హైదరాబాద్, ఫిబ్రవరి 2,
హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలికసదుపాయాలు, సౌకర్యాలు కల్పనకు ప్రత్యేక దృష్టిపెట్టింది జిహెచ్ఎంసి. హైదరాబాద్ నగరం విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో చేరుకోవాల్సిన గమ్యస్థానానికి సకాలంలో చేరే విధంగా రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకు ఎస్.ఆర్.డి.పి ద్వారా 42 పనులు చేపట్టగా ఇప్పటి వరకు 31 పనులుపూర్తయ్యాయి. అందులో 18 ఫ్లై ఓవర్లు, 5అండర్ పాస్ లు, 7 ఆర్ ఓ బి/ ఆర్ యు బి లు అందుబాటులోకి తీసుకురాగలిగింది. మిగతా 11 పనులన్నింటినీ వచ్చే సంవత్సరం జనవరి 2024 పూర్తి చేయాలనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. మెరుగైనరవాణా ఏర్పాటు, నిర్వహణ కోసం సి.ఆర్.ఎం.పి ద్వారా 811.96 కిలోమీటర్ల రోడ్లను రీ కార్పెట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ముంపు ప్రాంతాల్లో నివసించే నగరవాసులకు వరద ముంపు పరిష్కారానికి జిహెచ్ఎంసి పరిధిలోరూ. 733 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 35 పనులను చేపట్టగా అందులో ఇప్పటి వరకు 8 పనులు పూర్తికాగా, మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది.
ముఖ్యంగా అంతర్గత రోడ్లు, స్టార్మ్ వాటర్ డ్రైన్ లు, నాలా పూడికతీత,కమ్యూనిటీహాల్స్ కాంపౌండ్ వాల్స్ నిర్మాణాలు, అన్ని మతాల స్మశానవాటికల అభివృద్ధికి ఈ సంవత్సరంలో రూ. 2250.27 కోట్ల అంచనా వ్యయంతో 10,021 పనులు చేపట్టింది. వీటిలో ఇప్పటి వరకు 4225 పనులు పూర్తికాగానే మిగతా పనులు నిర్మాణ దశలో ఉన్నాయి.నగర వాసులకు ప్రపంచ స్థాయిలో వసతులు కల్పించేందుకు వినూత్నంగా 29 మోడల్ కారిడార్ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఈ కారిడార్ రోడ్లలో పార్కింగ్, సైక్లింగ్, వెండింగ్ జోన్స్, గ్రీనరి సౌకర్యాలు కల్పించనున్నారు. నగరంలో పాదచారుల అనుకూలమైన అభివృద్ధి చేయనున్నారు. గతంలో 20 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు ఉండగా, సుమారు 76 కోట్ల వ్యయంతో కొత్తగా 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జి లు చేపట్టారు. వీటిలో 8 అందుబాటులోకి రాగా, మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయి. నగరంలో పాదచారుల కోసం ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా 94 పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేయగా మరో వందకు పైగా ప్రతిపాదన దశలో ఉన్నాయి.
హైదరాబాద్ నగర ప్రజల మౌళిక వసతులతోపాటు జంతు సంరక్షణలో భాగంగా పెంపుడు జంతువుల కోసం మరో 5 క్రిమిటోరియంల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఫతుల్లాగూడలో ఇప్పటికే ఏర్పాటు చేయగా మిగతా జోన్లలో కూడా పెంపుడు జంతువుల క్రిమిటోరియంల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ నలువైపులా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను 100 మెగావాట్ల కెపాసిటీ రాబోయే రోజుల్లో ఏర్పాటుకు సర్వం సిద్దమైంది. ఇప్పటికే జవహర్ నగర్ డంప్ యార్డ్ లో 24 మెగావాట్ల విద్యుత్తయారు చేస్తుండగా, మరో 24 మెగావాట్లు మంజూరు కావడంతో వాటి పనులు కొనసాగుతున్నాయి. దుండిగల్ లో 14.5, ప్యారా నగర్ లో 15, బిబినగర్ లో 11, యాచారంలో 14 మెగావాట్ల కెపాసిటీ గల వేస్ట్ టూ ఎనర్జీప్లాంట్లను రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయడం ద్వారా నగరంలో రోజువారీగా సేకరిస్తున్న చెత్తను నిల్వ ఉంచకుండా అదేరోజు వినియోగించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నగర ప్రజలకు ఆహ్లాదకరంగా, కాలుష్యం లేని వాతావరణంకల్పించేందుకు గ్రీనరినీ పెంపొందించే పనలపై ప్రత్యేక దృష్టిపెట్టింది జిహెచ్‌ఎంసీ. హరితహారం కార్యక్రమంలో భాగంగా వివిధ పద్ధతుల్లో మొక్కలు పెంపకం చేపట్టింది. మల్టీ లెవెల్, లేక్ ప్లాంటేషన్, అవెన్యూ, థీమ్ పార్క్, సెంట్రల్మీడియన్, వర్టికల్ ప్లాంటేషన్, నర్సరీల నిర్వహణ, ట్రీ-పార్కులు, యాదాద్రి ప్లాంటేషన్ ద్వారా పెద్దఎత్తున గ్రీనరి చేపట్టడం మూలంగా నగరంలో అటవీ విస్తీర్ణం పెరిగినట్లు ఫారెస్ట్ సర్వే ఆఫ్ఇండియా ఇప్పటికే గుర్తించింది, అంతే కాకుండా ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ కు వరల్డ్ గ్రీనరి అవార్డు సొంతం చేసుకుంది. ఇలా పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా వసతులపై ప్రత్యేక దృష్టిపెట్టిన జిహెచ్ఎంసి అక్కడక్కడా విమర్శలు ఎదుర్కొంటున్నప్పటీ పనితీరులో మాత్రం నగరవాసులు మెప్పుపొందే ప్రయత్నం చేస్తోంది.