ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితిని గుర్తించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ సారి త్రిముఖ పోటీలో జనసేనను బలి ఇవ్వకూడదని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ‘‘శత్రువుకు అవకాశాలివ్వకుండా శత్రువును వ్యతిరేకించే వారితో జతకట్టి ప్రత్యర్థులను మట్టికరిపించడమే వివేకవంతుల విధానం. అందుకు సగౌరవంగా..వచ్చే ఎన్నికల్లో పొత్తులతో పోటీ చేస్తాం..’’ అని మంగళగిరిలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ మండల, డివిజన్ అధ్యక్షుల సమావేశంలో ఆయన మరోసారి ఆంధ్ర ప్రజలకు స్పష్టమైన సంకేతాలు పంపించారు.
గతేడాది పార్టీ ఆవిర్భావ సభ నుంచి పవన్ వ్యూహాత్మకంగా, స్థిరత్వంతో కూడిన ఆలోచన శైలితో ముందుకు సాగుతున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో అర్థం చేసుకొని క్షేత్ర స్థాయి పరిస్థితులకు దగ్గరగా ఆయన వ్యవహరిస్తున్నారు. రాబోయే ఎన్నికలకు మానసికంగా జనసేన పార్టీ నాయకులను, క్యాడర్‌ని సిద్ధం చేస్తున్నారు.కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేయమని బీజేపీ కోరినా, అక్కడి పరిస్థితులను అంచనా వేసి ఆ మైలను తనకు అంటుకోకుండా పవన్ జాగ్రత్త పడ్డారు.
జేడీ లక్ష్మినారాయణ రాజకీయ పయనం ఎటు వైపు.
సరిగ్గా కర్ణాటక ఫలితాల ముందురోజే వ్యూహాత్మకంగా పార్టీ మండల, డివిజన్ అధ్యక్షుల సమావేశం నిర్వహించి పార్టీ క్షేత్రస్థాయి నాయకులకు ‘‘దిశా-దశా’’ నిర్థేశించారు. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి నుండి నివేదికలు తెప్పించుకుని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలం, బలహీనతలపై ఒక అంచనాకు వస్తూ దానికనుగుణంగా అడుగులు ముందుకు వేస్తున్నారు.కర్ణాటకలో జేడీ(ఎస్), హైదరాబాద్‌లో ఎంఐఎం ఫోకస్ చేస్తున్నట్టుగా జనసేన కూడా ముందుగా తనకు పట్టున్న ప్రాంతలపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించింది.
‘‘గత ఎన్నికల్లో జనసేనకు 7 శాతం వరకు ఓట్లు పడ్డాయని గణాంకాలు చెప్తున్నాయి. ఇప్పుడు జనసేన బలం గణనీయంగా పెరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో, ఉభయ గోదావరిలో, ఉత్తరాంధ్రలో జనసేన ఓట్ల శాతం సుమారు 30 నుంచి 35 శాతం వరకు ఉంటుందని భావిస్తున్నాం. మిగతా ప్రాంతాల్లో కాస్త అటు ఇటుగా 18 శాతంగా ఉంటుంది. ఇదే బలంతో మనం అధికారంలోకి రాగలమా? లేక మరోసారి ఇలాగే మిగిలిపోదామా? అని ఆలోచించుకోవాలి’’ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయి పరిస్థితులను పార్టీ నాయకులకు, క్యాడర్‌కి స్పష్టంగా వివరించారు.
తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం.
దీన్ని బట్టి చూస్తే, జనసేనాని వచ్చే ఎన్నికల్లో స్ట్రయిక్ రేట్ పెంచుకోవాలని చూస్తున్నారని అర్థమౌతోంది. ఎన్ని సీట్లలో పోటీ చేశామన్నది కాకుండా, పోటీచేసిన సీట్లల్లో ఎన్ని సీట్లు గెలుస్తామన్న దానిపై ఆయన ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇది జనసేనానిలో వచ్చిన రాజకీయ పరిణితికి నిదర్శనం. ఎక్కువ సీట్లు పోటీచేసి ఓడిపోయేదానికన్నా పోటీచేసిన ప్రతీ సీట్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పట్టుదలతో ఆయనున్నారు.
అందులో భాగంగానే ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై స్వతంత్ర సంస్థలతో సర్వేలు నిర్వహిస్తూ ఆయా నియోజకవర్గాలపై దృష్టిపెట్టినట్లు స్పష్టమౌతోంది. అందులో భాగంగానే మండల, డివిజన్ స్థాయి అధ్యక్షుల సమావేశంలో 40 అసెంబ్లీ స్థానాల్లో తమకు బలమున్నట్లు ఆయన స్పష్టం చేశారు.జనసేనపార్టీ మండల, డివిజన్ స్థాయి అధ్యక్ష సమావేశంలో జనసేన అధినేత ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశంకు, బిజెపికి 2019 ఎన్నికలతో పోలిస్తే క్షేత్రస్థాయిలో జనసేనపార్టీ బలపడిందని, ఓట్లశాతం కూడా పెరిగిందని గట్టి సందేశాన్నే వారికి పంపారు.
ఏపీ బీజేపీ స్వరం మార్చుకుంటోందా ?
రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, అరాచక వైఎస్‌ఆర్‌సిపి పాలన నుండి రాష్ట్రానికి విముక్తి కలిగించాలనే ఏకైక లక్ష్యంతో పొత్తులకు మొగ్గు చూపుతున్నాం తప్ప అది తమ బలహీనత కాదని, తాను బలహీనుడిని కాదనీ, గత్యంతరం లేక పొత్తు పెట్టుకోవడం లేదనే సందేశాన్ని కూడా ఈ సమావేశం ద్వారా బీజేపీ, టీడీపీలకు పంపించారు. తాము లేకుంటే ఆ పార్టీలకు గత్యంతరం లేదని, ఆత్మగౌరవం విషయంలో తాను రాజీపడబోనని కూడా పరోక్షంగా వారిని హెచ్చరించారు.