వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్మోహన్‌రెడ్డికి లబ్ధి చేకూర్చేందుకు బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త వ్యూహానికి తెరలేపారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. జగన్ వైఖరిపై తీవ్ర అసహనంతో ఉన్న కాపుల ఓట్లు గంపగుత్తగా టీడీపీ-జనసేనకు వెళ్లకుండా.. వాటిని చీల్చేయాలని ఆయన భావిస్తున్నారని చెబుతున్నాయి. అందుకే ఆదివారం హైదరాబాద్‌లో కాపు వర్గానికి చెందిన కొందరు మాజీ అఖిల భారత సర్వీసు అధికారులతో సమావేశమయ్యారు. వీరిలో మాజీ ఐఏఎస్ అధికారి అయిన బీఆర్‌ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌తో పాటు తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్‌రావు, రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారులు పీవీ రావు, రంగిశెట్టి మంగబాబు, మాజీ ఐఏఎస్ లక్ష్మీకాంతంతో పాటు పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు సహా 25 మంది ప్రముఖులు ఉన్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ భోజన సమావేశంలో అసాధారణంగా మూడున్నర గంటలకు పైగా చర్చించారు. జంట నగరాల్లోని తెలగ, కాపు, ఒంటరి, బలిజ కులాల కోసం భవనం నిర్మించుకోవడానికి ఐదు ఎకరాల స్థలం, రూ.10 కోట్ల నగదు మంజూరు చేయాలని రిటైర్డ్ అధికారులు కోరారు. కేసీఆర్ సానుకూలంగా స్పందించి.. కచ్చితంగా ఇస్తానని.. తానే ఆ భవనాన్ని ప్రారంభిస్తానని, వారు ఏం కోరినా చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే తెలంగాణలో ఉన్న 25 లక్షల మంది మున్నూరు కాపు ఓటర్లు తనకే మద్దతిచ్చేలా చేయాలని వారిని కోరారు. ఇక తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జగన్ తరఫున వారితో ఆయన మంతనాలు జరిపారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీడీపీతో జనసేన కలవకూడదని.. ఒంటరి పోరుకు పవన్ కల్యాణ్‌ను ప్రోత్సహించాలని కూడా సూచించినట్లు సమాచారం.
ఈ సారి గాజు గ్లాసుకు ఇబ్బందేమి లేదు.
ఏం జరిగింది..?
శనివారం మేఘాలయ రిటైర్డ్ సీఎస్ కేఎం కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ‘కాపు ఐకానిక్ గ్రూపు’ సమావేశం జరిగింది. 4 రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కాపు నేతలు కుటుంబాలతో తరలి వచ్చారు. మున్నూరు కాపుల ఓట్లపై కన్నుతో తెలంగాణ బీజేపీ నేతలే లు ఈ భేటీని ఏర్పాటు చేయించినట్లు కేసీఆర్‌కు తెలిసింది. దీంతో బీఆర్‌ఎస్ ఏపీ నేత తోట చంద్రశేఖర్‌ను పిలిపించుకుని.. తెలంగాణ, కాపు, ఒంటరి, బలిజ నాయకులను తీసుకురావాలని పురమాయించారు. ఆదివారం వారితో సమావేశమయ్యారు. సాధారణంగా ఆయన ఎవరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వరు. అలాంటిది తనంత తానే వారిని పిలిపించుకుని ఏకంగా మూడున్నర గంటలు చర్చించారు. తెలంగాణ రాజకీయాలపై కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే ఎక్కువ సేపు మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం.