.. ఆఖరిలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని శ్రీహరి ఆకాంక్షించారు. అంటే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు చెప్పకనే చెప్పేశారన్న మాట.
రేవంత్ ఆహ్వానంతోనే..?
కాంగ్రెస్‌లో చేరాలని శ్రీహరికి.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గత నెలలోనే ఆహ్వానం పంపారు. ఇందుకు ఆయన సుముఖుత వ్యక్తం చేసినప్పటికీ ముహూర్తం ఖరారు చేసుకోలేదు. వాస్తవానికి కర్ణాటక ఎన్నికల తర్వాత అధికారపార్టీలో ఎవరైతే అసంతృప్తులు ఉంటారో వారందర్నీ సంప్రదించి.. ఆహ్వానించే పనిలో రేవంత్ రెడ్డి బిజిబిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే శ్రీహరికి ఆహ్వానం పంపడం.. ఇవాళ ఆయన రాజీనామా చేయడం జరిగింది. అంటే.. రేవంత్ రెడ్డి మంత్రాంగం ఫలించిందన్న మాట. శ్రీహరి కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరతారో.. చేరాక ఈయనకు పార్టీలో ఏ మాత్రం ప్రాధాన్యత ఉంటుందో తెలియాలి మరి.