చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మరో స్వరం మూగబోయింది. ప్రముఖ గాయని వాణీ జయరాం(77) కన్నుమూశారు. ఇటీవలే కళాతపస్వి కె విశ్వనాథ్ కన్నుమూయగా, శనివారం మధ్యాహ్నం వాణి జయరాం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆమె హఠాన్మరణం చిత్ర పరిశ్రమని శోకసంద్రంలో ముంచేసింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఇలాపది భాషల్లో వేల పాటలు పాడిన వాణి జయరాం మరణంతో ఇండియన్ సినిమానే తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతుంది. వాణి జయరాంకి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇండియన్ సినిమా రంగంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితమే కళాతపస్వి కె విశ్వనాథ్ కన్నుమూశారు. అంతకు ముందు దర్శకుడు సాగర్ హఠాన్మరణం చెందారు. ఇప్పుడు ఇండియన్ సంగీతం గర్వించదగ్గ గాయని వాణి జయరాం మరణించడం అత్యంత విషాదకరం. దాదాపు పదికిపైగా ఇండియన్ లాంగ్వేజెస్‌లో 20వేలకుపైగా పాటలు ఆలపించారు వాణీ జయరాం. ఆమె మరణం సంగీత రంగానికి తీరని లోటు అని చెప్పొచ్చు.
గతేడాది కాలంగా టాలీవుడ్‌లోనూ వరుస విషాదాలు సంబవిస్తున్నాయి. రెబల్ స్టార్ కృష్ణంరాజు, ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ, తొలితరం విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ ఇలా వరుసగా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. అభిమానులను విషాదంలో ముంచెత్తారు. తొలి తరం సినిమా దిగ్గజాలు వరుసగా మరణించడంతో సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఒక విషాదం నుంచి కోలుకోకముందే మరో విషాదం చోటు చేసుకోవడం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.