అభ్యర్థుల జాబితా విడుదల తర్వాత బిఆర్‌ఎస్‌లో పరిణామాలు
బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సోమవారం విడుదల చేసిన తమ పార్టీ అభ్యర్ధుల జాబితా పలువురు నాయకుల అలకలు, భావోద్వేగాలు, తిరుగుబాట్లకు దారి తీసింది. జాబితా ప్రకటించడానికి ముందే తమకు ఎట్టి పరిస్థితిలో టికెట్ రాదన్న నమ్మకంతో కొందరు విమర్శలకు పూనుకుంటే, మరి కొందరు జాబితా అలా వెలువడిందో లేదో ఇలా పార్టీ మార్చేశారు. ఒక విధంగా ఈ జాబితా ప్రభావం రాజకీయ సమీకరణల మార్పుకు దారిదీసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ సిట్టింగ్ ఎంఎల్‌ఏ రేఖా నాయక్‌కు కాదని కోవా లక్ష్మికి ఇవ్వడంతో అలిగిన రేఖా నాయక్ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇలా జాబితా విడుదల అయిందో లేదో ఆమె భర్త మాజీ రవాణా శాఖ అధికారి శ్యాం నాయక్ ఆ రాత్రే కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆయన్ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఆయనకు అసిఫాబాద్ టికట్ ఖరారైనట్లు సమాచారం. కాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌రావు థాక్రేతో రేఖా నాయక్ త్వరలో కలువనున్నట్లు తెలుస్తున్నది. ఆమెకు తిరిగి ఖానాపూర్ టికెట్ కాంగ్రెస్‌లో లభించే అవకాశాలున్నా యనుకుంటున్నారు. వేములవాడ సిట్టింగ్ ఎంఎల్‌ఏ చెన్నమనేని రమేష్‌ను కాదని ఈసారి చల్మెడ లక్ష్మీనరసింహారావుకు ఇవ్వడంతో జాబితా ప్రకటించడానికి ముందే రమేష్ తన నిరసన గళాన్ని విప్పారు. అయితే ఆయనపైన ఎలాంటి విమర్శలు లేకపోయినా పౌరసత్వం విషయంలో గత రెండు ఎన్నికల నుండి కేసు కొనసాగుతూనే ఉంది. అయినా ఈసారి ఆయనకు బదులుగా చల్మెడకు బిఆర్‌ఎస్ పార్టీ టికట్‌ను ఖరారు చేసింది.
దీంతో ఆయన తన భవిష్యత్ కార్యక్రమంపైన సన్నిహితులు, కార్యకర్తలతో విచారించేందుకు జర్మనీ నుండి ఈనెల 25న సరాసరి వేములవాడకు రానున్నట్లు తెలుస్తున్నది. కాగా ఆయన ఇప్పటికే బిజెపి ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చేర్మన్ ఈటల రాజేందర్‌తో మంతనాలు జరిపినట్లు కూడా వార్తలు వొస్తున్నాయి. వేములవాడ ఇంతకాలం చెన్నమనేని కుటుంబ ఇలాఖాగా ఉండింది. ఇప్పుడు చెయ్యి జారిపోతుండడంతో ఆయన తీవ్రంగా వ్యధ చెందుతున్నారు. గత రెండు విడుతలుగా తాను ఈ నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహించి, ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్న సమయంలో ఆయనకు ఈ అవాంతరం ఏర్పడింది.
మల్కాజిగిరి శాసనసభ్యుడు మైనంపల్లి హన్మంతరావు తనకు మల్కాజిగిరితో పాటు తన కుమారుడు డాక్టర్ రోహిత్‌కు మెదక్ టికెట్ కేటాయించే విషయంలో మంత్రి హరీష్ రావు అడ్డుపడ్డాడంటూ జాబితాకు ముందే ఆయన తిరుపతిలో హరీష్‌రావుపైన విరుచుకు పడ్డాడు. అయితే కెసిఆర్ సోమవారం విడుదల చేసిన జాబితాలో మైనంపల్లికి మల్కాజీగిరి స్థానాన్ని కేటాయించడమైంది. ఆయితే ఆయన అక్కడి నుండి పోటీ చేయాలో వొద్దో అన్నది ఆయనే నిర్ణయించుకోవాలని మీడియా ప్రశ్నకు కెసిఆర్ సమాధానమిచ్చారు. అయితే తండ్రి కోడుకులిద్దరు బిజెపి బాటపడుతారన్న వార్తలు వొస్తున్నాయి. కాగా హరీష్‌రావుపైన మైనంపల్లి చేసిన ఆరోపణపై కెటిఆర్, కవితలు కౌంటర్ ఇచ్చారు. తాము హరీష్‌రావు పక్కనే ఉంటామని, ఆయన అవసరం పార్టీకి ఎంతోఉందని వారు చెప్పుకోస్తున్న దాన్ని బట్టి ఆయనపై వేటు తప్పదనుకుంటున్నారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంఎల్‌ఏ డాక్టర్ రాజయ్యను కాదని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడంతో రాజయ్య భావోద్వేగానికి గురైనారు. తనకు తప్పకుండా టికెట్ వొస్తుందని ఆశపెట్టుకున్న ఆయనకు పార్టీ రిక్తహస్తం చూపడంతో ఆంబేద్కర్ విగ్రహం వద్ద బోరున విలపించారు. తన అనుమాయులు, కార్యకర్తల ముందు విలపిస్తూ వారికి సాష్టాంగ నమస్కారం చేశారు. అయినా తాను కెసిఆర్ గీసిన గీత దాటనని, మొదటి నుండి పార్టీకి వీర విధేయుడిగానే ఉన్నానని, ఇప్పటికీ ఆలానే ఉంటానన్నారు. కాగా కెసి•ఆర్ న్యాయం చేస్తారన్న నమ్మకం తమకున్నదని ఆయన భార్య ఫాతిమా మేరీ పేర్కొన్నారు. కాగా రాజయ్యకు ఎంఎల్సీ గాని, ఎంపి టికెట్ గాని ఇవ్వవచ్చనుకుంటున్నారు. కాగా ఆదిలాబాద్ జిల్లాలో అభ్యర్థుల మార్పు జరిగిన బోథ్, అసిఫాబాద్ నియోజకవర్గాల్లోని సిట్టింగ్ ఎంఎల్‌ఏలు కూడా పక్క దార్లు వెతుకుతున్నారు.