నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మొన్నటి వరకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నేతలు భేటీ అయ్యారు. ఈ పరిణామాలు జిల్లాలో ఆసక్తికరంగా మారాయి. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డితో దుత్తలూరులో సమావేశం అయ్యారు. కంభంతో మేకపాటి భేటీ ఆసక్తికరంగా మారింది.. ఇద్దరు నేతలు దాదాపు రెండు గంటలకుపైగా భేటీ అయ్యారు. తాజా రాజకీయాలపై ఇద్దరు చర్చించుకున్నారు.తాను, మేకపాటి గత ముప్పై ఏళ్లుగా రాజకీయంగా ప్రత్యుర్థులుగా ఉన్నామన్నారు కంభం విజయరామిరెడ్డి.
నియోజకవర్గ అభివృద్ధిలో కంభంతో కలిసి నడుస్తానన్నారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ప్రస్తుతం తాను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నానని.. ఈ నియోజక వర్గంలో కంభం విజయ రామిరెడ్డి, తాను ప్రతి ఒక్కరికీ తెలుసు అన్నారు. విజయరామిరెడ్డితో కలసి ఉదయగిరి నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తాను అన్నారు.మొన్నటి వరకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నేతలు ఉన్నట్టుండి సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరతారనే చర్చ జరుగుతోంది. దీంతో ఉదయగిరి టీడీపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే ఉదయగిరి టీడీపీ ఇంఛార్జ్‌గా బొల్లినేని రామారావు ఉన్నారు.
ఒకవేళ మేకపాటి టీడీపీలోకి వస్తే టికెట్ ఎవరికి ఇస్తారనే చర్చ మొదలైంది. మేకపాటి కూడా టికెట్ విషయంలో మద్దతు కోసం కంభం విజయరామిరెడ్డిని కలిశారా అనే చర్చ జరుగుతోంది.ఇటు వైఎస్సార్‌సీపీ కూడా ఇప్పటి వరకు ఉదయగిరి నియోజకవర్గానికి ఇంఛార్జ్‌ను నియమించలేదు. ఈ రేసులో మేకపాటి అభినయ్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు బాధ్యతలు అప్పగిస్తారని చర్చించుకుంటున్నారు. మరో ఒకటి రెండు పేర్లు వినిపిస్తున్నా.. మేకపాటి కుటుంబానికే టికెట్ ఇస్తారని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే మేకపాటి ఫ్యామిలీ ఉదయగిరిపై ఫోకస్ పెట్టింది.
పార్టీ నేతలు చేజారి పోకుండా జాగ్రత్త పడుతోంది.ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేశారనే ఆరోపణలతో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ సస్పెండ్ చేసింది. ఆయనతో పాటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డిపై కూడా వేటు పడింది. ఆ తర్వాత ఉదయగిరిలో స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలతో సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయాలు వేడెక్కాయి. మళ్లీ చాలా రోజుల తర్వాత చంద్రశేఖర్ రెడ్డి రాజకీయాల్లో బిజీ అయ్యారు. కంభం విజయరామిరెడ్డితో భేటీ అయ్యారు. మొత్తం మీద నెల్లూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి.